ట్విట్టర్‌లో ఊహించిందే జరిగింది. ట్విట్టర్ లోగోగా కుక్క స్థానంలో మళ్లీ పిట్ట వచ్చింది. 3 రోజుల కిందట లోగో అయిన బ్లూ బర్డ్‌ను ట్విట్టర్ తొలగించింది. దాని స్థానంలో డోజీకాయిన్ క్రిప్టోకరెన్సీ లోగో అయిన డోజీమీమ్‌ను ట్విట్టర్ లోగోగా ఉంచింది. ఓ వినియోగదారునికి ఇచ్చిన మాట ప్రకారమే అలా చేసినట్లు సంస్థ అధినేత ఎలాన్‌మస్క్ ప్రకటించారు. అయితే అది శాశ్వతంగా ఉంటుందా లేదా అని మాత్రం మస్క్ అప్పుడు స్పష్టత ఇవ్వలేదు. సామాజిక మాధ్యమాల్లో సరదాగా ఈ డోజీమీమ్‌ను వాడతారు. దీంతో మస్క్ కూడా సరదాగా దీన్ని ఏర్పాటు చేసి ఉంటారనీ.. కొన్ని రోజులే ఇది లోగోగా ఉంటుందన్న సందేహాలు వెలువడ్డాయి. ఇప్పుడు అదే నిజమైంది. ట్విట్టర్ ప్రారంభం నుంచి ఉన్న బ్లూబర్డ్ లోగోను ఆ సంస్థ పునరుద్ధరించింది.
ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచే ఆ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్.. మైక్రో బ్లాగింగ్ సైట్లో అనేక మార్పులు చేస్తున్నారు. ట్విట్టర్ లోగోను మార్చుతూ మూడు రోజుల క్రితం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్ పిట్ట స్థానంలో కుక్క(డోజ్ మీమ్)ను లోగోగా అప్డేట్ చేశారు. ఈ డోజ్ మీమ్‌ను 2013లో ఫన్నీగా క్రియేట్ చేశారు. ఈ డోజ్ మీమ్.. డోజ్కాయిన్ అనే క్రిప్టో కరెన్సీ లోగోలో కూడా ఓ భాగంగా ఉంది. అయితే.. బిట్‌కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీలకు పోటీగా డోజ్కాయిన్ ఈ ఫన్నీ లోగోను క్రియేట్ చేసింది. ఎలన్‌మస్క్ ట్విట్టర్ లోగోను మార్చిన తర్వాత డోజ్కాయిన్ విలువ 20 శాతానికి పైగా పెరిగింది.
ట్విట్టర్ లోగోను బ్లూబర్డ్ నుంచి డోజీమీమ్ మార్చిన సందర్భంగా ఎలన్ మస్క్.. ఓ ఫన్నీ ఫోటో కూడా ట్వీట్ చేశారు. అందులో డోజ్ కారులో వెళ్తుండగా.. ట్రాఫిక్ పోలీస్ లైసెన్స్ అడుగుతాడు. ట్విట్టర్ పిట్ట ఉన్న కార్డును డోజ్.. పోలీసులకు ఇస్తుంది. ఫొటో తేడాగా ఉందని పోలీస్ అడగ్గా.. అది పాత ఫోటో అని సమాధానమిస్తుంది డోజ్. ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో తెగ నవ్వులు పూయిచింది. ఈ పోస్టుతో పాటు మరో ఫొటోను కూడా ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. అందులో గతేడాది 'కొత్త ప్లాట్‌ఫామ్ అవసరమా' అని అడిగారు మస్క్. దీనికి ఛైర్మన్ అనే యూజర్.. 'ట్విటర్‌ను కొనుగోలు చేసి.. లోగోగా డోజ్ ఫొటోను మార్చండి' అని బదులిచ్చాడు. ఈ ఫొటోకు 'హామీ నెరవేర్చాను' అని ఎలన్‌మస్క్ రాసుకొచ్చారు. తాజాగా ట్విట్టర్ లోగోను డోజీమీమ్ నుంచి మళ్లీ బ్లూబర్డ్కు మార్చారు మస్క్.