Retail Inflation: దేశంలో వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం కాస్త తగ్గుముఖం పట్టింది. జులైలో ఇది 6.71 శాతంగా నమోదైంది. దేశంలో ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడమే దీనికి కారణం. ఈ మేరకు కేంద్ర గణాంక శాఖ శుక్రవారం గణాంకాలను వెల్లడించింది. దీని ప్రకారం జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణంతో (7.01 శాతం) పోలిస్తే జులైలో కాస్త తగ్గుముఖం పట్టడం ఊరట కల్పించే అంశం. 2021లో ఇదే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.59 శాతమే. ఇదే సమయంలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 6.75 శాతంగా నమోదైనట్లు గణాంక కార్యాలయం తెలిపింది. గత నెలతో పోలిస్తే ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ.. ఆర్‌బీఐ నిర్దేశించుకున్న గరిష్ఠ లక్ష్యం 6 శాతానికి పైనే ద్రవ్యోల్బణం ఉండడం ఆందోళన కలిగించే అంశం. గడిచిన ఏడు నెలలుగా రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతానికి పైనే ఉంటోంది.
పుంజుకున్న పారిశ్రామికోత్పత్తి
దేశంలో జూన్‌లో పారిశ్రామికోత్పత్తి 12.3 శాతం పెరిగిందని కేంద్ర గణాంక శాఖ తెలిపింది. గతేడాది జూన్‌లో ఇది 13.8 శాతంగా ఉంది. త్రైమాసికంలో చూసినప్పుడు ఏప్రిల్ - జూన్‌లో 12.7 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో 44.4 శాతం వృద్ది కనబరిచింది. జూన్‌లో తయారీ రంగం ఉత్పత్తి 12.5 శాతం, మైనింగ్ రంగంలో 7.5 శాతం, విద్యుదుత్పత్తి రంగంలో 16.4 శాతం వృద్ధి నమోదైనట్లు కేంద్ర గణాంక కార్యాలయం తెలిపింది. కొవిడ్ వేళ 2020 మార్చిలో పారిశ్రామికోత్పత్తి కుంటుపడిన సంగతి తెలిసిందే. ఆ నెల 18.7 శాతం క్షీణించింది. లాక్‌డౌన్ విధించడంతో ఆ మరుసటి నెల ఏప్రిల్‌లో ఏకంగా 57.3 శాతం మేర పారిశ్రామికోత్పత్తి క్షీణించింది.
ఇవీ చూడండి: ఆన్లైన్ రుణాలపై ఆర్‌బీఐ కీలక మార్గదర్శకాలు! ఇకపై ఆ సమాచారమంతా ఇవ్వాల్సిందే