Amazon Great Indian Festival: ప్రముఖ ఈ-కామర్స్ వేదికలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల పండగకు సిద్ధమయ్యాయి. దసరా, దీపావళి పండగల నేపథ్యంలో ఈ రెండు సంస్థలూ పోటాపోటీగా సేల్స్ నిర్వహించనున్నాయి. 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' పేరిట అమెజాన్ సేల్ నిర్వహించనుండగా.. 'బిగ్ బిలియన్ డేస్' పేరిట ఫ్లిప్‌కార్ట్ ముందుకు రానుంది. వచ్చే నెల మొదటి వారంలోనే దసరా పండగ ఉన్న నేపథ్యంలో సెప్టెంబర్ నెలాఖరులోనే ఈ రెండు సేల్స్ జరగనున్నాయి. మరి సేల్ తేదీలు, కార్డు ఆఫర్ల వివరాలపై ఓ లుక్కేద్దామా..
'బిగ్ బిలియన్ డేస్' సేల్‌కు సంబంధించి ఇప్పటికే తన వెబ్‌సైట్‌లో ఫ్లిప్‌కార్ట్ ఓ బ్యానర్‌ను సిద్ధం చేసింది. అందులో తేదీల వివరాలను మాత్రం వెల్లడించలేదు. అయితే, సెప్టెంబర్ 23 నుంచి 30 వరకు ఈ సేల్ నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఇందులో ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ లభించనుంది. ఆఫర్ల వివరాలు సేల్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు రివీల్ కానున్నాయి.
ఇక అమెజాన్ సైతం 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్'ను ఫ్లిప్‌కార్ట్‌తో పోటీగా దాదాపు అదే తేదీల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఈ సారి సేల్‌లో ఎస్‌బీఐ కార్డుదారులకు 10 శాతం డిస్కౌంట్ లభించనుంది. ఆఫర్ల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు ఒక రోజు ముందే ఈ సేల్‌లో పాల్గొనే అవకాశం దక్కుతుంది. అమెజాన్ తేదీలను ప్రకటించే తేదీలను బట్టి ఫ్లిప్‌కార్ట్ తేదీలు మారే అవకాశం ఉంది.
ఈ సారి సేల్‌లో ఎక్కువగా ఐఫోన్లపై భారీ ఆఫర్లు ఉండే అవకాశం ఉంది. ఈ నెల 7వ తేదీన యాపిల్ తన తదుపరి ఐఫోన్ మోడల్ 14ను విడుదల చేయనుంది. సాధారణంగా కొత్త మోడల్ వచ్చినప్పుడు పాత మోడల్ ధరలను ఐఫోన్ తగ్గిస్తుంది. ఈ క్రమంలో ఐఫోన్ 12, 13 మోడళ్లపై ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది. దీంతో పాటు వివిధ కంపెనీల మొబైళ్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తక్కువ ధరకే ఈ సేల్స్‌లో సొంతం చేసుకోవచ్చు.
ఇవీ చదవండి: ప్రతిష్ఠ కోసమే సైరస్ పోరు.. రతన్ టాటా చొరవతో ఛైర్మన్‌గా మారి..