Public Securities Market: రెపో రేటును 40 బేసిస్ పాయింట్ల మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పెంచాక, బ్యాంకులు డిపాజిట్ల సేకరణకు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే కాలావధి డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. అయినప్పటికీ ఇవి ఇంకా ఆకర్షణీయంగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సెక్యూరిటీలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా వడ్డీ రేట్లు 7 శాతానికి మించి ఉండటంతో ఇవి సంప్రదాయ మదుపరులను ఆకట్టుకుంటున్నాయి.
గతంలో ప్రభుత్వ సెక్యూరిటీలలో సాధారణ ప్రజలు నేరుగా మదుపు చేసేందుకు అవకాశం ఉండేది కాదు. దీంతో పదవీ విరమణ చేసిన వారు, సురక్షిత పెట్టుబడి పథకాలను ఎంచుకునే వారు. బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా పోస్టాఫీసు పథకాల వైపే వీరు ఎక్కువగా మొగ్గు చూపేవారు. ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టే మ్యూచువల్ ఫండ్ డెట్ పథకాలను పరిశీలించేవారు. చిన్న మదుపరులకూ ప్రభుత్వ బాండ్లలో నేరుగా మదుపు చేసే అవకాశం కల్పించాలనే లక్ష్యంతో గత ఏడాది నవంబరులో ఆర్‌బీఐ రిటైల్ డైరెక్ట్‌ను అందుబాటులోకి తేవడం ఇప్పుడు కలిసి వస్తోంది.
ఆకర్షణీయం: ఇటీవల కాలంలో బాండ్లు అందించే వడ్డీ రేట్లలో వృద్ధి కనిపించింది. 10 ఏళ్ల ప్రభుత్వ సెక్యూరిటీలపై రాబడి ఏడాది వ్యవధిలో 125 బేసిస్ పాయింట్ల మేరకు పెరిగింది. దీంతో చాలామంది దీర్ఘకాలిక వ్యూహంతో పెట్టుబడులు పెట్టేందుకు చూస్తున్నారు. బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 6 శాతం లోపే ఉన్నాయి. చిన్న మొత్తాల పొదుపు పథకాలను పరిశీలిస్తే.. జాతీయ పొదుపు పత్రాల్లో 6.8శాతం, కిసాన్ వికాస పత్రాల్లో 6.9శాతం రాబడి లభిస్తోంది. అదే ఆర్‌బీఐ ఆరు నెలల ఫ్లోటింగ్ బాండ్లలో 7.15 శాతం వరకు రాబడి అందుతోంది.
ఆర్‌బీఐ రిటైల్ డైరెక్ట్ ద్వారా చిన్న మదుపరులు నేరుగా టి-బిల్స్, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన స్టేట్ డెవలప్‌మెంట్ లోన్స్ (ఎస్‌డీఎల్), జి-సెక్యూరిటీలలో మదుపు చేయొచ్చు. ప్రస్తుతం పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్‌డీఎల్స్‌ను 5-10 ఏళ్ల వ్యవధితో తీసుకుంటున్నాయి. కనీస పెట్టుబడి రూ.10వేల వరకు ఉంటుంది. వీటిని మధ్యలోనే స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా విక్రయించే వీలున్నప్పటికీ.. వ్యవధి తీరేదాకా అట్టేపెట్టుకున్న వారికి మంచి ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
నష్టభయం ఉండదు: ప్రభుత్వ బాండ్లకు సార్వభౌమ హామీ ఉంటుంది. రేటింగ్‌లతో పనిలేదు. నష్టభయం ఉండదు. భవిష్యత్తులో వడ్డీ రేట్లు మరింత పెరిగితే దీర్ఘకాలంలో కొంత రాబడి నష్టం మాత్రం ఉంటుంది. ఈ బాండ్లలో మదుపు చేసినప్పుడు ఏడాదిలో రెండుసార్లు వడ్డీ చెల్లింపు ఉంటుంది. వడ్డీ అసలులో కలవదు కాబట్టి, క్యుములేటివ్ ప్రయోజనం కోల్పోతాం. వచ్చిన వడ్డీని క్రమానుగత పెట్టుబడులకు మళ్లిస్తే మరింత ప్రయోజనం అందుకునే అవకాశం ఉంటుందని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: ఈ జాగ్రత్తలతో ఆర్థిక ఇబ్బందులు లేని 'పదవీ విరమణ'