Srinivas Kamath Success Story : ముంబయిలో పెద్ద వ్యాపారవేత్త అనగానే చాలా మందికి గుర్తొచ్చేది ధీరుభాయ్ అంబానీ. ఆయన పెట్రోల్ బంకులో పనిచేసే స్థాయి నుంచి పెట్రోల్ అమ్మే స్థాయికి చేరుకున్నారు. ఆయన ప్రారంభించిన వ్యాపారం ప్రస్తుతం ముంబయితో పాటు ఇతర ప్రాంతాలకూ విస్తరించింది. సరిగ్గా ఇలానే.. ఓ పండ్లు అమ్ముకునే వ్యక్తి కుమారుడు అదే ముంబయిలో ఒక చిన్న షాపు ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి నేడు వేల కోట్ల విలువైన కంపెనీకి అధిపతి అయ్యారు. ఆయనే శ్రీనివాస్ కామత్. ఆయన విజయ గాథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీనివాస్ కామత్ ప్రస్థానం
Srinivas Kamath Biography : నాచురల్ ఐస్‌క్రీమ్ ఓనర్ రఘునందన్ శ్రీనివాస్ కామత్. ఈయన్నే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఐస్‌క్రీమ్‌గా పిలుస్తారు. 1954లో కర్ణాటకలోని ముల్కి అనే చిన్న పట్టణంలో జన్మించారు. ఏడుగురు సంతానంలో ఈయనే చిన్నవారు. తండ్రి చిన్న పండ్ల వ్యాపారి. ఇంట్లో చాలా మంది ఉండటంతో డబ్బు సరిపోయేది కాదు. అందువల్ల ఆయన బాల్యం దాదాపు పేదరికంలోనే గడిచింది. తన సోదరుడి రెస్టారెంట్లో పనిచేయడానికి కామత్ 15 ఏళ్ల వయసులో కర్ణాటక నుంచి ముంబయికి నడుచుకుంటూ వెళ్లడం విశేషం. మొదట్లో ఆయన ముంబయిలో పావ్‌బాజీ, ఐస్‌క్రీమ్ అమ్మేవారు.
రెస్టారెంట్‌కి వచ్చే వినియోగదారులకు మరిన్ని వంటకాలు అందించాలనే కోరికతో సొంతంగా షాప్ పెట్టుకుందామని నిర్ణయించుకున్నారు. పండ్ల గుజ్జుతో (ఫ్రూట్ పల్ప్) ఐస్‌క్రీమ్ తయారుచేసి అమ్మాలనే ఆలోచన అక్కడే వచ్చింది. పనిచేసిన దాంట్లో కొంత నగదు చేతికందగానే.. అనుకున్నట్లుగానే 1984లో జుహూ అనే ప్రాంతంలో 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో "నేచురల్ ఐస్‌క్రీమ్" పేరుతో సొంతంగా ఐస్‌క్రీమ్ పార్లర్ ప్రారంభించారు.
సూపర్ సక్సెస్
Natural Ice Cream Business : నలుగురు ఉద్యోగులు, 10 రకాల ఐస్‌క్రీమ్‌లతో పార్లర్ ప్రారంభించారు శ్రీనివాస్ కామత్. సాధారణంగా దొరికే వెనీలా, చాక్లెట్ ఫ్లేవర్లు మాత్రమే కాకుండా.. కొత్తగా ట్రై చేయాలని అనుకుని రకరకాల ప్రయత్నాలు చేశారు. తన సొంత వ్యాపారం చూసుకునే క్రమంలో ఆయన పావ్‌బాజీ అమ్మడం పూర్తిగా మానేశారు. ఎన్నో ఒడుదొడుకులు, కష్టాలు ఎదుర్కొన్న తర్వాత చివరికి ఆయన ప్రయత్నం ఫలించింది. బయట ఎక్కడా దొరకని దోసకాయ, మొత్తని కొబ్బరి, క్యారెట్‌తో తయారుచేసే గజర్ హల్వా లాంటి వెరైటీ ఫ్లేవర్లు అమ్మడం ప్రారంభించారు. అది బాగా క్లిక్ కావడం వల్ల పనస, కర్భూజ, లిచీ, నల్ల ద్రాక్షలు, ఇంకా ఇతర పండ్లతో రకరకాల ఫ్లేవర్ల వెరైటీలు తయారు చేసి విక్రయించేవారు. అది క్రమంగా అంచెలంచెలుగా ఎదిగి దేశవ్యాప్తంగా 135 నగరాలు, పట్టణాలకు వ్యాపారం విస్తరించింది.
Srinivas Kamath Business Net Worth : ప్రస్తుతం ఆ కంపెనీ 125 రకాల రుచుల ఐస్‌క్రీములను తమ వినియోగదారులకు అందిస్తోంది. 2020లో రూ.300 కోట్ల రెవెన్యూ సాధించింది. నాచురల్స్ ఐస్‌క్రీమ్ 2013లో బెస్ట్ కస్టమర్ సర్వీసు అవార్డును సైతం గెలుచుకుంది. కస్టమర్లు సంతృప్తి చెందిన టాప్ 10 బ్రాండ్లలో ఇదీ ఒకటిగా నిలిచింది.