Mahindra electric SUV launch : వినియోగదార్లలో అవగాహన పెరగడానికి తోడు ప్రభుత్వ మద్దతు నేపథ్యంలో, ప్రయాణికుల విద్యుత్ వాహన విభాగంలోకి ప్రవేశించేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నామని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోమవారం వెల్లడించారు. దేశీయ, అంతర్జాతీయ విపణుల కోసం 5 విద్యుత్ స్పోర్ట్స్ వినియోగ వాహనాలను (ఎస్‌యూవీలు) విడుదల చేస్తామని పేర్కొన్నారు. వీటిని ఎక్స్‌యూవీ, బీఈ బ్రాండ్ల కింద తీసుకొస్తామని వెల్లడించింది. తొలి వాహనం 2024 ఆఖరుకు విడుదలవుతుందని, మొత్తంమీద 2024-26 సంవత్సరాలలో 4 విద్యుత్తు ఎస్‌యూవీలు రోడ్లపైకి రావొచ్చని తెలిపారు. దేశీయ విద్యుత్ త్రిచక్ర వాహన విభాగంలో సంస్థకు 70 శాతం మార్కెట్ వాటా ఉంది.
కంపెనీ విద్యుత్ వాహన విభాగం ఈవీ కో లో 250 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,925 కోట్లు) పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ (బీఐఐ) సిద్ధంగా ఉందని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ఈ సంయుక్త కంపెనీలో మొత్తం 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ.7,900 కోట్ల)ను 2024-27 మధ్య పెట్టుబడి పెట్టాల్సి ఉంది. కొత్త ఇంగ్లో ప్లాట్‌ఫామ్‌పై మహీంద్రా ఈవీలు తీసుకొస్తామని వివరించింది. 2027 నాటికి ఎస్‌యూవీల్లో 25 శాతం విద్యుత్ వాహనాలే విక్రయమయ్యే అవకాశం ఉందని మహీంద్రా గ్రూప్ ఎండీ, సీఈఓ అనీశ్ షా వెల్లడించారు. దేశీయ విపణిలో 2021-22లో మహీంద్రా 2.25 లక్షల ఎస్‌యూవీలను విక్రయించిందని పేర్కొన్నారు.
ఫోక్స్‌వ్యాగన్‌తో ఒప్పంద పత్రం: విద్యుత్ వాహన విభాగంలో సహకారం అందించేందుకు అంతర్జాతీయ వాహన దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్‌తో మహీంద్రా గ్రూప్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సోమవారం వెల్లడించింది. ఇందులో భాగంగా కొత్త ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్ ఇంగ్లోకు అవసరమైన ఎంఈబీ (మాడ్యులర్ ఎలక్ట్రిక్ డ్రైవ్ మ్యాట్రిక్స్) ఎలక్ట్రిక్ పరికరాలను ఫోక్స్‌వ్యాగన్ సరఫరా చేయాల్సి ఉంటుంది. 5 విద్యుత్ ఎస్‌యూవీలతో పాటు జీవిత కాలంలో 10 లక్షలకు పైగా వాహనాలకు ఎంఈబీ పరికరాలను ఫోక్స్‌వ్యాగన్ అందించనుంది.