Loan Repayment Documents Delay RBI New Rules : గృహ రుణాలు, ఇతర వ్యక్తిగత రుణాలు తీసుకున్నవారికి ఆర్బీఐ గొప్ప ఉపశమనం కలిగించింది. ఇకపై రుణ గ్రహీతలు తమ లోన్ మొత్తాన్ని తీర్చిన వెంటనే.. బ్యాంకులు వారికి చెందిన ఆస్తి పత్రాలను 30 రోజుల్లోపు తిరిగి ఇచ్చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.
రోజుకు రూ.5000 పెనాల్టీ!
Bank Property Document Delay Penalty : వ్యక్తిగత రుణం లేదా గృహ రుణం తిరిగి చెల్లించిన తరువాత.. బ్యాంకులు వారి ఆస్తి పత్రాలను 30 రోజుల్లోగా ఇచ్చేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. అలా చేయడంలో విఫలమైతే, బ్యాంకులు రుణగ్రహీతలకు రోజుకు రూ.5,000 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు పత్రాలు అందించడంలో జరుగుతున్న జాప్యానికి గల కారణాలను కూడా రుణగ్రహీతకు తెలియజేయాలి. అంతేకాదు రుణ గ్రహీత ప్రాధాన్యాన్ని అనుసరించి, అతని ఆస్తి పత్రాలను.. లోన్ ఇచ్చిన బ్యాంకులో లేదా మరొక కార్యాలయంలో వాటిని అందుబాటులో ఉంచాలి.
ఒరిజినల్ పత్రాలు పోతే!
ఒకవేళ బ్యాంకుల వద్ద ఉన్న రుణగ్రహీతల ఆస్తి పత్రాలు పాక్షికంగా చెడిపోయినా, లేదా పూర్తిగా పోయినా.. దానికి బ్యాంకులే బాధ్యత వహించాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. అలాగే సదరు ఆస్తి పత్రాల నకళ్లు లేదా సర్టిఫైడ్ కాపీలను పొందడానికి అయ్యే ఖర్చులను కూడా బ్యాంకులే భరించాలని వెల్లడించింది. కానీ ఈ ప్రొసీజర్ పూర్తి కావడానికి కనీసం 30 రోజులు పట్టే అవకాశం ఉంటుంది. కనుక ఇలాంటి సందర్భాల్లో 60 రోజులు దాటిన తరువాతే, బ్యాంకులు రుణగ్రహీతకు రోజుకు రూ.5000 చొప్పున పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది.
డిసెంబర్ 1 తరువాత అమలు!
RBI Guidelines For Timely Release Of Property Papers : ఆర్బీఐ జారీ చేసిన ఈ నూతన మార్గదర్శకాలు 2023 డిసెంబర్ 1 తరువాత అమలులోకి వస్తాయి. అంటే బ్యాంకులకు ఇప్పటి నుంచి 2 నెలలకు పైగా సమయం ఉంది. ఈలోపు బ్యాంకులు తమ లాజిస్టిక్స్, ఐటీ సిస్టమ్‌లను అన్నింటినీ పద్ధతిగా సరిచేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎవరైనా వ్యక్తులు బ్యాంక్ లోన్ తీసుకుంటే.. వారు హామీగా సమర్పించిన ఆస్తి పత్రాలను.. సదరు హోం బ్రాంచ్‌లో కాకుండా, కేంద్రీకృత ప్రాసెసింగ్ కేంద్రానికి పంపిస్తున్నారు. దీని వల్ల రుణ గ్రహీత.. తన లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించినప్పటికీ.. అతని ఆస్తి పత్రాలు తిరిగి అతనికి చేరడానికి చాలా సమయం పడుతోంది.
కస్టమర్లకు ఊరట
ప్రస్తుతం దేశంలోని బ్యాంకులు.. రుణ గ్రహీతలు హామీగా ఇచ్చిన స్థిర, చరాస్తుల పత్రాలను.. తిరిగి ఇవ్వడానికి అనేక రకాల పద్ధతులను అనుసరిస్తున్నాయి. వీటి వల్ల లోన్ తీర్చిన తరువాత కూడా రుణగ్రహీతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనిని నివారించడానికే ఆర్బీఐ ఈ నూతన నిబంధనలను ప్రవేశపెట్టింది.
ముందే చెప్పాలి!
ఆర్బీఐ నిబంధనల ప్రకారం, భవిష్యత్‌లో బ్యాంకులు అన్నీ రుణాలు మంజూరు చేసినప్పుడే.. రుణగ్రహీతల ఆస్తి పత్రాలను తిరిగి వారికి ఎప్పుడు, ఎక్కడ తిరిగి అందిస్తారో.. మంజూరు లేఖలో స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. ఒక వేళ రుణగ్రహీత మరణిస్తే, అతని లేదా ఆమె వారసులకు ఆస్తి పత్రాలను తిరిగి ఇచ్చేందుకు స్పష్టమైన విధానం పాటించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ ప్రొసీజర్ మొత్తాన్ని తమ అధికారిక వెబ్సైట్లో చాలా స్పష్టంగా ప్రచురించాలి.