Azad Engineering Listing : ఆజాద్ ఇంజినీరింగ్ లిమిటెడ్ షేర్లు గురువారం స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లాభాలతో నమోదయ్యాయి. ఇష్యూ ధర రూ.524తో పోలిస్తే బీఎస్‌ఈలో 35.49 శాతం ప్రీమియంతో రూ.710 దగ్గర లిస్ట్ అయ్యింది. ఎన్‌ఎస్‌ఈలో 37.40 శాతం పుంజుకొని రూ.720 దగ్గర ట్రేడింగ్‌ను మొదలుపెట్టింది. మొత్తం కంపెనీ మార్కెట్ విలువ రూ.4,219.19 కోట్లుగా నమోదైంది. ఐపీఓలో షేర్లు అలాట్ అయినవారు కనీసం 28 షేర్లకు రూ.14,672 పెట్టుబడిగా పెట్టగా, వారికి లిస్టింగ్‌లో ఒక్కో లాట్‌పై రూ.5,488 లాభం వచ్చింది.
గత శుక్రవారం ముగిసిన ఆజాద్ ఇంజినీరింగ్ ఐపీఓకు 80.60 రెట్ల స్పందన లభించింది. రూ.240 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు రూ.500 కోట్లు విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించింది సంస్థ. ఐపీఓలో ధరల శ్రేణిని రూ.499- 524గా నిర్ణయించింది. సమీకరించిన నిధులను రుణ చెల్లింపులు, మూలధన వ్యయం, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు సంస్థ తెలిపింది. రక్షణ, ఏరోస్పేస్, ఇంధన, చమురు పరిశ్రమలకు చెందిన కంపెనీలకు ఆజాద్ ఇంజినీరింగ్ తమ ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. మిట్సుబిషీ హెవీ ఇండస్ట్రీస్, సీమెన్స్ ఎనర్జీ, హనీవెల్ ఇంటర్నేషనల్, జనరల్ ఎలక్ట్రిక్, ఈటన్ ఏరోస్పేస్, ఎంఏఎన్ ఎనర్జీ సొల్యూషన్స్ వంటి ప్రముఖ కంపెనీలు ఆజాద్ ఇంజినీరింగ్‌కు వినియోగదారులుగా ఉన్నాయి.
ప్రముఖ క్రీడాకారులకు వాటాలు
మరోవైపు ఆజాద్ ఇంజినీరింగ్‌లో ప్రముఖ క్రీడాకారులు సచిన్ తెందూల్కర్, సైనా నెహ్వాల్, వీవీఎస్ లక్ష్మణ్, పీవీ సింధు, నిఖత్ జరీన్ వంటి వారికి వాటాలున్నాయి. అయితే, లిస్టింగ్ తర్వాత తెందూల్కర్ పెట్టుబడి విలువ దాదాపు ఏడు రెట్లు పెరిగింది. ఈ ఏడాది మార్చిలో ఆయన ఒక్కో షేరుకు రూ.3,423 చొప్పున 14,607 షేర్లను కొన్నారు. ఆ తర్వాత కంపెనీ రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును రూ.2 ముఖ విలువ కలిగిన ఐదు షేర్లుగా విభజించింది. దీంతో పాటు ఒక్కో షేరుకు మరో ఐదు షేర్లను బోనస్‌గా జారీ చేసింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోగా తెందూల్కర్ షేర్లు 4.5 లక్షలకు చేరాయి. ఫలితంగా ఒక్కో షేరు సగటు కొనుగోలు ధర రూ.110గా మారింది. అయితే, తాజా ఐపీఓలో ఆఫర్ ఫర్ సేల్ కింద ఆయన షేర్లను విక్రయించలేదు. ఈ లెక్కన ఆయన దాదాపు రూ.ఐదు కోట్లు పెట్టుబడిగా పెట్టగా, తాజా షేరు ధర ప్రకారం అది దాదాపు రూ.32 కోట్లకు చేరుకుంది.
స్టాక్ మార్కెట్ల నయా రికార్డ్- సెన్సెక్స్@72,038- నిఫ్టీ@21,654
ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్ - మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ ఖాతాల నామినేషన్ గడువు పెంపు