అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలకు తోడు ఐటీ, ఎంఎఫ్‌సీజీ సెక్టార్లలో అమ్మకాల ఒత్తిడితో దేశీయ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ సుమారు 2 శాతానికిపైగా నష్టపోయాయి. ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించిన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేదు. సెన్సెక్స్ 617 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 17వేల దిగువకు చేరుకుంది.
- బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్ 617 పాయింట్ల నష్టంతో 56,580 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో.. 56,758 వద్ద ప్రారంభమైన సూచీ అమ్మకాల ఒత్తిడితో ఓ దశలో 56,357 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయింది. ఆ తర్వాత 56,876 పాయింట్ల గరిష్ఠాన్ని తాకి.. చివరకు 56,580 వద్ద స్థిరపడింది.
- జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- నిఫ్టీ 218 పాయింట్ల కోల్పోయి 16,954 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో.. 17,009 వద్ద ప్రారంభమైన సూచీ ఓ దశలో 16,889 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. ఆ తర్వాత కోలుకున్న సూచీ 17,054 పాయింట్ల గరిష్ఠాన్ని తాకి చివర్లో అమ్మకాల ఒత్తిడితో 16,954 వద్ద ముగిసింది.
లాభనష్టాల్లోనివి: బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీ బ్యాంక్, కొటమ్ మహీంద్ర, హెచ్‌డీఎఫ్‌సీలు లాభాల్లో ముగిశాయి. కోల్ఇండియా, బీపీసీఎల్, టాటా స్టీల్, ఎస్బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, హిందాల్కో భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.
- మార్కెట్ల నష్టాలకు కారణాలు: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలతో దేశీయ మార్కెట్లపై ప్రభావం పడింది. ఏప్రిల్ 22న అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అలాగే చైనా, హాంగ్‌కాంగ్ నేతృత్వంలోని ఇతర ఆసియా మార్కెట్లు సైతం నష్టాల్లోకి వెళ్లటం వల్ల మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
- చైనాలో కరోనా కలకలం: ప్రపంచంలోనే రెండే ఆర్థిక వ్యవస్థ అయిన చైనాలో గత ఫిబ్రవరి నుంచి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చైనా జీరో కోవిడ్ పాలసీతో విధించిన లాక్డౌన్ కారణంగా పరిశ్రమలపై ప్రభావం పడింది. చైనా జీడీపీ వృద్ధి తగ్గి అంతర్జాతీయ ఎగుమతులు, ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపనుందనే ఆందోళనలు మొదలయ్యాయి.
- ద్రవ్యోల్బణం: ఇండోనేసియా ముడి పామాయిల్ ఎగుమతులపై నిషేధం విధించిన క్రమంలో ధరల పెరుగుదలపై మదుపరులు దృష్టిసారించారు. ఇప్పటికే భారత్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 7 శాతానికి చేరింది. ఇండోనేసియా నిర్ణయంతో ఆహారా వస్తువుల ధరల భారీగా పెరిగే అవకాశం ఉంది.
- వడ్డీ రేట్ల పెంపు: వచ్చే వారం జరగనున్న సమావేశంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచనుందనే ఆందోళనలు మార్కెట్లపై ప్రభావం చూపాయి.
- ఎఫ్‌పీఐ: దేశీయ మార్కెట్లలో పతనానికి ప్రధాన కారణం విదేశీ సంస్థాగత మదుపరులు తమ సొమ్మును వెనక్కి తీసుకోవటమే. వరుసగా ఏడో నెలలోనూ భారీగా విదేశీ మదుపురులు అమ్మకాలు జరిపారు. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.2 లక్షల కోట్లు దేశీయ మార్కెట్ నుంచి తరలివేళ్లాయి. మరోవైపు.. రష్యా, ఉక్రెయిన్ రెండు నెలలుగా కొనసాగుతుండటమూ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది.