వ్యవసాయానికి సాంకేతిక హంగులు అద్దడం, తృణధాన్యాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడమే లక్ష్యంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బడ్జెట్‌లో సాగు రంగానికి కేటాయింపులు జరిపారు. వ్యవసాయాన్ని పరిశ్రమలతో అనుసంధానం చేస్తామని తెలిపారు. వ్యవసాయానికి రుణ పరిమితిని 18లక్షల 60 వేల కోట్ల రూపాయను నుంచి 20లక్షల కోట్లకు పెంచారు. పంటల ప్రణాళిక, దిగుబడులు, పంట రక్షణ, మార్కెట్ ఇంటిలిజెన్స్ వంటి అంశాలతో వ్యవసాయానికి డిజిటల్ మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.
గ్రామీణ యువకుల అగ్రిస్టార్టప్‌లకు చేయూతనిచ్చేందుకు వ్యవసాయ ప్రోత్సాహక నిధి ఏర్పాటు చేస్తామన్నారు నిర్మలమ్మ. ఉద్యాన సాగులో నాణ్యమైన మొక్కలు అందుబాటులోకి తెచ్చేలా రూ.2200 కోట్ల రూపాయలతో ఆత్మనిర్భర్ హార్టికల్చర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్‌ను బడ్జెట్‌లో ప్రతిపాదించారు. తృణధాన్యాలకు భారత్‌ను కేంద్రంగా చేస్తామన్న నిర్మలమ్మ శ్రీఅన్న పథకం ద్వారా చిరుధాన్యాల రైతులను ప్రోత్సాహిస్తామని చెప్పారు.
"ప్రపంచంలోనే అత్యధికంగా తృణధాన్యాలను ఉత్పత్తి చేస్తున్నాం. రెండో అతిపెద్ద ఎగుమతిదారులుగా మనం ఉన్నాం. వీటి ద్వారా చాలా ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉన్నాయి. మన ఆహార వినియోగంలో ఇవి ఎన్నో శతాబ్దాలుగా భాగంగా ఉన్నాయి. ఇందులో సన్నకారు రైతుల భాగస్వామ్యం ఎంతో ఉందని చాలా గర్వంగా చెప్పగలను. దేశ ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు తృణధాన్యాలను పండించడంలో వారే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇకపై తృణధ్యాన్యాలకు భారత్‌ను ప్రపంచ హబ్‌గా మార్చేందుకు హైదరాబాద్‌లో ఉన్న తృణధాన్యాల పరిశోధన కేంద్రం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా సహకారం అందిస్తుంది. ప్రపంచవ్యాప్త పరిశోధనల్లో అత్యుత్తమ విధానాలు, అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకుంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న సహకార సంఘాల అనుసంధానానికి జాతీయ సహకార డేటాబేస్‌ను తయారు చేస్తాం. దీని ద్వారా బహుళ వికేంద్రీకరణ నిల్వ సామర్థ్యాన్ని పెంచుతాం. రైతుల ఉత్పత్తులు నిల్వచేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. వాళ్లకు నచ్చినప్పుడు లాభదాయక ధరలకు విక్రయించుకునేందుకు ఉపకరిస్తుంది. వచ్చే ఐదేళ్లలో ఇప్పటివరకూ లేని పంచాయతీలు, గ్రామాల్లో బహుళ ఉపయోగ సహకార సంఘాలు, ప్రాథమిక మత్స్యకార సంఘాలు, డెయిరీ సహకార సంఘాలను పెద్దసంఖ్యలో ఏర్పాటు చేస్తాం."
-- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
ప్రధానమంత్రి మత్స్య సంపద పథకానికి అనుబంధంగా మత్స్యరంగ అభివృద్ధికి రూ.ఆరు వేలకోట్ల రూపాయలతో కొత్త పథకం ప్రారంభిస్తామని నిర్మలమ్మ పద్దులో ప్రకటించారు. ఇక అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన కర్ణాటకకు పెద్దతాయిలమే ఇచ్చారు. మధ్య కర్ణాటకలోని కరవు ప్రాంతాల్లో సూక్ష్మసేద్యం, తాగు,సాగు నీరు అందించేందుకు ఉద్దేశించిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ.5300 కోట్లు ఆర్థిక సాయం ప్రకటించారు.