How To Avoid Financial Mistakes : ఒక వ్యక్తి జీవిత ప్రయాణం సజావుగా సాగాలంటే కచ్చితమైన ఆర్థిక ప్రణాళికలు అవసరం. ప్రతి దశలోనూ.. ఆదాయం, ఖర్చులను బేరీజు వేసుకుంటూ.. ముందుకు సాగాల్సి ఉంటుంది. అయితే.. కొంత మంది ఎన్ని ప్లాన్లు వేసినా.. కథ మళ్లీ మొదటికి వచ్చేస్తుంది. దీనికి దారితీసే పరిస్థితులేమిటి..? ఆర్థికంగా చేసే అతిపెద్ద తప్పులేంటి..? వాటిని ఎలా అధిగమించాలి..? వంటి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
1. అనవసర ఖర్చులు..
Unnecessary Expenses : ఆయిల్ ప్యాకెట్ తీసుకురావడానికి దుకాణానికి వెళ్తారు. కానీ.. ఇంటికి వచ్చి చూస్తే.. మరో ఐదారు సరుకులు సంచిలో ఉంటాయి. ఒక డ్రెస్సో.. లేదంటో ఒక చీరనో కొనుగోలు చేద్దామని షాపింగ్‌కు వెళ్తారు. బిల్లింగ్ దగ్గరకు వెళ్లేసరికి నాలుగైదు జతలు బుట్టలో ఉంటాయి. ఇలా.. ఆఫర్లు ఉన్నాయనో.. లేదంటే పక్కింటి వాళ్లు కొన్నారనో.. అత్యవసరం లేని వస్తువులు కూడా కొనిపారేస్తుంటారు చాలా మంది. ఆర్థిక ప్రణాళికను దెబ్బతీసే విషయాల్లో మొట్టమొదటి ప్రాబ్లం ఇదే. అందుకే.. ఏం కొనాలని ఇంటి వద్ద అనుకున్నారో.. అవి మాత్రమే కొనుగోలు చేయాలి. కచ్చితంగా అవసరమైనవి మాత్రమే ఆ లిస్టులో ఉండాలి.
2. కటాఫ్ కంపల్సరీ..
ప్రజలు చేసే అతిపెద్ద ఆర్థిక పొరపాట్లలో మరో ముఖ్యమైనది.. కటాఫ్ విధించుకోకపోవడం. వచ్చే జీతంలో ఇంతకు మించి ఖర్చు చేయకూడదని కటాఫ్ పెట్టుకోవాలి. అందులోనే ఖర్చులన్నీ పూర్తయ్యేలా చూసుకోవాలి. మిగిలి మొత్తాన్ని సేవింగ్స్ చేసుకోవాలి. అత్యవసరమైతే తప్ప, ఇందులోనుంచి రూపాయి కూడా తీయకూడదనే నిబంధన పెట్టుకోవాలి. అమలు చేయాలి. ఇలా.. కనీసం 20శాతం పొదుపు చేస్తే.. భవిష్యత్తులో ఆర్థిక సమస్యలను అధికమించవచ్చు. కానీ.. చాలా మంది ఇలా చేయరు.
ఆర్థిక విషయాల్లో మిలీనియల్స్ చేయకూడని పొరపాట్లు ఇవే..
3. క్రెడిట్ కార్డుల వినియోగం..
Not Paying Credit Bills On Time : అడక్కుండానే అప్పు వస్తోంది.. పైగా వాయిదాల పద్ధతిలో చెల్లింపులు అనే కారణంతో.. ఇష్టారీతిన క్రెడిట్ కార్డు ఉపయోగించేవారు ఎందరో! వివిధ అవసరాల కోసం క్రెడిట్ కార్డ్ వాడేస్తారు.. కానీ, ప్రతి నెలా చెల్లింపుల విషయంలో ఇబ్బందులు పడుతుంటారు. ఫైన్‌తో కలిపి వాయిదా పెరిగిపోవడం.. ఈలోగా మరో కొత్త అవసరం వచ్చిపడడం వంటి కారణాలతో.. ప్లాన్ మొత్తం చెదిరిపోతుంది. అందువల్ల అవసరమైతేనే క్రెడిట్ కార్డ్ ద్వారా వస్తువులు కొనుగోలు చేయాలి. అదికూడా.. ఇన్‌టైమ్‌లో బిల్లు చెల్లించే అవకాశం 100 శాతం ఉందన్నప్పుడే చేయాలి. కానీ.. కొందరు ఈ లెక్కలేవీ వేసుకోకుండా.. ముందు అవసరం తీరిపోవాలనే విషయం మీదనే దృష్టి పెడతారు. సమస్యల్లో చిక్కుకుంటారు.
క్రెడిట్ స్కోరు 750కి తగ్గితే అంతే!.. అలా కాకూడదంటే ఇలా చేయండి
4. బీమా, వాటి ప్రయోజనాలను పట్టించుకోకపోవటం
Avoiding Insurance And Benefits: మానవ జీవితం అనూహ్యమైనది. ఆ అనూహ్య క్షణాల కోసం ఆర్థికంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. అందుకు బీమాతో మిమ్మల్ని, మీపై ఆధారపడిన వారిని రక్షించుకోవచ్చు. ఏదైనా ఊహించని పరిస్థితిలో పెద్ద ప్రమాదం జరిగితే ఆ సమయంలో అయ్యే ఖర్చుల నుండి కాపాడడానికి బీమా ఎంతగానో సహాయ పడుతుంది. కుటుంబ పెద్ద మరణిస్తే.. ఫ్యామిలీకి సైతం రక్షగా ఉంటుంది. కానీ.. చాలా మంది బీమాను పట్టించుకోకుండా.. అనవసర ఖర్చులు మాత్రం గట్టిగానే చేస్తుంటారు. అత్యవసర పరిస్థితుల్లో అవస్థలు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి.. బీమా అత్యవసరం అంటున్నారు నిపుణులు.
5. రిటైర్మెంట్ ప్లాన్..
No Retirement Plan : ఉద్యోగ సర్వీసు కాలమంతా ఆనందంగా గడిచిపోతుంది. వయసులో ఉంటారు. వేతనం వస్తుంది కాబట్టి ఆందోళన ఉండదు. కానీ.. పదవీ విరమణ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. ఆదాయం ఉండదు. కానీ.. ఆహారం నుంచి అనారోగ్యం వరకూ ఖర్చులు మాత్రం ఎంతగానో పెరిగిపోతాయి. ఈ పరిస్థితిను ముందుగానే గుర్తించి.. ఉద్యోగ విరమణ తర్వాత జీవితానికి కూడా ఇప్పట్నుంచే ప్లాన్ చేసుకోవాలి. లేదంటే.. మలివయసులో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే.. మీరు పని చేస్తున్నప్పుడే.. రిటైర్మెంట్ తర్వాత జీవితానికి ప్రణాళిక వేసుకొని, అందుకు తగిన విధంగా డబ్బును ఆదా చేసుకోవాల్సిందే.
ఈ ఐదు విషయాలను గుర్తించి సరిగ్గా ప్లాన్ చేసుకున్నవారు ఆర్థిక కష్టాల నుంచి సులువుగా గట్టెక్కే అవకాశం ఉందని, లేదంటే.. ఇబ్బందులు తప్పవని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మరి, ఇక నుంచైనా మొదలు పెట్టండి.
Planning For Retirement : రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేస్తున్నారా?.. ఈ పొరపాట్లు చేయవద్దు!