Mukesh Ambani: ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ నిలిచారు. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీని ఆయన వెనక్కి నెట్టారు. గత వారం రోజుల్లో రిలయన్స్ షేరు 6.79 శాతం దూసుకెళ్లడం ఇందుకు కలిసొచ్చింది. 2022లో 16.61 శాతం పెరిగిన షేరు.. గత ఏడాది కాలంలో 27 శాతం లాభాలను పంచింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం.. అంబానీ నికర సంపద 99.7 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.7.67 లక్షల కోట్లు). ప్రపంచంలో ఆయన 8వ సంపన్న వ్యక్తిగా ఉన్నారు. 2022లో ఇప్పటివరకు ఆయన సంపద 9.69 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇక 98.7 బిలియన్ డాలర్ల సంపదతో గౌతమ్ అదానీ 9వ స్థానంలో నిలిచారు.
- ప్రపంచ కుబేరుడిగా టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ కొనసాగారు. ఆయన సంపద 227 బిలియన్ డాలర్లు. ఆ తర్వాతి స్థానాల్లో అమెజాన్ జెఫ్ బెజోస్, ఎల్‌వీఎంహెచ్ బెర్నార్డ్ అర్నాల్ట్, మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఉన్నారు. ప్రముఖ దిగ్గజ పెట్టుబడిదారు వారెన్ బఫెట్ అయిదో స్థానంలో ఉన్నారు. మార్క్ జుకర్‌బర్గ్ 11వ స్థానం, జాంగ్ షాన్‌సన్ 15వ స్థానాలు పొందారు.
- భారత సంపన్నులు చూస్తే.. అజీమ్ ప్రేమ్‌జీ (28.7 బి.డాలర్లు) మూడో స్థానంలో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో శివ్ నాడార్ (25.9 బి.డాలర్లు), లక్ష్మీ మిత్తల్ (20.1 బి.డాలర్లు), రాధాకిషన్ దమానీ (19.6 బి.డాలర్లు), ఉదయ్ కోటక్ (14.8 బి.డాలర్లు), దిలీప్ సంఘ్వీ (14.5 బి.డాలర్లు), సైరస్ పూనావాలా (14 బి.డాలర్లు) నిలిచారు.
- ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం.. ముకేశ్ అంబానీ సంపద 104.7 బిలియన్ డాలర్లు, గౌతమ్ అదానీ, ఆయన కుటుంబ సంపద 99.9 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఇవీ చదవండి: సంపాదన మొత్తం ఈఎంఐలకే పోతుందా? ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి..!