Twitter fires two top executives: ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. కీలక మార్పులు చేపట్టనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇద్దరు టాప్ మేనేజర్లను తొలగించింది ఆ సంస్థ. ట్విట్టర్‌ను మస్క్ కొనుగోలు చేసిన తర్వాత అంతర్గతంగా అనిశ్చితి నెలకొందనడానికి ఇది సంకేతంగా కనిపిస్తోంది.
ట్విట్టర్ జనరల్ మేనేజర్ కేవోన్ బేక్పూర్ ఏడేళ్ల తర్వాత సంస్థను వీడుతున్నారు. ఈ క్రమంలో వరుస ట్వీట్లు చేశారు కేవోన్. 'ప్రస్తుత బృందాన్ని వేరే దిశలో తీసుకెళ్లాలనుకుంటున్నానని నాకు తెలియజేసిన తర్వాత సంస్థను వీడాలని సీఈఓ పరాగ్ అగర్వాల్ కోరారు. ట్విట్టర్‌కు మంచి రోజులు ముందున్నాయని నేను ఆశిస్తున్నా. ప్రపంచంలో ముఖ్యమైన, ప్రత్యేక, ప్రభావవంతమైన సాధనాల్లో ట్విట్టర్ ఒకటి. సరైన మార్గనిర్దేశం ఉంటేనే ఆ ప్రభావం కనిపిస్తుంది.' అని పేర్కొన్నారు బేక్పూర్. 2015లో తన స్టార్టప్ కంపెనీని ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత సంస్థలో చేరారు.
ట్విట్టర్ రెవెన్యూ, ప్రొడక్ట్ విభాగం మేనేజర్ బ్రూస్ ఫాల్క్‌ను సైతం తొలగించింది సంస్థ. ప్రస్తుతం ఆయన ట్విట్టర్ ఖాతా బయోలో నిరుద్యోగి అని కనిపించటమే అందుకు నిదర్శనం.'ఇంజనీర్లకు ఈ ట్వీట్‌ను అంకితం చేస్తున్నా. మీతో కలిసి పని చేసే అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది కాబట్టి తిరిగి పనిలోకి వెళ్లండి.' అని ట్వీట్ చేశారు. మరోవైపు.. ఇద్దరిని తొలగించినట్లు ట్విట్టర్ ధ్రువీకరించింది. ప్రస్తుతం బిజినెస్లోని కీలక విభాగాల్లో మినహా అన్ని నియామకాలను నిలిపేసినట్లు తెలిపింది.
పరాగ్, గద్దె విజయ భవిష్యత్తేమిటి?
భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్, లీగల్ హెడ్ విజయ గద్దె ట్విట్టర్లో కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. అయితే, ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్న మాలన్ మస్క్.. మొదటి నుంచే వారి పట్ల సానుకూలంగా లేరని తెలుస్తోంది. సీఈఓ పదవి నుంచి పరాగ్‌ను తొలగించి కొత్త వారిని నియమించే అవకాశం ఉన్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఇద్దరు కీలక ఉద్యోగులను ట్విట్టర్ తొలగించటం వల్ల ఆ వాదనలకు మరింత బలం చేకూరినట్లవుతోంది. అయితే, మస్క్‌కు కంపెనీని అధికారికంగా అప్పగించే వరకు సీఈఓగా పరాగ్ కొనసాగనున్నారు. కానీ, అంతకుముందే తీసివేస్తే 42 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.
ట్విట్టర్ లీగల్ హెడ్‌గా ఉన్న విజయ గద్దె పట్ల సైతం ఎలాన్ మస్క్ సానుకూలంగా లేరని స్పష్టంగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. గతంలో ఆమె తీసుకున్న నిర్ణయాల పట్ల సైతం మస్క్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో వారి ఇరువురికి మస్క్ ఉద్వాసన పలకటం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: పరాగ్‌కు ఉద్వాసన తప్పదా? 'ట్విట్టర్' ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన
ట్విట్టర్ యూజర్లకు మస్క్ షాక్- వారు డబ్బు చెల్లించాల్సిందే!