GST on ticket cancellation: రైలు టికెట్‌ను రద్దు చేసుకుంటే భారతీయ రైల్వే రుసుము వసూలు చేస్తోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ వ్యవహారం కొంత ఖరీదుగా మారింది. ఎందుకంటే రద్దు చేసుకున్నందుకు చెల్లించే రుసుముపై ఇకపై అదనంగా 'వస్తు సేవల పన్ను' కట్టాల్సి ఉంటుందని రైల్వే శాఖ తెలిపింది. రైలు టికెట్లతో పాటు హోటల్ బుకింగ్‌లను రద్దు చేసుకున్నా జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది.
ఉత్తర్వుల్లో రైల్వే శాఖ తెలిపిన ప్రకారం... ప్రయాణికుడికి కావాల్సిన సేవలను అందిస్తానని సర్వీసు ప్రొవైడర్ అంగీకరిస్తూ చేసుకున్న ఒప్పందమే రైలు టికెట్. ఆ టికెట్‌ను రద్దు చేసుకొని ప్రయాణికుడు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే దానికి ప్రత్యేకంగా రుసుము చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం వివరించింది. దాన్నే 'టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జెస్'గా వ్యవహరిస్తున్నారు. ఈ రుసుము చెల్లింపుల పరిధిలోకి వస్తుంది కనుక జీఎస్‌టీ వర్తిస్తుందని ఆర్థిక శాఖ పేర్కొంది.
- ఉదాహరణకు ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్‌పై ఐదు శాతం జీఎస్‌టీ వసూలు చేస్తారు. అదే రేటు టికెట్ రద్దుకు కూడా వర్తిస్తుంది. 48 గంటల ముందు ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్ రద్దు చేసుకుంటే భారతీయ రైల్వే రూ.240 క్యాన్సిలేషన్ ఛార్జీ వసూలు చేస్తోంది. ఈ టికెట్‌ను బుక్ చేసుకునేటప్పుడు ముందు చెప్పినట్లుగా ఐదు శాతం జీఎస్‌టీ చెల్లిస్తాం. రద్దు ఛార్జీలకు కూడా అదే రేటు వర్తింపజేస్తే రూ.12 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే టికెట్ క్యాన్సిల్ చేసుకోవడానికి మొత్తం రూ.252 (రూ.240+రూ.12) కట్టాల్సిందే.
- 48 గంటల ముందు ఏసీ 2-టైర్ టికెట్‌ను రద్దు చేసుకుంటే రూ.200, ఏసీ 3-టైర్ టికెట్ క్యాన్సిలేషన్‌పై రూ.180 వసూలు చేస్తున్నారు. అదే 48-12 గంటల మధ్య రద్దు చేసుకుంటే టికెట్ ధరలో 25 శాతం, 12-4 గంటల మధ్య రద్దు చేసుకుంటే టికెట్ ధరపై 50 శాతం క్యాన్సిలేషన్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. వీటన్నింటిపై 5 శాతం జీఎస్‌టీ అదనం.
- సెకండ్ క్లాస్ స్లీపర్ టికెట్‌ను రద్దు చేసుకుంటే మాత్రం ఎలాంటి జీఎస్‌టీ ఉండదని కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదీ చదవండి:
స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు, సెన్సెక్స్ 860 డౌన్, 80కి పతనమైన రూపాయి విలువ