2000 Currency Notes Withdraw RBI : రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై.. తీర్పును రిజర్వ్ చేసింది దిల్లీ హైకోర్టు. రజనీశ్ భాస్కర్ గుప్తా అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిల్‌పై.. ఇరుపక్షాలు వాదనలను మంగళవారం హైకోర్టు ధర్మాసనం ఆలకించింది. రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకునే అధికారం రిజర్వు బ్యాంకుకు లేదని పిటిషనర్ రజనీశ్ భాస్కర్ గుప్తా తరఫు న్యాయవాది సందీప్ అగర్వాల్.. ధర్మాసనం ఎదుట వాదించారు. అదే విధంగా రెండు వేల రూపాయల నోట్ల జీవిత కాలం 4-5 సంవత్సరాలు మాత్రమేనని ఆర్‌బీఐ ఎలా నిర్ధరణకు వచ్చిందన్నారు పిటిషనర్. నోట్లను జారీ చేయడం, తిరిగి జారీ చేయడం వంటి అధికారాలు మాత్రమే రిజర్వు బ్యాంకుకు ఉన్నాయని ఆయన వాదించారు.
ఈ వాదనలను ఆర్‌బీఐ తరపు న్యాయవాది పరాగ్ పి త్రిపాఠి వ్యతిరేకించారు. ఇది కేవలం 2,000 రూపాయల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు మాత్రమేనని ఆయన కోర్టుకు విన్నవించార. ఇది ఆర్థిక విధానానికి సంబంధించిన అంశమని తెలిపారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది.
అంతకుముందు కూడా ఇదే కోర్టులో.. 2వేల నోట్ల మార్పిడిపై న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ పిల్ దాఖలు చేశారు. ఆర్‌బీఐ, ఎస్బీఐ ఎలాంటి పత్రాలు లేకుండా.. నోట్ల మార్పిడికి అవకాశం ఇస్తుండడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. ఇది ఏకపక్ష నిర్ణయమని, అవినీతిని అరికట్టేందుకు చేసిన చట్టాలకు వ్యతిరేకమని వివరించారు. రూ. 2,000 నోటును చలామణి నుంచి ఉపసంహరించుకున్న తర్వాత ఆర్‌బీఐకి, జాతీయ ఆర్థిక వ్యవస్థకు ఏం ప్రయోజనం కలుగుతుందో రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేయలేదని ఈ పిల్లో పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన కోర్టు.. వ్యాజ్యాన్ని కొట్టివేసింది.
2022- 23 ఆర్థిక సంవత్సరంలో 7.8 శాతం పెరిగిన కరెన్సీ నోట్ల విలువ..
చలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల విలువ 2022- 23 ఆర్థిక సంవత్సరంలో 7.8 శాతం పెరిగిందని ఆర్‌బీఐ మంగళవారం విడుదల చేసిన వార్షిక నివేదిక ద్వారా వెల్లడించింది. నోట్ల సంఖ్య 4.4 శాతం పెరిగినట్లు తెలిపింది. చలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల విలువలో 5 వందలు, 2వేల నోట్ల విలువే 87.9 శాతమని పేర్కొంది. 2021- 22 ఆర్థిక సంవత్సరంలో ఇది 87.1 శాతంగా ఉందని వివరించింది. ఆర్‌బీఐ నివేదిక ప్రకారం.. 2023 మార్చి 31 నాటికి చలామణిలో ఉన్న నోట్లలో సంఖ్యాపరంగా 500 నోట్లే అధికం. వీటి వాటా 37.9 శాతం. మొత్తం 5లక్షల 16వేల 338 దాకా 500 నోట్లు చలామణిలో ఉన్నాయి. వీటి విలువ 25లక్షల 81 వేల 690 కోట్ల రూపాయలుగా ఉంది. మార్చి ముగిసే నాటికి 4లక్షల 55 వేల 468 దాకా 2 వేల నోట్లు చలామణిలో ఉన్నాయి. వీటి విలువ 3లక్షల 62 వేల 220 కోట్లుగా ఉన్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.