gold rates today: అక్షయ తృతీయ (మే 3) సందర్భంగా బంగారం అమ్మకాలు కొవిడ్ ముందు కంటే అధికంగా సాగుతాయనే ఆశాభావంతో విక్రేతలున్నారు. కొవిడ్ పరిణామాలతో గత రెండేళ్లుగా అక్షయ తృతీయ అమ్మకాలు అంతంతమాత్రంగానే సాగాయి. ఇప్పుడు వ్యాపార కార్యకలాపాలన్నీ సాధారణ స్థితికి చేరడం, ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండటం, అంతర్జాతీయంగా అనిశ్చితులు నెలకొన్న నేపథ్యంలో మళ్లీ పసిడిపైకి పెట్టుబడులు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. వినియోగదారులను ఆకర్షించేందుకు పలు ఆఫర్లను జువెలరీ సంస్థలతో పాటు ఆన్‌లైన్ సంస్థలు కూడా ఇస్తున్నాయి.
ఆర్థిక, సామాజిక అనిశ్చితి పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం పెరుగుతుంటుంది. ఈ సమయంలో షేర్లు, ఇతరత్రా పెట్టుబడుల కంటే బంగారంపైనే అధిక ప్రతిఫలం వస్తుందనే భావనతో కొనుగోలు చేస్తుంటారు. అయితే జనవరి-మార్చి త్రైమాసికంలో మాత్రం బంగారం ధర పెరిగినా, దేశీయంగా ఆభరణాలు/మేలిమి బంగారం నాణేలు, బిస్కెట్ల పరంగా కొనుగోళ్లు తక్కువగా జరిగాయి. 'ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్లే ధర పెరిగింది.. మళ్లీ తగ్గుతుందిలే' అనే భావనకు కొనుగోలుదారులు రావడమే ఇందుకు కారణమని ప్రపంచ స్వర్ణ మండలి తాజాగా పేర్కొంది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ రూపేణ పసిడిపైకి పెట్టుబడులు అధికంగా తరలిరావడం గమనార్హం. ప్రస్తుతం దేశీయంగా 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.53,600గా ఉంది.
బంగారంపై దృక్పథం మారుతుందా?: ఇతర దేశాల వారు ట్రేడింగ్ ద్వారా బంగారాన్ని ఆర్జనకు అత్యధికంగా వినియోగిస్తున్నారు. మన దేశంలో మాత్రం ఆభరణాలు చేయించి, అలంకరణకు వాడుకోవడమే ఎక్కువ. ఎక్కువమంది ఆభరణాలను బ్యాంకు లాకర్లు, ఇనుప బీరువాల్లో భద్రంగా దాచిపెడుతున్నారు. ‘బంగారం ధర పెరిగితే, మన సంపద విలువ పెరిగినట్లే కదా’ అనుకుంటూ ఉంటారు. ఇందువల్లే వేల టన్నుల బంగారం పోగుబడినా, విదేశాల్లో మాదిరి నగదు రూపేణ చెలామణి ఉండటం లేదు.. ఆ స్థాయిలో ఆర్జనా కనపడటం లేదు. కొవిడ్ పరిణామాల్లో ఆర్థిక అవసరాల కోసం పాత బంగారాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన వారికీ మార్కెట్ ధర లభించలేదు. అందువల్లే తనఖా పెట్టుకుని, రుణం తెచ్చుకుని వాడుకున్నారు. ఇప్పుడు పుత్తడి ధర బాగా పెరిగిన నేపథ్యంలోనూ ఇదే తంతు. విక్రయిద్దామంటే, తీసుకుని నగదు ఇచ్చే వ్యాపారులు బహు అరుదు. కొత్త ఆభరణాలు తీసుకునేందుకు మాత్రమే పాత బంగారాన్ని తీసుకుంటున్నారు. నగదు కావాలంటే, 20-30 శాతం తక్కువ ధరకు కొందరు అడుగుతున్నారు. ఈ పరిణామాలతో ‘బంగారం చేతిలో ఉంటే, అవసరమైనప్పుడు ఎప్పుడైనా విక్రయించుకోవచ్చు’ అనే భావన క్రమంగా తగ్గుతోంది. మన దగ్గరా ఎంసీఎక్స్ వంటి కమొడిటీ ఎక్స్ఛేంజీల్లో పసిడిపై ట్రేడింగ్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ విధానంలో షేర్ల ట్రేడింగ్ మాదిరి ఎప్పటికప్పుడు నగదు పొందగలగడమే ఇందుకు కారణం. అయితే ఫ్యూచర్ ట్రేడింగ్ కావడంతో, తాహతుకు మించి పెట్టుబడులు పెడితే, భారీగా నష్టపోయే ప్రమాదమూ ఇందులో ఉంది.
