2000 Note Exchange Rules : రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వు బ్యాంకు చేసిన ప్రకటనతో ప్రజలు.. తమ వద్ద నోట్లను డిపాజిట్ లేదా మార్పిడి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే మంగళవారం నుంచే బ్యాంకుల్లో రూ.2వేల నోట్లను డిపాజిట్ లేదా మార్పిడి చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను బ్యాంకు అధికారులు పూర్తి చేశారు! అయితే ఇదే సమయంలో ప్రజల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాటిన్నింటికీ సమధానాలు తెలుసుకుందాం రండి.
బ్యాంక్‌కు వెళ్లాక ఏమైనా ఫామ్ నింపాలా?
2000 Note Exchange Form : రూ.2వేల నోట్లను డిపాజిట్ లేదా మార్పిడి చేసుకునేందుకు బ్యాంక్‌కు వెళ్లాక.. ఎటువంటి ఫామ్ నింపాల్సిన అవసరం లేదు. ఇదే విషయంపై స్టేట్ ఆఫ్ ఇండియా స్పష్టత కూడా ఇచ్చింది.
ఆధార్ వంటి గుర్తింపు కార్డు ఏమైనా బ్యాంక్‌కు సమర్పించాలా?
లేదు. బ్యాంక్‌కు ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డులేవీ సమర్పించాల్సిన అవసరం లేదు.
నోట్ల మార్పిడికి ఫీజు చెల్లించాలా?
లేదు. నోట్లు మార్చుకోవడానికి ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితం.
రూ.2వేల నోట్లను మార్చుకునేందుకు పరిమితి ఉందా?
2000 Note Exchange Limit : రూ.2వేల నోట్లు మార్చుకోవడంపై పరిమితి ఉంది. ప్రజలు ఒకసారి రూ.20వేలు మాత్రమే మార్చుకునే వీలు ఉంటుంది.
రూ.20వేల కంటే ఎక్కువ మార్చుకోవాలంటే ఏం చేయాలి?
ఒకసారి రూ.20వేలు విలువైన పెద్ద నోట్లను మాత్రమే బ్యాంకుల్లో వేరే నోట్లతో మార్చుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. కాబట్టి ఎంత మొత్తం కావాలో అంత డబ్బును డిపాజిట్ చేసి.. విత్‌డ్రా చేసుకోవచ్చు.
బ్యాంకులో రూ.2వేల నోట్ల డిపాజిట్‌పై పరిమితి ఉందా?
2000 Note Deposit Limit : బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవడంపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. కేవైసీ రూల్స్‌ను అనుసరించి డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే రూ.50,000 కంటే ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లకు పాన్ సమర్పించాలనే నిబంధన ఇప్పటికే ఉంది. ఆ నిబంధన రూ.2వేల నోట్ల డిపాజిట్లకూ వర్తిస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. కాబట్టి రూ.50 వేల కన్నా ఎక్కువ డిపాజిట్ చేయాలనుకునే వాళ్లు పాన్ కార్డు తీసుకెళ్లాల్సిందే.
రూ.2వేల నోట్లను ఎక్కడెక్కడ మార్చుకోవచ్చు?
ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2వేల నోట్లను ఏ బ్యాంకు శాఖలోనైనా మార్చుకునే వెసులుబాటు ఉంది. బ్యాంకులు కాకుండా దేశవ్యాప్తంగా ఆర్బీఐకి ఉన్న 19 ప్రాంతీయ కార్యాలయాల్లోనూ నోట్లను మార్చుకోవచ్చు.
బ్యాంకు ఖాతా ఉన్న బ్రాంచ్‌లోనే రూ.2వేల నోట్లు మార్చుకోవాలా?
ఏ బ్యాంకులోనైనా రూ.2వేల నోట్లను మార్చుకునే వీలు ఉంది. కానీ ఒక బ్రాంచిలో ఒకేసారి రూ.20వేలు మాత్రమే మార్చుకునే వీలు ఉంది.
రూ.2వేల నోటును తీసుకోవడానికి బ్యాంకులు నిరాకరిస్తే ఏం చేయాలి?
2000 Note Bank Deposit : బ్యాంకులు నోట్లను తీసుకోకపోవడం సేవల లోపంగా పరిగణిస్తారు. ఇలాంటి ఘటనలు జరిగితే తొలుత బ్యాంకు అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేయాలి. 30 రోజుల్లోగా స్పందించకపోయినా లేదా బ్యాంకు అధికారి ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోయినా రిజర్వు బ్యాంకు అంబుడ్స్‌మెన్ స్కీమ్ కింద ఆర్బీఐకి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
రెండు వేల నోట్లను రిజర్వు బ్యాంకు ఎందుకు ఉపసంహరించుకుంటోంది?
2000 Note Withdrawn Reason : "మార్కెట్లో అవసరమైన కరెన్సీ అందుబాటులోకి వచ్చింది. ఈ కారణం వల్లే రూ.2వేల నోటును ముద్రించడం నిలిపివేశాం. 2018-19లోనే ఈ నోట్ల ముద్రణ ఆగిపోయింది. ప్రస్తుతం చలామణీలో ఉన్న రూ.2వేల నోట్లన్నీ 2017 మార్చికి ముందు ముద్రించినవే. వాటి జీవితకాలం నాలుగు నుంచి ఐదేళ్లు ఉంటుంది" అని ఆర్బీఐ తెలిపింది.