అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పవనాల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్‌లో నష్టాలను మూటగట్టుకున్నాయి. ఉదయం బలహీనంగా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. ఉదయం 60 వేల 392 పాయింట్ల వద్ద బాంబే స్టాక్ ఎక్చ్సేంజి సూచీ సెన్సెక్స్ నష్టాలతో ప్రారంభమైంది. ఓ దశలో గరిష్ఠంగా 991 పాయింట్లు దిగజారింది. చివరికి 928 పాయింట్ల నష్టంతో 59 వేల 745 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 272 పాయింట్ల నష్టంతో 17 వేల 554 పాయింట్ల వద్ద ముగిసింది. బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎల్అండ్‌టీ, ఎన్‌టీపీసీ షేర్లు అత్యధికంగా నష్టపోయిన జాబితాలో ఉన్నాయి.
అమెరికా మార్కెట్లు 2023లో అతిపెద్ద ఒకరోజు నష్టాన్ని మంగళవారం నమోదు చేశాయి. ఆసియా- పసిఫిక్, ఐరోపా మార్కెట్లు సైతం అదే బాటలో పయనించాయి. ఫిబ్రవరి ద్వైమాసిక పరపతి విధాన సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ను ఆర్‌బీఐతో పాటు అటు ఫెడ్ విడుదల చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణంపై ఆయా సంస్థల వైఖరి ఎలా ఉండనుందనే అంచనాలు మార్కెట్లను ప్రభావితం చేశాయి. భారత్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో మరోసారి 6.5 శాతానికి ఎగబాకగా అదే సమయంలో అమెరికాలోనూ 6.4 శాతానికి చేరింది. ఈ నేపథ్యంలో వడ్డీరేట్ల పెంపు సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందన్న విశ్లేషణలు మార్కెట్ల సెంటిమెంటును దెబ్బతీశాయి.
అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు బుధవారం మరింత పతనమయ్యాయి. ఆ సంస్థ కావాలని అనుకూల వ్యాసాలు రాయించిందని వికీపీడియా చేసిన ఆరోపణలు అదానీ షేర్లపై ప్రభావం చూపాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ విల్మర్ షేర్లు 5 శాతం నష్టపోయి లోయర్ సర్క్యూట్‌ని తాకాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు అత్యధికంగా 11.08 శాతం నష్టపోయింది.