తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసేందుకు ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ సిద్ధమైంది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌కు చెందిన డిపాజిట్లను, అప్పులను, ఇతర ఆస్తులను ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ కొనుగోలు చేయనుందని ఫెడరల్ డిపాజిట్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ (ఎఫ్‌డీఐసీ) తెలిపింది. ఒప్పందంలో భాగంగా మొత్తం 500 మిలియన్ల డాలర్ల ఈక్విటీ హక్కులు ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ నుంచి పొందినట్లు ఫెడరల్ డిపాజిట్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ తెలిపింది. ఈ లావాదేవీని కంపెనీ ఆర్థిక స్థితిని కాపాడుకునేలా రూపొందించామని ఫస్ట్ సిటిజన్ బ్యాంక్ వెల్లడించింది.
ఒప్పందం ప్రకారం ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్.. ఎస్‌వీబీకి చెందిన 56 బిలియన్ల డిపాజిట్లను, 72 బిలియన్ల డాలర్ల రుణాలను, 110 బిలియన్ల డాలర్ల ఆస్తులను తీసుకుటుంది. తాజాగా తీసుకున్న ఈ చర్యల వల్ల కస్టమర్లు, వాటాదారుల హక్కులను రక్షించేందుకు వీలవుతుందని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌కు చెందిన 72 బిలియన్ డాలర్ల ఆస్తులను.. 16.5 బిలియన్ డాలర్ల డిస్కౌంట్‌తో అమ్మినట్లు ఎఫ్‌డీఐసీ తెలిపింది. సోమవారం నుంచి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ చెందిన 17 బ్రాంచీలు.. ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ కింద పనిచేస్తాయని సంస్థ తెలిపింది.
సంక్షోభంలో కూరుకుపోయిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను.. ఫస్ట్ సిటిజన్ బ్యాంక్ కొనుగోలు చేయడం ఓ గొప్ప లావాదేవీ అని ఫస్ట్ సిటిజన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫ్రాంక్ హోల్డింగ్ అన్నారు. ఇది బ్యాంకింగ్ వ్యవస్థపై మరింత విశ్వాసాన్ని పెంచుతుందని తెలిపారు. ఈ కొనుగోలు పక్రియతో ఫస్ట్ సిటిజన్ బ్యాంక్ అమెరికాలోని అతి పెద్ద బ్యాంక్‌ల్లో ఒకటిగా నిలవనుంది.
శాంటాక్లారా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే సిలికాన్ వ్యాలీ బ్యాంక్.. టెక్ ఆధారిత వెంచర్ క్యాపిటల్ ఫండ్‌లకు నిధులు అందిస్తుంది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మాతృసంస్థ అయిన.. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఫైనాన్షియల్ గ్రూప్ తన పోర్ట్‌ఫోలియోలో నష్టాలను పూడ్చుకుని.. ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు 21 బిలియన్ డాలర్ల సెక్యూరిటీలను, 2.25 బిలియన్ డాలర్ల వాటా విక్రయాన్ని నిర్వహించనున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. ఈ ఒక్క ప్రకటనతో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం ప్రారంభమైంది. బ్యాంకు వైఫల్య పరిణామాలు వేగంగా జరిగాయి. నికర వడ్డీ ఆదాయాల్లో భారీ క్షీణత నమోదు కావచ్చని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ చేసిన ప్రకటన ఈ పతనాన్ని మరింత పెంచింది. బ్యాంక్‌ను ఎఫ్‌డీసీఐ షట్‌డౌన్ చేసిందన్న వార్తల నేపథ్యంలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఆస్తుల విలువ మంచులా కరిగిపోయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా టెక్ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టే సిలికాన్ వ్యాలీ బ్యాంకును షట్‌డౌన్ చేస్తూ.. ఫెడరల్ డిపాజిట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్(ఎఫ్‌డీఐసీ) ఉత్తర్వులు జారీ చేసింది.