సెంటిమెంటు రీత్యా..: అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోలు చేస్తే సంపద మరింత పెరుగుతుందనే నమ్మకమే ఈసారి విక్రయాలు పెరిగేందుకు కారణమవుతుందని ప్రపంచ స్వర్ణమండలి ఇండియా ఎండీ సోమసుందరం అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ అమ్మకాల వల్ల మరింతమంది ఎంతోకొంత కొనుగోలుకు ముందుకు వస్తారని పేర్కొన్నారు. 2019 కంటే కనీసం 5 శాతమైనా అధిక అమ్మకాలు సాగుతాయనే విశ్వాసాన్ని ఆలిండియా జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ఛైర్మన్ ఆశిష్, తనిష్క్ వైస్ ప్రెసిడెంట్ అరుణ్ నారాయణ్ వ్యక్తం చేశారు. అధిక ధరల వల్ల కొద్దిమొత్తం అయినా కొంటారని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఛైర్మన్ అహ్మద్ పేర్కొన్నారు. గతేడాది అక్షయతృతీయ నాడు 15-18 టన్నుల బంగారం విక్రయమైందని, ఈసారి ధర ఎక్కువగా ఉన్నా, 20 టన్నులు అమ్ముడవుతుందని భావిస్తున్నట్లు పీఎన్‌జీ జువెలర్స్ సీఎండీ సౌరభ్ గాడ్గిల్ చెప్పారు.
Gold Rate Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.420 మేర తగ్గింది. కిలో వెండి రూ.60 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.64,485గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.52,580గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల విలువలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,580 గా ఉంది. కిలో వెండి ధర రూ.64,485 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,580వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.64,485గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,580 ఉంది. కేజీ వెండి ధర రూ.64,485 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,580 ఉంది. కేజీ వెండి ధర రూ.64,485 వద్ద కొనసాగుతోంది.
- స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1,863 డాలర్లు పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 22.65 డాలర్లుగా ఉంది.
అక్షయ తృతీయకు ఎందుకంత ప్రత్యేకత: అక్షయ అంటే తరగనిది అని అర్థం. పురాణాల్లో అక్షయపాత్ర గురించి విని ఉంటాం. ఈ పాత్ర కలిగిన వారి ఇంటికి ఎంతమంది అతిథులు వచ్చినా కావాల్సినంత ఆహారాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీమహాలక్ష్మీ అమ్మవారు అన్ని ఐశ్వర్యాలకు అధినేత్రి. ఆమె అనుగ్రహం ఉంటే చాలు జీవితంలో ఏ లోటు ఉండదని నమ్మకం. అందుకనే లక్ష్మీదేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ పర్వదినాన పూజలు నిర్వహిస్తారు. వైశాఖ మాసంలో తదియ నాడు వచ్చే పర్వదినాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. త్రేతాయుగం ఈ రోజునే ప్రారంభం కావడం వల్ల ఈ తిథికి అంత విశిష్టత ఏర్పడింది.
సంపదలకు అధిపతి కుబేరుడు శివుడ్ని ప్రార్థించగా ఆయన లక్ష్మీ అనుగ్రహాన్ని ఇచ్చినట్టు శివపురాణం తెలుపుతోంది. మహాభారతంలో ధర్మరాజుకు ఈ రోజున అక్షయపాత్ర ఇవ్వడం, గంగానది ఆ పరమేశ్వరుని జటాజూటం నుంచి భువిపైకి అవతరించిన పవిత్ర దినం అక్షయ తృతీయ కావడం విశేషం. పరశురాముడిగా శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించిన దినమిది. ఇన్ని విశిష్టతలు ఉన్నందున అక్షయతృతీయను ఘనంగా జరుపుకుంటారు. ఈ ప్రత్యేక పర్వ దినాన పసిడి కొనుగోలు చేస్తే ఏడాది మొత్తం తమ వద్ద సిరులు ఉంటాయని నమ్ముతారు చాలా మంది. అందుకే అక్షయ తృతీయ నాడు ఎంతో కొంత బంగారం కొనుగోలు చేస్తుంటారు.
ఇదీ చదవండి: తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి లెక్కలు ఇలా...