Smart Ways To Invest In Gold On Dhanteras : దీపావళి అమావాస్యకు రెండు రోజుల ముందు ధన త్రయోదశి (ధన్‌తేరస్) వస్తుంది. ఈ సందర్భంగా బంగారం, వెండి ఆభరణాలు - రూపులు, వాహనం వంటివి కొనుగోలు చేసి, లక్ష్మీదేవిని పూజిస్తే మరింత కలిసి వస్తుందని నమ్ముతుంటారు. గడిచిన సంవత్సర కాలంలో చూస్తే బంగారంపై 16 శాతానికి పైగా రిటర్స్ వచ్చాయి. బంగారం ధర పెరిగితే, మన సంపద విలువ కూడా పెరుగుతుంది. దీని కారణంగా ధన్‌తేరస్ కొనుగోళ్లు/ పెట్టుబడులకు ఇటీవలి కాలంలో ప్రాచుర్యం పెరుగుతోంది. బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేద్దామనుకునే వారు.. త్వరలో ఇంట్లో శుభకార్యాలు నిర్వహించాలనుకునే వారు ధన్‌తేరస్ సందర్భంగా వాటిని కొనుగోలు చేస్తారు. మిగిలినవారు నాణేలు, బిస్కెట్ల రూపంలో విలువైన లోహాలను కొంటుంటారు. అయితే ఈ సెంటిమెంటు వల్లే పసిడి, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. అయినా.. ధన త్రయోదశి సమయంలో అమ్మకాలు సాధారణంగా అధికంగా ఉంటాయి. ఇక ప్రజల్లో పెట్టుబడి రూపంలోనే పసిడి సమీకరించుకునే ధోరణి కూడా పెరిగింది. ఇందుకోసం అనేక రకాల మదుపు మార్గాలు ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇలాంటి వాటిని లోహ రూపంలో కొనుగోలు చేయడం, మిగిలిన పద్ధతుల్లో పెట్టుబడిపై వచ్చే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
లోహ రూపంలో..
చాలా మంది 22 క్యారెట్ల (916 స్వచ్ఛత) నాణ్యత కలిగిన బంగారు ఆభరణాలు కొనేందుకే ఇష్టపడతారు. అయితే ఇవే కాకుండా 14 (585 స్వచ్ఛత), 18 (750 స్వచ్ఛత), 20 క్యారెట్ల బంగారు ఆభరణాలు కూడా అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా పసిడి ధరను 24 క్యారెట్ల (999 స్వచ్ఛత) ఆధారంగా లెక్కగడతారు. 10 గ్రాముల మేలిమి పసిడి ధర అన్ని పన్నులతో కలిపి దాదాపు రూ.62,000 ఉంది. ఇక అదే ఆభరణాలకు ఉపయోగించే 22 క్యారెట్లకు పసిడి ధర లెక్కిస్తే (62000*91.6%) 10 గ్రాములకు రూ.56,800 పలుకుతుంది. మిగిలిన క్యారెట్ల ఆభరణాలకూ ఇలానే లెక్కించుకోవాలి. చాలా వరకు బంగారం ధర స్వచ్ఛత అనుగుణంగా మారుతుంది. కాబట్టి, ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి.
ధర ఒక్కటే..!
ఆన్‌లైన్ అందుబాటులో లేని సమయంలో, వివిధ నగరాల్లో స్థానిక వర్తక సంఘాలు అక్కడి వ్యయాలకు తగ్గట్టు బంగారం ధరను నిర్ణయించేవి. వాటిని ప్రతిరోజూ ప్రకటించేవి. కానీ ఇప్పుడు అంతా ఆన్‌లైన్ కావడం వల్ల దాదాపు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఒకటే ధర అతి స్వల్ప మార్పులతో అమలు అవుతోంది. ముఖ్యంగా ఆభరణాల తయారీ ఛార్జీ, తరుగు శాతంలో మాత్రమే ప్రతి దుకాణానికీ తేడాలు ఉంటాయి. మేలిమి పసిడి కొని ఆ తర్వాత ఆభరణాలు చేయించుకున్నా.. తయారీ/ తరుగు భారం తప్పదు. అయితే పసిడి అభరణాలపై భారతీయ ప్రమాణాల మండలి (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్) బీఐఎస్ హాల్‌మార్కింగ్ ఉందో లేదో జాగ్రత్తగా చూసుకోవాలి. దీంతో పాటు వాటిని తగిన బిల్లుతో కొనాలి. అప్పుడే మనం చెల్లించిన డబ్బుకు తగిన విలువైన సొత్తు పొందడమే కాదు.. ఆర్థిక భద్రత కూడా ఉంటుంది. అయితే 3 శాతం జీఎస్‌టీ తగ్గుతుందని, బిల్లు అక్కర్లేకుండా కొనుగోలు చేసుకోమని వ్యాపారులు చెబుతారు. కానీ వారి మాట వినొద్దు. అలా చేస్తే కొనుగోలు తర్వాత ఆభరణ స్వచ్ఛతను పరీక్షించుకుని, వాటి క్వాలిటీ తగ్గిందని అడగడానికి మనకు ఆధారం ఉండదు.
