Stock Markets Close : 2022 ఆఖరి సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. తీవ్ర ఒడుదొడుకుల అనంతరం.. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 293 పాయింట్లు పతనమై 60,840 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ 85 పాయింట్లు తగ్గి 18,105 వద్ద స్థిరపడింది.
లాభనష్టాల్లోనివి: సెన్సెక్స్ 30 ప్యాక్‌లో బజాజ్ ఫిన్సర్వ్, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, విప్రో, టాటా స్టీల్, టాటా మోటార్స్, కొటాక్ బ్యాంక్, ఎన్టీపీసీ, టెక్ మహేంద్ర, రిలయన్స్ షేర్లు లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, మారుతీ, అల్ట్రాసెమ్కో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ సంస్థలు నష్టపోయాయి.
అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నం తర్వాత క్రమంగా అమ్మకాల సెగ తగిలింది. కొత్త సంవత్సరం ముగింపు నేపథ్యంలో పోర్ట్‌ఫోలియోను పునర్‌వ్యవస్థీకరించుకోవడంలో భాగంగా మదుపర్లు ఆఖర్లో విక్రయాలకు దిగి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఈ ఏడాది సెన్సెక్స్ 4.4 శాతం, నిఫ్టీ 4.3 శాతం పెరిగాయి.
రూపాయి విలువ:
అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 15 పైసలు ఎగబాకి 82.72 వద్దకు చేరింది.
2022లో స్టాక్ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో ఏడాది అంతర్జాతీయ మార్కెట్లను మించి రాణించాయి. ఈ ప్రయాణంలో దేశీయ మదుపర్లు కీలక పాత్ర పోషించారు. ఒకదాని వెనుక మరో సవాల్ వచ్చిపడుతున్నా.. మార్కెట్‌లోకి 'మనీ'ని కుమ్మరించి సూచీలను నిలబెట్టారు. 2022లో జాతీయ స్టాక్ మార్కెట్ సూచీ నిఫ్టీ 18,887 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకి దాదాపు 19,000కు చేరువైంది. క్రితం ఏడాదితో పోలిస్తే 4.4 శాతం పెరిగింది.
సెన్సెక్స్ 4.3 శాతం పుంజుకొని 63,583 వద్ద రికార్డు స్థాయిని అందుకుంది. విదేశీ మదుపర్లు ఈ సంవత్సరంలో భారీ ఎత్తున పెట్టుబడులను ఉపసంహరించుకున్నా.. దేశీయ మదుపర్ల కొనుగోళ్లతో సూచీలు నిలబడ్డాయి. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయాలు, విధానపరమైన నిర్ణయాలు 2022లో ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేసిన అంశాల్లో ఉన్నాయి.