Term Insurance Plan Selection Tips : కుటుంబంలోని ఓ సభ్యుడు అనుకోకుండా దూరమైనప్పుడు ఆ బాధను ఎవరూ తీర్చలేరు. ఇక ఆ వ్యక్తిపైనే సంపాదన బాధ్యతలు ఉంటే.. అతడిపై ఆధారపడిన ఆ కుటుంబానికి ఇబ్బందులు రెట్టింపు అవుతాయి. ఇలాంటివి జరిగినప్పుడు కుటుంబ సభ్యులు ఇబ్బందుల్లో పడకుండా.. కుటుంబానికి తగిన ఆర్థిక రక్షణ కల్పించడమనేది ఆర్జించే ప్రతి ఒక్కరి బాధ్యత. ఇందుకోసం తగిన మొత్తంతో టర్మ్ పాలసీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సరైన టర్మ్ పాలసీని ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి? అనే విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి.
కాలానుగుణంగా, వివిధ వ్యక్తుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వివిధ బీమా సంస్థలు పలురకాల పాలసీలను అందిస్తున్నాయి. ఇందులో వేటిని ఎంచుకోవాలన్న సందేహం రావడమనేది మాములు విషయమే. మీ అవసరాలు, బాధ్యతలు, ఎన్ని సంవత్సరాలకు బీమా తీసుకోవాలనేది ముఖ్యమైన విషయం. సహేతుకమైన ప్రీమియంతో, గరిష్ఠంగా రక్షణ కల్పించే పాలసీలను ఎంచుకోవడం ఉత్తమం. ఇందుకోసం పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే..
అవసరాలకు అనుగుణంగా..
టర్మ్ పాలసీని ఎంచుకునేటప్పుడు మీ కుటుంబ ఆర్థిక అవసరాలపై ముందుగా ఒక అంచనాకు రావాలి. ప్రస్తుతం మీరు ఉన్న దశ ఏమిటి? కుటుంబం ప్రస్తుత జీవన ప్రమాణాలను కొనసాగించేందుకు ఎంత డబ్బు అవసరం అవుతుంది లాంటివి చూసుకోవాలి. అనుకోని సంఘటన ఎదురైనప్పుడు.. భవిష్యత్తులో ఆర్థికపరమైన ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలే చూసుకోవాలి. ఆ ప్రకారం ఎంత విలువ గల పాలసీని తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. దీనికోసం మీ నికర ఆదాయం ఎంత? మీపై భాధ్యతలు ఏమున్నాయి? ఊహించని ఖర్చులు విషయమేంటి? అప్పులు మొదలైన విషయాలన్నీ చూసుకోవాలి. మీ అవసరాలపై సంపూర్ణ అవగాహన లేకుండా పాలసీని ఎంచుకోవడం వల్ల తక్కువ మొత్తానికి బీమా తీసుకునే అవకాశం ఉంది. ఫలితంగా అవసరానికి డబ్బు సరిపోకపోవచ్చు.
ఎంత కాలపరిమితికి అనేది ముఖ్యం
ఎంత మొత్తానికి రక్షణ కావాలి అని నిర్ణయం తీసకున్న తర్వాత చూడాల్సిన ముఖ్యమైన అంశం.. కాలపరిమితి. మీ బాధ్యతల బరువులు తీరేదాకా పాలసీ కొనసాగేలా కాలపరిమితిని నిర్ణయించుకోవాలి. తక్కువ వ్యవధికే పాలసీలు తీసుకుంటే.. కాస్త ప్రీమియం తగ్గొచ్చు. కానీ, అవసరానికి ఉపయోగపడదు. కాబట్టి, మీ బాధ్యతలు తీరేంతవరకూ బీమా రక్షణ కొనసాగేలా చూసుకోవడం చాలా అవసరం.
