Hero Motocorp News: దేశంలోనే అతిపెద్ద ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కార్యాలయాలపై దాడులు చేసిన ఐటీ శాఖ కీలక విషయాలు కనుగొంది. రూ.1000 కోట్లను వేర్వేరు అవసరాల కోసం ఖర్చు చేసినట్లు ఆ సంస్థ తప్పుడు లెక్కలు చూపించినట్లు ఆదాయ పన్నుశాఖ గుర్తించింది. స్థిరాస్తుల కొనుగోలు కోసం నిబంధనలకు విరుద్ధంగా రూ.100 కోట్లు నగదు లావాదేవీలు జరిపినట్లు తేల్చింది. కంపెనీకి సంబంధించిన ఆర్థిక దస్త్రాలు, డిజిటల్ డేటాను జప్తుచేశారు.
హీరో మోటోకార్ప్ ఛైర్మన్, ఎండీ పవన్ ముంజల్ ఛత్తర్పుర్లో ఓ ఫార్మ్‌హౌస్‌ను నల్లధనంతో కొనుగోలు చేశారని, పన్ను ఎగవేసేందుకు మార్కెట్ ధరలో మార్పులు చేశారని అధికార వర్గాలు తెలిపాయి. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 269ఎస్ఎస్ ప్రకారం స్థిరాస్థి లావాదేవీల్లో రూ.20వేలు అంతకంటే ఎక్కువ నగదు రూపంలో స్వీకరిస్తే శిక్ష ఉంటుంది. అయితే.. ఫామ్‌హౌస్ కోసం రూ.100 కోట్లు నగదు రూపంలో చెల్లించినట్లు ఐటీ శాఖ గుర్తించింది.
పన్ను ఎగవేత ఆరోపణలతో మార్చి 23న హీరో మోటో కార్ప్ కార్యాయాలపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. పవన్ ముంజల్ సహా ఇతర అధికారుల నివాసాల్లోనూ సోదాలు జరిపింది. దిల్లీలోని 40కి పైగా కార్యాలయాల్లో మార్చి 26న సోదాలు పూర్తయ్యాయి.
ఇదీ చూడండి: మరో దిగ్గజ సంస్థకు సీఈఓగా భారత సంతతి వ్యక్తి