బీఐఎస్ కేర్ యాప్..
Bis Care Gold Check : ఆభరణంపై నకిలీ హాల్‌మార్కింగ్ గుర్తులను కూడా వేసి, కొందరు మోసం చేస్తున్నారు. అందుకే ప్రతి అధీకృత హాల్‌మార్కింగ్ ఆభరణానికి హాల్‌మార్క్ యునీక్ ఐడెంటిఫికేషన్ (హెచ్‌యూఐడీ) నంబరు ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ మొబైల్‌లో బీఐఎస్‌కేర్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే, ఈ నంబరును పరీక్షించుకోవచ్చు. ఏదైనా తేడా ఉంటే ఈ యాప్ ద్వారానే ఫిర్యాదు చేయొచ్చు.
వెండితో స్వచ్ఛత తెలుసుకోవాలి..
వెండి రూపులు, పాత్రలను 990, 970, 925, 900, 835, 800 స్వచ్ఛతతో విక్రయించాల్సి ఉంది. మనం వెండి వస్తువులు కొనేటప్పుడు కిలో రేటు (ప్రస్తుతం) రూ.72,000ను చూపి.. మనం కొనే గ్రాములకు ధర వసూలు చేస్తుంటారు. బంగారం లాగానే దానిలో స్వచ్ఛత ఎంతుందో తెలుసుకోవడం మరవద్దు. వీటికీ తయారీ ఛార్జీలు వేస్తుంటారు.
రూ.50,000 కు మించితే..
బంగారం రంగంలో పారదర్శకత తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా రూ.50,000కు మించి వ్యాపారులు నగదు తీసుకోవడం లేదు. కార్డు/ఆన్‌లైన్/చెక్కు ద్వారా కొనుగోలు చేస్తే వివరాలన్నీ లభిస్తాయి. అప్పుడు కొనుగోళ్లపై ఏ ఆంక్షలూ ఉండవు.
అమ్ముకోవడం సులభం కాదు
ఆర్థిక అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఆభరణాలను తనఖా పెట్టి, రుణం తీసుకుంటాం. అది సులభమే. కానీ వాటిని అమ్మేద్దామంటే చాలా మంది వాటిని 10-20 శాతం తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. మూలధన లాభాల ట్యాక్స్ కూడా చెల్లించాల్సి వస్తుంది. అదే కొత్త ఆభరణాల కోసం మార్చుకుంటే.. మన ఆభరణం బరువుకు సమానంగా ఇస్తారు. కొత్త ఆభరణంపై తయారీ-తరుగు ఉండటం మామూలే.
గోల్డ్ ఈటీఎఫ్‌లు
Gold Exchange Traded Funds : ఈక్విటీ షేర్లలో పెట్టుబడులు పెట్టే మ్యూచువల్ ఫండ్‌ల లాగా బంగారంపై పెట్టుబడులు పెట్టేవే బంగారం ఈటీఎఫ్‌లు. ఒక గోల్డ్ ఈటీఎఫ్ విలువ ఒక గ్రాము పసిడికి సమానం. వీటి కొనుగోళ్లపై జీఎస్‌టీ వర్తించదు. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో పసిడి ఈటీఎఫ్‌లు నమోదవుతాయి. డీమ్యాట్ ఖాతా ద్వారానే వీటిని కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. మన ఖాతాలోని బంగారు ఈటీఎఫ్‌ల విలువను రోజూ చూసుకుంటూ, అవసరమైనప్పుడు వాటిని అమ్ముకోవచ్చు. వీటి అమ్మకంపై కూడా మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి వస్తుంది.
