Fuel Price Hike: సంప్రదాయ పెట్రో ఉత్పత్తుల ధరలు బాగా పెరగడంతో, ఖర్చు పెట్టే శక్తిపై ప్రభావం పడుతుందని ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు ఆందోళన చెందుతున్నారని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సర్వే పేర్కొంది. రాబోయే ఐదేళ్లలో తమ దేశం సంప్రదాయ ఇంధన వినియోగం నుంచి మారాలని ప్రతి పది మందిలో ఎనిమిది మంది (80 శాతం) కోరుకుంటున్నారని వెల్లడించింది. భారత్ విషయానికొస్తే ఇది మరింత అధికంగా 90 శాతంగా (పదిలో 9 మంది) ఉందని పేర్కొంది. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 4 మధ్య 30 దేశాల్లో 22,534 మంది నుంచి డబ్ల్యూఈఎఫ్- ఇప్సోస్ ఈ సర్వే నిర్వహించాయి. ముఖ్యాంశాలు ఇలా..
- ఇంధన ధరలు పెరగడం వల్ల వినియోగ శక్తిపై తీవ్ర ప్రభావం పడుతుందని సగటున 55 శాతం మంది వెల్లడించారు. దక్షిణ ఆఫ్రికాలో 77 శాతం మంది ఈ తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. జపాన్‌లో, టర్కీలో 69 శాతం మంది, భారత్‌లో 63 శాతం మంది ఇదే విషయాన్ని వెల్లడించారు. స్విట్జర్లాండ్ (37%), నెదర్లాండ్స్ (37%)లో తక్కువ మందే ఈ తరహా అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
- ధరలు పెరగడానికి చమురు- గ్యాస్ మార్కెట్లలో ఒడుదొడుకులు కారణమని 28 శాతం మంది చెప్పగా.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్లేనని 25 శాతం మంది తెలిపారు. గిరాకీకి తగ్గట్లుగా సరఫరా లేకపోవడం వల్ల అని 17 శాతం మంది చెప్పగా.. 16 శాతం మంది కారణం తెలియదని పేర్కొన్నారు.
- ధరలు పెరగడానికి ఆయా దేశాలు తీసుకుంటున్న పర్యావరణ పరిరక్షణ విధానాలే కారణం అవుతున్నాయని 13 శాతం మంది భావిస్తున్నారు. ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వాళ్లలో భారత్ నుంచి 24 శాతం మంది ఉండగా.. జర్మనీలో 20%, పోలండ్‌లో 19 శాతం మంది ఉన్నారు.
- పర్యావరణహిత ఇంధనం వైపు తమ దేశం మారాల్సిన అవసరం ఉందని 84 శాతం మంది అభిప్రాయపడ్డారు.
- భారత్ విషయానికొస్తే ఇంధన ధరలు పెరగడానికి సరఫరా కొరతే కారణమని ఎక్కువ మంది భావిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ విధానంలో మార్పులు, చమురు- గ్యాస్ మార్కెట్లలో ఒడుదొడుకులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వంటివి తదుపరి అంచనాలుగా ఉన్నాయి.
ఇదీ చదవండి: Petrol Price Hike: ఆగని పెట్రో బాదుడు.. మళ్లీ పెరిగిన ధరలు