RailTel launches PM-WANI: దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సేవలను మరింత వేగంగా అందించేందుకు ప్రభుత్వరంగ సంస్థ రైల్‌టెల్ శ్రీకారం చుట్టింది. తొలి దశలో భాగంగా 100 స్టేషన్లలో 'ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్‌వర్క్ ఇంటర్‌ఫేస్ (పీఎం- వాణి)' సేవలను ప్రారంభించింది. మొత్తం 22 రాష్ట్రాల్లోని 71 ఏ1, ఏ కేటగిరీ స్టేషన్లతో పాటు ఇతర కేటగిరీలకు చెందిన మరో 29 స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
'పీఎం-వాణి' ఆధారిత ఉచిత వైఫై సేవల్ని పొందేందుకు ఆండ్రాయిడ్ ఆధారిత 'వై-డాట్' అనే యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటిలా రైల్వేస్టేషన్లలో 'రైల్‌వైర్ సర్వీస్ సెట్ ఐడెంటిఫయర్' ద్వారా కూడా వైఫై సేవలను ఆనందించొచ్చు. ఈ మొబైల్ యాప్ పద్ధతి దానికి అదనం. వాణి సర్వీసును వినియోగించాలనుకున్న ప్రతిసారి ఓటీపీ అవసరం లేకుండా ఓకేసారి కేవైసీ వివరాలు యాప్‌లో సమర్పిస్తే సరిపోతుందని రైల్‌టెల్ తెలిపింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 6,102 రైల్వే స్టేషన్లలో రైల్‌టెల్ వైఫై సేవలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా ప్రారంభించిన పీఎం-వాణి ఆధారిత సేవల్ని కూడా అన్ని స్టేషన్లకు విస్తరిస్తామని రైల్‌టెల్ తెలిపింది. దీన్ని దశలవారీగా జూన్ 2022 నాటికి పూర్తి చేస్తామని పేర్కొంది.
ఇదీ చూడండి: రైల్వే మైలురాయి- 6,000 స్టేషన్లలో ఉచిత వైఫై