Health Insurance Renewal : అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్య బీమా ఆర్థిక భరోసా ఇస్తుంది. అయితే అలాంటి ఆరోగ్య బీమా పాలసీలను తీసుకున్నప్పుడు సకాలంలో వాటిని పునరుద్ధరించాలి. అప్పుడే వయసు లేదా మారుతున్న ఆరోగ్య స్థితితో సంబంధం లేకుండా నిరంతర కవరేజీని పొందవచ్చు. పాలసీ అమలులోకి రావడానికి ముందు ఉండే నిరీక్షణ వ్యవధి కూడా త్వరగా ముగుస్తుంది. ఇలా సకాలంలో పాలసీ రెన్యువల్ చేసుకుంటే వయసు, ఆరోగ్య సమస్యలు, లైఫ్‌స్టైల్ అలవాట్ల కారణంగా క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే ప్రమాదం కూడా ఉండదు.
సకాలంలో ఆరోగ్య బీమా పాలసీని పునరుద్ధరించకపోతే కలిగే నష్టాలివే :
నిరంతర కవరేజీ కోల్పోవడం : ఎవరికీ అనారోగ్య సమస్యలు చెప్పిరావు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని సకాలంలో పునరుద్ధరించకపోతే, సరిగ్గా అదే సమయంలో ఏదైనా జబ్బు చేస్తే ఇబ్బందుల పాలవుతాం. దీనికితోడు వైద్య ఖర్చులు కూడా అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థికంగా గడ్డుకాలం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ దుస్థితి తలెత్తకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు పాలసీని రెన్యువల్ చేసుకోవాలి.
నిరీక్షణ వ్యవధి పొడిగింపు : మనం తీసుకున్న వెంటనే ఆరోగ్య బీమా పాలసీ అమల్లోకి రాదు. క్లెయిమ్ చేసుకోవడానికి కొంతకాలం వేచి చూడాలి. ఈ సమయాన్నే నిరీక్షణ వ్యవధి అంటారు. ఈ గడువు నెల నుంచి నుంచి మూడు నెలల (30 నుంచి 90 రోజులు) వరకు ఉంటుంది. ఇక కొన్ని తీవ్రమైన జబ్బులకు 4 నుంచి 5 ఏళ్లు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీమా పాలసీ పునరుద్ధరణ సకాలంలో చేయలేకపోతే ఈ గడువును పొడిగిస్తూ ఉంటారు. ఫలితంగా అత్యవసర సమయంలో మీకు పాలసీ ఉపయోగపడకపోయే ఛాన్స్ ఉంది.
ఎక్కువ ప్రీమియం : సకాలంలో పాలసీని పునరుద్ధరించని వారి నుంచి కొన్ని బీమా సంస్థలు అధిక ప్రీమియం రుసుము వసూలు చేస్తాయి. అయితే కొన్నిసార్లు మళ్లీ వైద్య పరీక్షలు చేసుకోవాల్సి రావొచ్చు. అప్పుడు ఏమైనా వ్యాధులు నిర్ధరణ అయితే అధిక ప్రీమియం తప్పదు. పైగా వయసు, జీవనశైలి అలవాట్లు, ఆరోగ్య స్థితి అర్హతలకు తగిన విధంగా లేకపోతే పాలసీని పూర్తిగా రద్దు చేసే ప్రమాదము కూడా ఉంది.
నో -క్లెయిం బోనస్ ఉండదు : దీర్ఘకాలం పాటు పాలసీని క్లెయిమ్ చేసుకోని వారికి కొన్ని సంస్థలు నో-క్లెయిమ్ బోనస్ పేరిట ప్రీమియంలో సబ్సిడీ కల్పిస్తాయి. ఇక మరికొన్ని సంస్థలు 100 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాయి. సకాలంలో పాలసీని రెన్యువల్ చేసుకోకపోతే ఈ ప్రయోజనాన్ని కోల్పోవాల్సి వస్తుంది.
పన్ను ప్రయోజనాలు ఉండవు!
ఆదాయ పన్ను చట్టం ప్రకారం సెక్షన్ 80డీ ద్వారా హెల్త్ ఇన్సురెన్స్ ప్రీమియం చెల్లింపుల కింద రూ.75 వేల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. అయితే దీనికి క్రియాశీలంగా ఉన్న బీమా పాలసీ ఉండాలి. పన్ను రిటర్నులు ఫైల్ చేసే సమయానికి పాలసీని పునరుద్ధరించకపోతే ప్రయోజనాన్ని కూడా పొందలేరు.
హెల్త్ ఇన్సూరెన్స్‌లో "నో క్లెయిమ్ బోనస్" గురించి తెలుసా? - లేదంటే మీకు చాలా నష్టం!
మెడిక్లెయిమ్ Vs హెల్త్ ఇన్సూరెన్సు - వీటిలో ఏది బెస్ట్ ఆప్షన్?