ఇక బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి పసిడి ఈటీఎఫ్‌లతోపాటు గోల్డ్ ఫండ్లు కూడా అందుబాటులో ఉంటాయి. వీటిని కూడా మ్యూచువల్ ఫండ్ సంస్థలే నిర్వహిస్తాయి. బంగారు లోహం, పసిడి ఈటీఎఫ్‌లు, బంగారాన్ని తవ్వితీసే గనుల సంస్థలు, పంపిణీ సంస్థలపై పెట్టుబడి పెడతాయి. ఈ పెట్టుబడులపై వచ్చే రిటర్స్ ఆధారంగా ఈ బాండ్ల ధర ఉంటుంది.
డిజిటల్ గోల్డ్..
Digital gold : యూపీఐ చెల్లింపులకు వినియోగిస్తున్న పేటీఎం, ఫోన్‌పే వంటి ఆన్‌లైన్ పేమెంట్ సంస్థల్లో.. మన దగ్గర ఉన్న డబ్బులకు అనుగుణంగా బంగారం కొనుగోలు చేయొచ్చు. ఎంఎంటీసీ- పాంప్ నాణ్యతా ధ్రువీకరణతో 999 స్వచ్ఛత కలిగిన మేలిమి బంగారాన్ని మనం పెట్టే పెట్టుబడికి అనుగుణంగా మన ఖాతాలోకి జమ చేస్తాయి. ఈనెల 9న గ్రాము ధర రూ.6190.8గా ఉంది. అయితే మన వద్ద ఉన్న రూ.5,000తో కొందామనుకుంటే.. 0.8076 గ్రాముల బంగారం మన ఖాతాలోకి చేరుతుంది. అవసరమైనప్పుడు మన ఖాతాలోని పసిడిని అమ్మడమూ యాప్ ద్వారానే సులభంగా చేసుకోవచ్చు. కావాలనుకుంటే డెలివరీ కూడా తీసుకోవచ్చు. కానీ జీఎస్‌టీ వర్తిస్తుంది. అమ్మినప్పుడు వచ్చే లాభాలపై మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
సార్వభౌమ పసిడి బాండ్లు..
Sovereign Gold Bonds : ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్వభౌమ (సావరిన్ గోల్డ్ బాండ్స్) బాండ్లను జారీ చేస్తుంది. ఈ బాండ్లను, వ్యక్తులు ఒక ఆర్థిక సంవత్సరంలో 1 గ్రాము నుంచి 4 కిలోగ్రాముల వరకు కొనవచ్చు. ఆన్‌లైన్‌లో చెల్లింపు జరిపితే గ్రాముకు రూ.50 మినహాయింపు కూడా లభిస్తుంది. జీఎస్‌టీ ఉండదు కాబట్టి, మార్కెట్లో లోహం కంటే తక్కువ ధరకే వస్తుంది. అయితే ఈ రకమైన పెట్టుబడిపై ఏడాదికి 2.5 శాతం చొప్పున 6 నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. మనకు వర్తించే ఇన్‌కం ట్యాక్స్ శ్లాబు ప్రకారమే ఈ వడ్డీ ఆదాయంపై కూడా పన్ను చెల్లించాలి. ఈ బాండ్లను మెచ్యూరిటీ గడువుకు ముందే అమ్మినా, ఎవరి పేరిట అయినా బదిలీ చేసినా మూలధన లాభాలపై పన్ను చెల్లించాలి. గడువు పూర్తయ్యేదాకా మన వద్దే ఉంచుకుంటే, ఈ భారం పడదు.
2015 నవంబరులోనే మొదటి సారిగా ఈ బాండ్లను ప్రవేశ పెట్టారు. అప్పుడు ఒక గ్రాము ధర రూ.2,684 చొప్పున విక్రయించారు. 8 సంవత్సరాల గడువు ఈ నెలలో తీరనుంది. ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే 120 శాతం రిటర్స్ లభించినట్లు. దీంతోపాటు ఇప్పటివరకు వడ్డీ ఆదాయం కూడా వచ్చింది. అదే ఆభరణాలు అయితే, మనమే బ్యాంక్ లాకరులో భద్రపరచుకునేందుకు అద్దె కట్టాల్సి వస్తుంది. దీని కారణంగా అవసరమైనంత మేరకు ఆభరణాలు కొనుగోలు చేసి, పెట్టుబడికి అయితే బాండ్లు కొనుగోలు చేసుకోవడం మేలని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
--కాకుమాను అమర్ కుమార్
ధంతేరస్ వేళ భారీగా పెరిగిన బంగారం ధర- ఏపీ, తెలంగాణలో ఎంతంటే?