Stock Market Today: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. తొలుత భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు ఇంట్రాడేలో కాస్త వెనక్కి తగ్గాయి. ఆరంభంలో 1600 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. మార్కెట్ ముగిసే సమయానికి 817 పాయింట్లు వృద్ధి చెంది 55,464కు చేరింది. మరోవైపు నిఫ్టీ 218 పాయింట్లు పెరిగి 16,563 వద్ద నిలిచింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో.. పంజాబ్ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో భాజపా ప్రభుత్వ ఏర్పాటు దిశగా సంకేతాలు వెలువడిన నేపథ్యంలో మార్కెట్లు సానుకూలంగా కదలాడాయి.
ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ రంగాలు పుంజుకోవడం కూడా.. లాభాల్లో కీలక పాత్ర పోషించాయి. వీటితో పాటు ఎఫ్ఎంసీజీ, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, బీఎస్ఈ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ షేర్లు కూడా లాభాలు ఆర్జించాయి.
- హిందుస్థాన్ యూనిలివర్, టాటా స్టీల్, గ్రేసిమ్, ఎస్బీఐఎన్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాలు గడించాయి.
- మరోవైపు కోల్ ఇండియా, టెక్‌మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, ఓఎన్జీసీ, టీసీఎస్ షేర్లు నష్టపోయాయి.
ఉక్రెయిన్- రష్యాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు చర్చల్లో పాల్గొనడం, చమురు ఉత్పత్తిని పెంచేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు యూఏఈ ప్రకటించడం ఇతర సానుకూలతలు.
ఇదీ చూడండి : త్వరలోనే మరో మెగా ఐపీఓ.. రూ.6,000- 7,500 కోట్లు టార్గెట్!