అంతర్జాతీయ ప్రతికూలతల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-సెన్సెక్స్ 152 పాయింట్ల కోల్పోయి 41,170 పాయింట్ల వద్ద స్థిరపడింది.
45 పాయింట్లు నష్టపోయిన జాతీయ ఎక్స్ఛేంజీ సూచీ-నిఫ్టీ 12,080 పాయింట్లకు చేరుకుంది.
కరోనా వైరస్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారని ట్రేడర్లు భావిస్తున్నారు. కరోనా కారణంగా దెబ్బతిన్న కంపెనీలకు రుణాల చెల్లింపును సులభం చేసేందుకు వడ్డీరేట్లను తగ్గించింది చైనా కేంద్ర బ్యాంకు. ఫలితంగా షాంఘై కాంపొజిట్ దూసుకెళ్లింది.
కంపెనీలు ఇలా..
ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ, జీ ఎంటర్టైన్మెంట్ లాభపడ్డాయి.
సిప్లా, ఏషియన్ పెయింట్స్, హిందూస్థాన్ యూనిలీవర్, టీసీఎస్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, రిలయన్స్, నెస్లే నష్టాలు చవిచూశాయి.
ఆసియాలో జపాన్, చైనా మినహా మిగతా మార్కెట్లన్నీ నష్టాల్లో ముగిశాయి.