ETV Bharat / business

ఓలా, ఉబర్​కు కేంద్రం వార్నింగ్.. ఎందుకలా చేస్తున్నారంటూ..? - ఉబర్​

Ola Uber Complaints Issue Government: కేంద్ర ప్రభుత్వం.. ఓలా, ఉబర్​తోపాటు క్యాబ్​ అగ్రిగెేటర్​ సంస్థలకు ప్రభుత్వం హెచ్చరించింది. యూజర్స్​ ఫిర్యాదులును త్వరగా పరిష్కరించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. మరోవైపు, ఆన్‌లైన్‌ ప్రయాణ, ఆహార అగ్రిగేటర్ల నియంత్రణకు జోక్యం చేసుకోవాల్సిందిగా ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీసంఘాన్ని ఆతిథ్య పరిశ్రమ సంఘం ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ కోరింది.

ola uber
ola uber
author img

By

Published : May 11, 2022, 4:38 AM IST

Updated : May 11, 2022, 6:40 AM IST

Ola Uber Complaints Issue Government: ఓలా, ఉబర్‌తో పాటు క్యాబ్‌ అగ్రిగేటర్‌ సంస్థలకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించే అంశంలో మెరుగు పడకపోతే, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రయాణ రద్దు(రైడ్‌ కేన్సిల్‌) విధానంతో పాటు పలు అంశాల్లో క్యాబ్‌ అగ్రిగేటర్లు అన్యాయమైన వాణిజ్య విధానాలను పాటిస్తున్నట్లు వినియోగదార్ల నుంచి ఫిర్యాదులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీ ప్రతినిధులతో ప్రభుత్వం మంగళవారం సమావేశమైంది. బుకింగ్‌లను అంగీకరించిన అనంతరం, డ్రైవర్ల ఒత్తిడితో వినియోగదార్లు రైడ్‌ను రద్దు చేసుకోవడం వల్ల ఆ అపరాధ రుసుములను వినియోగదార్లు కట్టాల్సి వస్తోందన్న విషయం తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది.

'వినియోగదార్ల ఫిర్యాదులు పెరుగుతున్నాయి. అందుకు సంబంధించిన గణాంకాలనూ ఇచ్చాం. ఆయా సంస్థలు తమ వ్యవస్థలను మెరుగుపరచుకోవాలని కోరాం. అలా జరగకపోతే కఠిన చర్యలు తీసుకుంటామ'ని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ సింగ్‌ సమావేశం అనంతరం పేర్కొన్నారు. క్యాబ్‌ అగ్రిగేటర్లు తక్షణం పరిష్కారాలతో ముందుకు రావాలని సెంట్రల్‌ కన్జూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ (సీసీపీఏ) చీఫ్‌ కమిషనర్‌ నిధి ఖరే పేర్కొన్నారు. సమావేశంలో ఓలా, ఉబర్‌, మేరు, రాపిడో, జుగ్ను ప్రతినిధులు పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడడానికి వీరు నిరాకరించారు.
అధికారిక ప్రకటన ఇదీ.. 'వినియోగదార్ల ఫిర్యాదుల పరిష్కారానికి బలమైన వ్యవస్థ ఉందని కంపెనీలు అంటున్నాయి. ప్రభుత్వం లేవనెత్తిన అన్ని అభ్యంతరాలపై చర్యలు తీసుకుంటామని చెప్పాయి. అన్ని కంపెనీలు ‘నేషనల్‌ కన్జూమర్‌ హెల్ప్‌లైన్‌’లో భాగస్వాములుగా మారాలని ఆదేశించామ'ని అధికారిక ప్రకటన తెలిపింది.

ఇవీ కొన్ని ఫిర్యాదులు.. 'ప్రయాణికుడు అంతక్రితం వెళ్లిన మార్గంలో మళ్లీ వెళ్లినపుడు, ఎక్కువ ఛార్జీ వసూలు చేయడం. ఫిర్యాదు అధికారి వివరాలే ఇవ్వకపోవడం. కేన్సిలేషన్‌ ఛార్జీల విషయంలో ఎంత సమయంలోగా రైడ్‌ను రద్దు చేసుకుంటే ఛార్జీలు వర్తించవో స్పష్టత ఇవ్వడం లేదు. రద్దు ఛార్జీలు కూడా స్థిరంగా ఉండడం లేదు. రైడ్‌కు ముందే వాటిని తెలపకపోవడం' వంటివి దృష్టికి వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. పాయింట్‌ 'ఎ' నుంచి పాయింట్‌ 'బి'కి వెళ్లడానికి వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు ఛార్జీలు ఎందుకని ప్రశ్నించినట్లు సింగ్‌ పేర్కొన్నారు. 'పాత వినియోగదార్లకు ఎక్కువ, కొత్త వినియోగదార్లకు తక్కువ ఛార్జీలను వసూలు చేస్తున్నారు. ఇది న్యాయసమ్మత ధోరణి కాదు. అదే సమయంలో వినియోగదార్ల డేటా భద్రతకు తగిన చర్యలు తీసుకున్నాయా లేదా అన్నదీ తెలుసుకోవాలనుకుంటున్నామ'న్నారు.

ప్రయాణ, ఆహార అగ్రిగేటర్లను నియంత్రించండి.. ఆన్‌లైన్‌ ప్రయాణ, ఆహార అగ్రిగేటర్ల నియంత్రణకు జోక్యం చేసుకోవాల్సిందిగా ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీసంఘాన్ని ఆతిథ్య పరిశ్రమ సంఘం ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ కోరింది. ఈ రంగాల్లోని టెక్‌ ప్లాట్‌ఫామ్‌లు అనైతిక పోటీ పద్ధతులు పాటిస్తున్నట్లు ఆరోపించింది. ఆన్‌లైన్‌ ట్రావెల్‌ అగ్రిగేటర్లు (ఓటీఏలు), ఫుడ్‌ సర్వీస్‌ అగ్రిగేటర్లు (ఎఫ్‌ఎస్‌ఏలు) సంప్రదాయ వ్యవస్థలను నాశనం చేస్తున్నారని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ జయంత్‌ సిన్హాకు రాసిన లేఖలో ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ పేర్కొంది.'ప్రజా ప్రయోజనార్థం, వినియోగదారుల పరిరక్షణ కోసం కమిటీ జోక్యాన్ని కోరాం. ఓటీఏలు, ఎఫ్‌ఎస్‌ఏల వద్ద ఫిర్యాదులను పరిష్కరించే వ్యవస్థలు దాదాపుగా లేకపోవడంతో వినియోగదారులు నిరంతరం ఇబ్బంది పడుతున్నారు' అని ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ ఉపాధ్యక్షుడు గుర్బాక్సిష్‌ సింగ్‌ కోహ్లి పేర్కొన్నారు.

ఇవీ చదవండి: PM WANI WiFi: మరింత వేగంగా ఉచిత వైఫై.. ఆ సేవలకు శ్రీకారం

సెప్టెంబర్ కల్లా 'ఎస్​సీఐ' వేలం.. త్వరలోనే ఆర్థిక బిడ్లకు ఆహ్వానం!

Last Updated : May 11, 2022, 6:40 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.