How To Make A Good Retirement Plan : పదవీ విరమణ వయసు వచ్చే సరికి అందరూ ఆర్థికంగా స్థిరపడాలని కోరుకుంటారు. కానీ, ఇది ఆచరణలో సాధ్యం కావాలంటే సరైన ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి. అయితే మనం వృద్ధాప్యంలో ఎటువంటి ఆర్థిక లోటు లేకుండా జీవించేందుకు చిన్న వయస్సులోనే సంపాదించి పెట్టుకోవాలి. ఇది అందరికి తెలిసిన విషయమే అయినా.. కొంత అవగాహన లేమి కారణంగా చాలా మంది రిటైర్మెంట్ ప్లాన్‌ను సరైన మార్గంలో నిర్మించుకోలేకపోతున్నారు. పెరుగుతున్న ఖర్చులు, ఆరోగ్య సమస్యలు జీవితాంతం దాచుకున్న పొదుపును హరించివేస్తాయి. అందుకే, సరైన పదవీ విరమణ ప్రణాళిక ప్రతి ఒక్కరికి అవసరం. అయితే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటూ.. చక్కటి ఆర్థిక ప్రణాళికను సృష్టించుకోవాలంటే ఈ కింది విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి.
చిన్నవయసులోనే చేయాలి..
Good Retirement Plans In India : డబ్బును కేవలం ఆదా చేస్తే ఎటువంటి ఉపయోగం ఉండదు. దాచిన సొమ్మును మంచి రిటర్న్స్ ఇచ్చే పెట్టుబడుల్లో ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే మనం రిటైర్ అయ్యేలోపు లంప్సమ్గా అమౌంట్‌ను అందుకుంటాము. ఇందుకోసం ఈ పెట్టుబడులు వృద్ధి చెందేందుకు సరైన సమయం ఇవ్వాలి. అంటే ఇక్కడ డబ్బుతో పాటు, కాలాన్ని కూడా మీరు మదుపు చేయాలి. చిన్న వయసు నుంచే మదుపు ప్రారంభం కావాలి. అప్పుడే అసలుపై వడ్డీ.. దానిపై చక్రవడ్డీ ఇలా ఒక మంచి నిధి ఏర్పాటయ్యేందుకు అవకాశం ఉంటుంది.
కాస్త రిస్క్ తీసుకుంటే..
Retirement Savings Plan : పెట్టుబడి అంటేనే రిస్క్‌తో కూడుకున్నది. అయితే సంప్రదాయ పెట్టుబడి మార్గాల్లో మదుపు చేస్తే గనుక దీని నుంచి తప్పించుకోవచ్చు. అయితే ఈ రకమైన సాధనాల్లో అసలు, రాబడికి హామీ ఉంటుంది. కానీ, ఇవి ద్రవ్యోల్బణం నుంచి మనల్ని కాపాడలేకపోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల పెట్టుబడి సాధనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకునేది జీవిత బీమా సంస్థలు అందించే యూనిట్ ఆధారిత బీమా పాలసీల (యులిప్) గురించి. ఇవి ఇన్వెస్టర్‌కు దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడిని ఇస్తుంది. అందుకే ఈక్విటీ మార్కెట్ల నుంచి దూరంగా ఉండకూడదు. సంపదను పెంచుకోవాలంటే వీటిలో పెట్టుబడి ఎంతో అవసరం. అధిక నష్టభయాన్ని భరించగలిగితే నేరుగా ఈక్విటీ మార్కెట్లో మదుపు చేయవచ్చు. తక్కువ నష్టభయంతో ఈక్విటీల్లో మదుపు చేయాలనుకుంటే.. యులిప్‌లు, మ్యూచువల్ ఫండ్ ఫథకాలను ఎంచుకొని, పరోక్ష పెట్టుబడులు పెట్టండి. అయితే వీటిల్లో ప్రవేశించేముందు మీ ఆర్థిక లక్ష్యాలు, నష్టభయం భరించే సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడం ఉత్తమం.
