కొత్త మొబైల్ హ్యాండ్‌సెట్ కొనుగోలుకు రూ.2 లక్షలు. అదీ ఒక్క ఏడాదికి తమ టాప్ మేనేజ్‌మెంట్‌కు ప్రభుత్వ రంగ బ్యాంకైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేటాయించిన అలవెన్సు మొత్తమిదీ. ఈ మేరకు సిబ్బంది సంక్షేమ ప్రయోజనాల నిబంధనలను సవరించారు. దీని ప్రకారం.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో మేనేజింగ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు ఈ మొత్తాన్ని కొత్త హ్యాండ్‌సెట్ కొనుగోలు కోసం ఇవ్వనున్నారు. మొబైల్ ధరలో జీఎస్టీని మినహాయించారు. సవరించిన నిబంధనలునలు ఈ ఏడాది ఏప్రిల్ నుంచే అమల్లోకి వచ్చాయని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు ఈ-మెయిల్ పంపినా స్పందించలేదని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
ప్రస్తుతం పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఎండీ, సీఈఓకు సహాయంగా నలుగురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉన్నారు. వీరికి ఏడాదికి కొత్త మొబైల్ హ్యాండ్‌సెట్ కొనుగోలుకు రూ.2లక్షలు చొప్పున అలవెన్సుగా అందించనున్నారన్నమాట. అదే సమయంలో చీఫ్ జనరల్ మేనేజర్లకు మొబైల్ హ్యాండ్‌సెట్ కొనుగోలుకు గతంలో మాదిరిగానే రూ.50వేలు, జనరల్ మేనేజర్లకు రూ.40 వేలు చొప్పున అలవెన్సుగా కేటాయించారు. కార్ల వినియోగానికి సంబంధించిన నిబంధనల్లోనూ పలు మార్పులు చేశారు. సీజీఎం స్థాయి వ్యక్తులు వినియోగించే కార్ల ధరను రూ.12 లక్షల నుంచి 15.50 లక్షలకు; జనరల్ మేనేజర్ స్థాయి వ్యక్తులు వాడే కార్ల ధర పరిమితిని రూ.9 లక్షల నుంచి రూ.11.50 లక్షలకు పెంచారు. 2020లో ఇదే బ్యాంక్.. ఎండీ, ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కోసం మూడు ఆడి కంపెనీకి చెందిన లగ్జరీ కార్లను కొనుగోలు చేసి వార్తల్లో నిలిచింది.
ఇవీ చదవండి