Infosys CEO: ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీగా తిరిగి సలీల్ పరేఖ్‌ను నియమిస్తున్నట్లు ఆదివారం స్టాక్ ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో కంపెనీ తెలిపింది. మరో ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. వ్యవస్థాపక సభ్యులు కాకుండా వరుసగా రెండోసారి కంపెనీ సీఈఓగా ఎంపికైన తొలి వ్యక్తిగా సలీల్ గుర్తింపు పొందారు. ఆయన నియామకానికి ఇంకా వాటాదారుల ఆమోదం లభించాల్సి ఉంది.
అనేక ప్రాజెక్టులతో వృద్ధిపథంలో దూసుకెళ్తున్న కంపెనీని సమర్థ నాయకత్వంలో కొనసాగించాలనే ఉద్దేశంతోనే సలీల్‌ను తిరిగి నియమించాలని 'నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ' నిర్ణయించినట్లు ఇన్ఫోసిస్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. జులై ఒకటో తేదీ నుంచి 2027 మార్చి 31 వరకు ఇన్ఫోసిస్ సీఈవో కమ్ ఎండీగా సలీల్ కొనసాగుతారని బోర్టు వెల్లడించింది. అలాగే కంపెనీలో ఆరుగురు ఉన్నతాధికారులకు 1,04,000 షేర్లను.. మరో 88 మంది సీనియర్ అధికారులకు 3,75,760 షేర్లు కేటాయించాలని ఎన్‌ఆర్‌సీ నిర్ణయించినట్లు తెలిపింది. వీటిని రాబోయే మూడేళ్ల పాటు వారి పనితీరును బట్టి బదిలీ చేయనున్నట్లు పేర్కొంది.
Paytm CEO: ప్రముఖ డిజిటల్ ఆర్థిక సేవల సంస్థ పేటీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా మళ్లీ విజయ్ శేఖర్ శర్మనే కొనసాగనున్నారు. ఆయన పదవీకాలాన్ని మరో ఐదేళ్లు పొడగిస్తూ కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్ సందర్భంగా పేటీఎం వెల్లడించింది. 2027 డిసెంబరు 18వ తేదీ వరకు విజయ్ ఎండీ, సీఈఓగా కొనసాగనున్నారు. ఇక పేటీఎం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా ఉన్న మధుర్ దేవరాను పూర్తి స్థాయి డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
ఇవీ చదవండి: క్రెడిట్ కార్డులకు కొత్త నిబంధనలు.. కచ్చితంగా ఇవి తెలుసుకోండి?