How To Get Credit Card Without Income Source Certificate : ప్రస్తుతం కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం ఎలా ఉందో మనకు తెలిసిందే. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు మంచి రాయితీలను, క్యాష్‌బ్యాక్‌లను, డిస్కౌంట్ ఆఫర్‌లను ప్రకటిస్తుండడం.. అన్నిటికన్నా ముఖ్యంగా అవసరానికి "అప్పు" లభిస్తుండడంతో.. క్రెడిట్ కార్డులను ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. అయితే.. గతంలో ఈ కార్డుల కోసం చాలా కష్టపడాల్సి వచ్చేది. క్రెడిట్ కార్డ్‌ను పొందడానికి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు వివిధ పత్రాలను సమర్పించమని అడుగుతాయి. అందులో ముఖ్యమైన సర్టిఫికేట్ 'ఇన్‌కమ్ సోర్స్' (ఆదాయ రుజువు పత్రం). ఇది లేకపోతే క్రెడిట్ కార్డ్‌ను ఇవ్వడానికి చాలా సంస్థలు ముందుకు రావు. అయితే.. ఇప్పుడు ఇన్‌కమ్ సోర్స్ సర్టిఫికేట్ లేకుండా క్రెడిట్ కార్డ్‌ను ఎలా పొందాలో ఈ స్టోరీలో చూద్దాం.
ఏమిటీ ఇన్‌కమ్ సోర్స్ సర్టిఫికెట్?
ఇన్‌కమ్ సోర్స్ సర్టిఫికెట్ అంటే.. వ్యక్తి ఆదాయ ధృవీకరణ పత్రం. ఇందులో ఆ వ్యక్తికి వచ్చే జీతం, రోజువారి ఆదాయాలు, పెన్షన్, కంపెనీ, ఆస్తిపాస్తుల వివరాలు, ఆదాయ మార్గాలు, అద్దెకు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి.
ఎందుకు ఈ ఇన్‌కమ్ సోర్స్ సర్టిఫికెట్ అవసరం ?
బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు మీరు క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న తరువాత.. మీరు డబ్బులను తిరిగి చెల్లించగలరా? లేదా? అనేది ఈ ఇన్‌కమ్ సోర్స్ సర్టిఫికెట్ ద్వారా అంచనా వేస్తాయి. ఎందుకంటే.. ఈ ఇన్‌కమ్ సోర్స్ సర్టిఫికెట్‌లో మీ జీతం స్లిప్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్, ఆదాయపు పన్ను రిటర్న్‌లు (ITR) వంటి వివరాలు జోడించి ఉంటాయి. క్రెడిట్ కార్డ్‌ను జారీ చేయడానికి బ్యాంకులు కొంత ఆదాయ పరిమితిని విధిస్తాయి. మీ ఆదాయం ఎక్కువగా ఉంటే మీకు సులభంగా క్రెడిట్ కార్డ్ లభిస్తుంది.
ఇన్‌కమ్ సోర్స్ సర్టిఫికెట్ లేనివారు క్రెడిట్ కార్డ్ ఎలా పొందాలి?
ఒకవేళ మీకు మంచి ఆదాయం వచ్చే వనరులు ఉండి, తిరిగి చెల్లించే సత్తా ఉంటే.. ఇన్‌కమ్ సోర్స్ సర్టిఫికెట్ లేకుండా కూడా క్రెడిట్ కార్డ్‌ను పొందే అవకాశం ఉందని డీబీఎస్ బ్యాంక్ ప్రకటించింది. ఇన్‌కమ్ సోర్స్ సర్టిఫికెట్ లేకపోయినా.. ఆ వ్యక్తి క్రెడిట్ కార్డ్ చెల్లింపులను చేస్తాడని నిర్ధారించుకోవడానికి.. ఇతర ఎంపికలను పరిశీలిస్తామని బ్యాంకు అధికారి తెలిపారు. దరఖాస్తుదారుని క్రెడిట్ స్కోర్, క్రెడిట్ బ్యూరో నుంచి చెల్లింపుల హిస్టరీ, అతనికి ఉన్న ఆస్తుల వివరాలను పరిశీలించనున్నట్టు తెలిపారు. ఒకవేళ కస్టమర్‌కు ఇతర క్రెడిట్ కార్డ్‌ల బిల్లులను సక్రమంగా చెల్లించిన ట్రాక్ రికార్డ్ ఉంటే, క్రెడిట్ బ్యూరో ద్వారా ధృవీకరించిన తరవాత బ్యాంకులు వారికి క్రెడిట్ కార్డులను జారీ చేస్తాయని స్పష్టం చేశారు. సో.. ప్రత్యేకంగా ఇన్‌కమ్ సోర్స్ సర్టిఫికెట్ లేకున్నా.. ఇకపై క్రెడిట్ కార్డు పొందే వీలు ఉందన్నమాట. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఈ మార్గంలో ప్రయత్నించి చూడండి.
How to get Virtual Credit Card : మీకు వర్చువల్ క్రెడిట్ కార్డు తెలుసా..? వెంటనే తెలుసుకోండి