దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 405 పాయింట్లు లాభపడి 32,010 పాయింట్లకు చేరుకుంది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 120 పాయింట్లు పెరిగి 9,432 వద్ద కొనసాగుతోంది.
ఊతమిచ్చిన బ్యాంకింగ్..
మే డెరివేటివ్స్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో మదుపరుల సర్దుబాటుతో సూచీలు మెరుగుపడ్డాయి. బ్యాంకింగ్ రంగం షేర్లు లాభాల్లో ఉండటం వల్ల మార్కెట్లకు కలిసివచ్చింది. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా మార్కెట్లు లాభాలు గడించటం వల్ల మదుపర్ల సెంటిమెంటు బలపడింది.
అయితే కరోనా కేసుల పెరుగుతుండటం వల్ల అప్రమత్తంగానే ఉన్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నేడు చాలా కంపెనీలకు చెందిన నాలుగో త్రైమాసిక ఫలితాలు వెలువడనుండటంతో కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నేడు ఫలితాలు ప్రకటించనున్న కంపెనీల్లో టీవీఎస్ మోటార్స్, లుపిన్, ఫెడరల్ బ్యాంక్ వంటి 24 కంపెనీలు ఉన్నాయి.
లాభనష్టాల్లో..
ఓఎన్జీసీ, ఎల్ అండ్ టీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంకు షేర్లు లాభాల్లో సాగుతున్నాయి.
మహింద్రా అండ్ మహింద్రా, ఐటీసీ, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్ నష్టపోయాయి.