దేశవ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదల, వివిధ రాష్ట్రాల్లో ఆంక్షల భయాలు ఉన్నా స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలను గడించాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 375 పాయింట్లు పెరిగి 48,081 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 110 పాయింట్ల లాభంతో 14,406 వద్దకు చేరింది.
ఆరంభంలో నష్టాలు నమోదు చేసిన సూచీలు.. బ్యాంకింగ్ షేర్లు అండతో మిడ్ సెషన్ ముందు లాభాల్లోకి మళ్లాయి. ఫార్మా షేర్లు ఆరంభం నుంచే సానుకూలంగా స్పందించడం లాభాలు మరింత పెరిగేందుకు కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 48,143 పాయింట్ల అత్యధిక స్థాయి, 47,204 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 14,424 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,151 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్యూఎల్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో నిక్కీ, హాంగ్ సెంగ్ సూచీలు భారీగా లాభాలను నమోదు చేశాయి. కోస్పీ స్వల్పంగా లాభపడింది. షాంఘై సూచీ మాత్రం నష్టాలను మూటగట్టుకుంది.
ఇదీ చదవండి:'19 రోజుల్లో రూ.5,649 కోట్ల పన్ను రీఫండ్'