వైవిధ్యంగా ఉండాలి..
Good Retirement Plan : ద్రవ్యోల్బణంలో మార్పుల ప్రభావం మనం పెట్టే కొన్ని పెట్టుబడులపై కచ్చితంగా ఉంటుంది. అయితే ఇది మనం ఎంచుకునే అన్ని పెట్టుబడి మార్గాలపై ప్రభావం చూపదు. అలా ప్రభావితం కాని ఈక్విటీ, డెట్, స్థిరాస్తి వంటి ఆర్థిక సాధనాల్లో మదుపు చేసేందుకు ప్రయత్నించాలి. అది కూడా మీ ఆర్థిక అవసరాలను అనుగుణంగా పెట్టుబడులు పెట్టండి. ముఖ్యంగా 100 శాతం ఒకే దాంట్లో కాకుండా 40,30,20 శాతాలు.. ఇలా కేటాయించుకొని మదుపు చేయండి. ఉదాహరణకు మీరు రూ.100 ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే.. షేర్లు, యులిప్, ఈటీఎఫ్‌లు, ఇండెక్స్ ఫండ్‌లు లాంటి మార్కెట్ ఆధారిత పథకాల్లో 40 శాతం పెట్టుబడి పెట్టండి. అంటే పెట్టుబడికి హామీ ఇచ్చే పథకాల్లో ఎక్కువ శాతం జమ చేయండి. జీవిత బీమా, ఆరోగ్య బీమా లాంటి వాటి కోసం 20 శాతం కేటాయించుకోండి. మొత్తంగా వైవిధ్యమైన పెట్టుబడి ప్రణాళికలను క్రమం తప్పకుండా అమలు చేస్తేనే దీర్ఘకాలంలో వచ్చే ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోగలం.
అన్నింటికి సిద్ధంగా ఉండాలి..
Retirement Plan Example : మన జీవితంలో ఎదుర్కొనే కొన్ని ఖర్చులను మనం ముందే ఊహించగలము. వాటిల్లో ప్రధానమైనవి పిల్లల చదువులు, వివాహాలు, ఇతర శుభకార్యాలు. వీటి విషయంలో మనకు ఓ స్పష్టత ఉంటుంది. అయితే కొన్ని ఊహించని, అనుకోకుండా వచ్చే ఖర్చులు మనల్ని తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. అవే కుటుంబ సభ్యుల్లోని ఎవరికైనా వచ్చే తీవ్ర అనారోగ్యం, ఆకస్మిక మరణాలు వంటివి. వీటికీ మనం ముందే సిద్ధపడి ఉండాలి. అయితే వీటిని ఎదురుకోవాలంటే మంచి ఆర్థిక ప్రణాళిక తప్పనిసరి.
హామీ ఉన్న పథకాల్లో..
Good Returns Investment Plans : మనం పెట్టే పెట్టుబడుల్లో కొంత మొత్తాన్ని హామీ ఉన్న పథకాల్లో పెడితే రాబడుల విషయంలో ఎటువంటి ఢోకా ఉండదు. ఇలా వచ్చే రిటర్న్స్‌ను జీవితంలోని వివిధ అవసరాలకు జత చేయాలి. ముఖ్యంగా జీవిత బీమా లాంటివి. ఆర్థిక భద్రత విషయంలో మంచి పదవీ విరమణ ప్రణాళిక, మనం పొందే పింఛను ఎంతో దోహదం చేస్తాయి. అందుకే అవసరానికి తగ్గ పాలసీ తీసుకోవడం అవసరం. మరోవైపు పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా రాజీ పడే పరిస్థితులు రాకుండా ఉండేలా చూసుకోండి.
చివరగా ఆర్థిక ప్రణాళికలను సాధ్యమైనంత తక్కువ వయసులోనే ప్రారంభించడం, మారుతున్న మార్కెట్ పరిస్థితులు, జీవిత దశల ఆధారంగా వాటిని తరచు సమీక్షిస్తూ ఉంటే ప్రశాంతవంతమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చు.