Automobile Industry Insights 2024 : భారతీయ ఆటోమొబైల్ ఇండస్ట్రీ 2023లో రికార్డ్ స్థాయిలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలను నమోదు చేసింది. ఇదే ఉత్సాహంతో 2024 సంవత్సరంలోకి ప్రవేశిస్తోంది. అయితే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ వచ్చే ఏడాది ఆటోమొబైల్స్ అమ్మకాల వృద్ధి మితంగా ఉంటుందని అంచనా వేస్తున్నాయి. కానీ, పర్యావరణ హితం కోసం గ్రీన్ టెక్నాలజీస్‌ను పెంపొందించి, ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని మరింత పెంచడానికి కృషి చేస్తామని చెబుతున్నాయి.
ధరలు పెరగనున్నాయ్!
Car Prices In India 2024 : ఈ ఏడాది దేశంలో 40 లక్షల యూనిట్లకు మించి ప్యాసెంజర్ వాహనాల అమ్మకాలు జరగవచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఇయర్ ఎండింగ్ డిస్కౌంట్లు కూడా ప్రకటించాయి. అయితే 2024 జనవరి నుంచి వాహనాల ధరలు పెరగనున్నాయి.
స్మాల్ కార్ సెగ్మెంట్
Maruti Suzuki Upcoming Cars 2024 : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఛైర్మన్ ఆర్సీ భార్గవ, 2023తో పోల్చితే వచ్చే ఏడాది కార్ల అమ్మకాలు తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. భారతీయ ఆటోమొబైల్ ఇండస్ట్రీ త్వరగా వృద్ధి చెందాలంటే, స్మాల్ కార్ సెగ్మెంట్ అభివృద్ధిపై దృష్టి సారించాలని అభిప్రాయపడ్డారు. అలాగే మొత్తం ఆటోమొబైల్ ఇండస్ట్రీతో పోల్చితే, మారుతి సుజుకి కంపెనీ ఎక్కువ వృద్ధిని నమోదు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
'కర్బన ఉద్గారాలను తగ్గించాలనే లక్ష్యంతో, తాము గ్రీన్ టెక్నాలజీస్‌ను అభివృద్ధి పరుస్తున్నామని, వచ్చే ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల (EV) అమ్మకాలు పెరుగుతాయని ఆశిస్తున్నామని' ఆర్సీ భార్గవ పేర్కొన్నారు.
నోట్ : 2018-19 సంవత్సరంలో భారత్‌లో ఎంట్రీ లెవెల్ ప్యాసింజర్ కార్స్ అమ్మకాలు 14 శాతం వరకు ఉంటే, ఈ ఏడాది ఏకంగా 4 శాతానికి వీటి అమ్మకాలు తగ్గాయి.
వాహనాల అమ్మకాలు పెరుగుతాయ్!
Automobile Sales In 2024 Forecast : సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చురర్స్ (SIAM) డైరెక్టర్ జనరల్ రాజేశ్ మేనన్, 2024లో కూడా ఆటోమొబైల్ అమ్మకాలు బాగుంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. దీని వల్ల భారత ఆర్థిక వృద్ధి కూడా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పర్యావరణ హితం కోసం ఈవీ వాహనాల ఉత్పత్తి గణనీయంగా పెంచుతామని ఆయన స్పష్టం చేశారు.
ఫేమ్ (FAME) స్కీమ్ న్యూ వెర్షన్!
Fame India Scheme Details : కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ కింద FAME స్కీమ్‌ను అమలుచేస్తోంది. ఇది ఒక సబ్సిడీ స్కీమ్. దీని ద్వారా హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే కంపెనీలకు ప్రభుత్వం సబ్సిడీ కల్పిస్తుంది. ఈ స్కీమ్ కాలవ్యవధి 2024 మార్చితో ముగియనుంది.
అయితే 2024 మార్చి తరువాత, భారత ప్రభుత్వం మరో సరికొత్త ఫేమ్ స్కీమ్‌ను అమలు చేయాలని, ఆటోమొబైల్ ఇండస్ట్రీ మొత్తం ఆశిస్తోందని రాజేశ్ మీనన్ పేర్కొన్నారు. దీని వల్ల కారు కొనుగోలుదారులకే కాదు, పరిశ్రమ వర్గాలకు కూడా మేలు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా దీని వల్ల వివిధ రకాల సరికొత్త ఉత్పత్తులను తయారు చేయడానికి చేయూత లభిస్తుందని, ఫలితంగా పరిశ్రమ మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
స్థిరమైన వృద్ధి సాధిస్తాం!
ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా, వచ్చే ఏడాది ఆటోమొబైల్ సెక్టార్ స్థిరమైన వృద్ధి సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు కాస్త తక్కువగా, ద్విచక్ర వాహనాల అమ్మకాలు కాస్త ఎక్కువగా జరుగుతాయని ఆయన ఊహిస్తున్నారు. అంతేకాదు దేశంలో ఈవీ వాహనాల అమ్మకాలు, గ్రీన్ టెక్నాలజీస్ అభివృద్ధి కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
భద్రతా ప్రమాణాలు పెరుగుతాయ్!
Automotive Safety Features : ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చురర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ విన్నీ మెహతా, భారత్‌లో NCAPని ప్రవేశపెట్టడం శుభపరిణామం అని పేర్కొన్నారు. దీని వల్ల ఆటోమోటివ్ కాంపోనెంట్స్ రంగం ఎలక్ట్రిక్ వాహనాల విడి భాగాల తయారీపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. దీని వల్ల వాహనాల భద్రతా ప్రమాణాలు మరింత పెరుగుతాయని చెప్పారు. ముఖ్యంగా అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) అన్ని వాహనాల్లో కచ్చితంగా పొందుపరిచే అవకాశం ఉంటుందని విన్నీ మెహతా అభిప్రాయపడ్డారు. దీని వల్ల వాహనాల భద్రత మరింత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఎస్‌యూవీలపై మోజు పెరుగుతోంది!
SUV Car Sales In India 2023 : 'భారతదేశంలో ఈ సంవత్సరం జరిగిన కారు అమ్మకాల్లో, ఎస్యూవీ కార్ల వాటానే 49 శాతం వరకు ఉంటుందని అంచనా. ఇందులోనూ 60 శాతం హ్యుందాయ్ కార్లదే కావడం గమనార్హం. 2024లోనూ ఇదే హవా నడుస్తుందని' హ్యుందాయ్ మోటార్ ఇండియా COO తరుణ్ గార్గ్ పేర్కొన్నారు.
ఉత్పత్తి పెంచుతాం!
'టాటా మోటార్స్ ఇకపై కూడా ఐసీఈ, ఈవీ వాహనాల ఉత్పత్తిని కొనసాగిస్తుంది. సరికొత్త ప్రొడక్టులను లాంఛ్ చేస్తుంది' అని ఆ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర పేర్కొన్నారు. కొత్తగా ప్రారంభించిన సనంద్ ఫ్యాక్టరీ ద్వారా తమ ఉత్పత్తులను మరింత పెంచుతామని ఆయన స్పష్టం చేశారు.
ఇన్ఫ్రాస్ట్రెక్టర్ అభివృద్ధిపై దృష్టి
Automotive Industry Infrastructure Development : దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని మరింత ముందుకు తీసుకుపోయేందుకు కృషి చేస్తోంది. అలాగే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రెక్చర్ను కూడా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది. '2025 నాటికి మా M&M ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోను స్టార్ట్ చేస్తాం' అని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటో & ఆటో ఫార్మ్ సెక్టార్ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సీఈఓ) రాజేశ్ జెజురికర్ తెలిపారు.
లగ్జరీ సెగ్మెంట్లోనూ
Luxury Car Market In India : 'సాధారణంగా కస్టమర్లు మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కోసం లగ్జరీ కార్లు కొంటుంటారు. అందువల్ల ఐసీఈ వాహనాలకే డిమాండ్ ఉంటుంది. ఇదే స్థాయిలో బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించాల్సి ఉంటుంది. అందువల్ల మెర్సిడెస్ బెంజ్ ఈవీ కార్స్ ఉత్పత్తికి మరింత కొంత కాలం పడుతుంది' అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ & సీఈఓ సంతోష్ అయ్యర్ పేర్కొన్నారు. అయితే లగ్జరీ కార్ల సెగ్మెంట్లోనూ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి త్వరలో మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆడి కూడా
EV Car Market Growth In India : విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ 'ఆడి' కూడా ఎలక్ట్రిక్ కార్ల తయారీపై ఉత్సాహం చూపిస్తోంది. 'భారత్‌లో ఈవీ కార్స్ తయారీపై, ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణపై దృష్టిసారిస్తున్నాం' అని ఆడి ఇండియా హెడ్ బల్జీర్ సింగ్ ధిల్లాన్ స్పష్టం చేశారు. అంతేకాదు, 2024లో లగ్జరీ కార్ సిగ్మెంట్ డిమాండ్ మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.