Difference Between Normal and Power Petrol in Telugu : సాధారణంగా బైక్ లేదా కారులో పెట్రోల్ నింపుకోవడానికి బంక్ దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడ అనేక రకాల పెట్రోల్‌లు అందుబాటులో ఉంటాయి. ఇండియాలో ప్రస్తుతం మూడు రకాల పెట్రోల్‌లు అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ పెట్రోల్ బంకుల్లో నార్మల్ పెట్రోల్‌తో పాటు ప్రీమియం పెట్రోల్‌ను విక్రయిస్తుంటారు. అయితే దీని ధర రెగ్యులర్ పెట్రోల్(Normal Petrol) కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది.
ముఖ్యంగా కొత్తగా వాహనం కొనుగోలు చేసే చాలా మందిలో ఈ రెండింటిలో దేనిని ఉపయోగిస్తే మంచిది అనే ఆలోచన వెంటాడుతుంది. అయితే ఇంతకీ ఈ పెట్రోల్ల మధ్య తేడా ఏంటి? అవి వాహనాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి? వాటిని వాడడం వల్ల కలిగే మార్పులు, ప్రయోజనాలు? అలాగే మీ బైక్ లేదా కారు ఇంజిన్ ప్రకారం ఏ రకం పెట్రోల్ ఎక్కువ మైలేజ్ ఇస్తుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..
Normal Petrol Vs Power Petrol : ప్రస్తుతం దేశంలో ఉన్న మూడు రకాల పెట్రోల్లో.. ఒకటి సాధారణ పెట్రోల్ కాగా, మరొకటి ప్రీమియం పెట్రోల్. ఇది కాకుండా హై ఆక్టేన్ ప్రీమియం అనే మూడో రకం పెట్రోల్ కూడా ఉంది. దీని ధర మాత్రం సాధారణ పెట్రోల్ కంటే 15 రూపాయలు ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రీమియం పెట్రోల్‌ను పవర్, స్పీడ్, ఎక్స్ట్రా మైల్, హై స్పీడ్ వంటి పేర్లతో కూడా పిలుస్తారు. కంపెనీని బట్టి ఈ పేర్లను నిర్ణయిస్తారు. ఇదిలా ఉంటే కొన్ని పెట్రోల్ బంక్‌ల వద్ద ఉండే ఏజెంట్లు కూడా ప్రీమియం పెట్రోల్ గురించి ఎక్కువ చేసి చెబుతూ, దాని వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని కస్టమర్లను ఒప్పించి వారికి అధిక ధర పెట్రోల్‌ను విక్రయిస్తుంటారు. వీటి మధ్య ప్రధాన తేడాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
నార్మల్, పవర్ పెట్రోల్ మధ్య తేడా ఏమిటి? : పెట్రోల్ గ్రేడ్‌ను దాని ఆక్టేన్ విలువ ఆధారంగా వర్గీకరిస్తారు. ఇండియాలో నార్మల్ పెట్రోల్ ఆక్టేన్ విలువ 87 కాగా, అదే పవర్ పెట్రోల్ ఆక్టేన్ విలువ 91గా రేట్ చేయబడింది. హై ఆక్టేన్ కలిగిన ఇంధనం ఎక్కువ కంప్రెషన్ రేషియోని కలిగి ఉంటుంది. దీని ఫలితంగా, మీరు మీ వాహనం ఇంజిన్‌ను స్టార్ట్ చేసే సమయంలో ఎక్కువ ఇంధనం కాలిపోదు. అంతేకాదు కార్బన్‌పై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది.
ఆక్టేన్ ప్రభావము ఏమిటంటే.. నిజానికి హై ఆక్టేన్ ఉన్న పెట్రోల్ ఇంజిన్ నాకింగ్, ఇంజిన్‌లో శబ్ధాలను తగ్గిస్తుంది. ఇంజిన్ నుంచి వచ్చే ధ్వనిని నియంత్రించడానికి ఇంజిన్ నాకింగ్, డిటోనేటింగ్ అనేవి యాంత్రిక పదాలు. ప్రతి వాహనంలో హై ఆక్టేన్ పెట్రోల్ ప్రయోజనకరంగా ఉంటుందని కాదు. ఎక్కువ కంప్రెషన్ సిస్టమ్ ఉన్న వాహనాలకు ఇది వర్తిస్తుంది. ఆక్టేన్ అనేది ఇంజిన్ పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి తోడ్పడుతుంది. అలాగే వాహన యజమానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. నిజానికి, పవర్ పెట్రోల్ అంటే ఎక్కువ ఆక్టేన్ కలిగిన పెట్రోల్ అధిక కంప్రెషన్ ఇంజన్లకు అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకు శక్తివంతమైన ఇంజిన్లు కలిగిన స్పోర్ట్స్ కార్లు, శక్తివంతమైన బైక్‌లు, సూపర్ కార్లు, మొదలైన వాటికి ఈ ప్రీమియం పెట్రోల్ ఉత్తమంగా ఉంటుంది. ఈ వాహనాల్లో దీనిని ఉపయోగించడం వలన వాటి పనితీరు మరింత మెరుగు పడుతుంది.
ప్రీమియం పెట్రోల్ ప్రయోజనాలు ఏమిటి? : ఈ పెట్రోల్ ఇంధన ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది. అలాగే దీని కారణంగా ఇంజిన్ బాగా పని చేస్తుంది. ఇంజిన్‌కు ఎక్కువ ఇంధనం అవసరం లేదు. అలాగే, ప్రీమియం పెట్రోల్ వాహనం వేగం, శక్తిపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మీరు పవర్ పెట్రోల్‌ను ఉపయోగించినప్పుడు, అది నేరుగా ఇంజిన్ నాక్‌ను తగ్గిస్తుంది. అలాగే ఇంధనం శక్తి.. వాహనం శక్తిని కూడా ప్రభావితం చేస్తుంది. అయితే తక్కువ ఇంధన సామర్థ్యం కలిగిన ఇంజిన్‌లను ఉపయోగించుకునే కమ్యూటర్ వాహనాలకు ఇది పెద్దగా ఉపయోగపడదు. ఎందుకంటే తక్కువ పవర్ కలిగిన ఇంజిన్లలో ఉండే తక్కువ కంప్రెషన్ రేషియో కారణంగా.. వాటిలో ఈ ఇంధనం పెద్దగా పనిచేయదు. ఫలితంగా.. ఆ వాహనాల పనితీరు, మైలేజ్‌లో పెద్ద మార్పు ఉండదు. కాబట్టి, ఇలాంటి వాహనాల్లో ప్రీమియం పెట్రోల్‌ను ఉపయోగించడం లాభదాయకం కాదనే విషయం మీరు గుర్తుంచుకోవాలి.
మీ వాహనానికి ఏ పెట్రోల్ మంచిదంటే? ప్రతి వినియోగదారుడు ముందుగా వాహనంలో ఇంధనం నింపే విషయంలో వారి వాహన మ్యాన్యువల్‌లో ప్రస్థావించిన అంశాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా, మీ కారు లేదా బైక్‌కు ఐదు లేదా పది సంవత్సరాలు వయస్సు ఉంటే.. ఆ వాహనాలలో సాధారణ పెట్రోల్‌ను నింపడం ఉత్తమం. లేదంటే, ఒకవేళ మీ బైక్ లేదా కారు మరింత శక్తివంతంగా ఉండే మోడలయితే అలాంటి వాటిల్లో ప్రీమియం పెట్రోల్ ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.