బాధ్యతలను దృష్టిలో ఉంచుకొండి
టర్మ్ ప్లాన్ ఎంచుకునేటప్పుడు చాలామంది సంవత్సర రాబడిని మాత్రమే పరిగణనలోకి తీసుకొంటుంటారు. దీంతోపాటు రుణ బాధ్యతలనూ చూడాలి. ఉదాహరణకు వాహన, గృహ, విద్యా రుణాల మొత్తాలనూ పరిగణలోకి తీసకుని పాలసీ విలువ నిర్ణయించుకోవాలి. సంపాదించే వ్యక్తి దూరమైనప్పుడు అప్పుల భారం కుటుంబ సభ్యులపై పడితే, అది వారిని మరింత ఇబ్బందుల్లోకి నెడుతుంది.
అనుబంధ పాలసీలతో
టర్మ్ పాలసీని తీసుకునేటప్పుడు కొన్ని అనుబంధ పాలసీలనూ ఎంపిక చేసుకునేందుకు ప్రయత్నించవచ్చు. వీటివల్ల మీకు అదనపు రక్షణ లభిస్తుంది. ఇవన్నీ నామమాత్రపు ప్రీమియంలతోనే అందుబాటులో ఉంటాయి. మీ పాలసీకి ఏ రైడర్ లేదా యాడ్-ఆన్‌లను చేర్చాలనే విషయాన్ని ఒక సారి గమనించవలసిన అవసరం ఉంది. అవసరమైతే బీమా సంస్థ సహాయ కేంద్రం సూచనలును తీసుకోవచ్చు. ప్రధానంగా.. తీవ్ర వ్యాధులకు వర్తించే క్రిటికల్ ఇల్‌నెస్; ప్రీమియం వైవర్ రైడర్; పిల్లలకు పరిహారం లభించే వీలుండే చైల్డ్ సపోర్ట్ రైడర్; ప్రమాదంలో శాశ్వత వైకల్యం సంభవిస్తే.. యాక్సిడెంటల్ డిజేబిలిటీ రైడర్; కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు క్రమం తప్పకుండా కొంతకాలంపాటు ఆదాయాన్ని అందించే ఫ్యామిలీ ఇన్‌కమ్ బెనిఫిట్ రైడర్ లాంటివాటిని ఎంచుకోవచ్చు. భవిష్యత్తు అంచనా..ప్రస్తుతం మీ జీవన శైలి భవిష్యత్తులోనూ కొనసాగేలా ఉండే విధంగా చూసుకొనుట అవసరం. అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు కుటుంబానికి ఆ మేరకు భరోసా లభించాలి. పాలసీ తీసుకునేటప్పుడు ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరిచిపోవద్దు.
వివిధ బీమా సంస్థల టర్మ్ పాలసీలు పోల్చి చూడండి
వివిధ బీమా సంస్థలు అందిస్తున్న టర్మ్ పాలసీలను ఒక సారి పోల్చి చూడండి. బీమా కంపెనీ వెబ్సైట్లో వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. అదే సమయంలో ఏవిధంగా చెల్లిస్తున్నారు ఆ వివరాలు చూడడం అవసరం. కేవలం ప్రీమియం తక్కువగా ఉందనే కారణంతోనే బీమా పాలసీని ఎంచుకోవద్దు. బీమా సంస్థ పేరు, చెల్లింపుల తీరు, అవసరాల్లో సాయం చేసే విధానంలాంటివీ బీమా పాలసీ ఎంచుకోనుటలో అతిముఖ్యమని గుర్తించుకొండి. మినహాయింపుల కోసం తెలుసుకోవాలి. పాలసీదారుడు అనుకోని పరిస్థితుల వల్ల కుటుంబానికి దూరమైనప్పుడు ఆర్థికంగా అండగా నిలిచేలా టర్మ్ పాలసీ ఉండాలి. అందుకే, పాలసీని తీసుకునేవారు ఎలాంటి పాలసీని తీసుకోవాలి అనేది అతిముఖ్యం.
చిక్కుల్లేకుండా బీమా పరిహారం పొందాలంటే - ఈ జాగ్రత్తలు తప్పనిసరి!