Stock Market Updates: సోమవారం కూడా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 949 పాయింట్లు కోల్పోయి 56,747 వద్దకు చేరింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 284 పాయింట్లు క్షీణించి 16,912 వద్ద స్థిరపడింది.
నష్టాలకు కారణాలు ఇవే..
- దేశీయంగా ఆదివారం ఒక్కరోజే 17 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశీయ మదుపరులు అమ్మకాలకు దిగారు.
- ఆర్థిక వ్యవస్థలు మళ్లీ అనిశ్చితిలోకి జారుకుంటాయనే ఆందోళన మదుపరుల్లో వ్యక్తమైంది.
- ఐరోపా, ఆఫ్రికా, ఇతర దేశాల్లో కొవిడ్ కొత్త కేసులు పెరగడం, ప్రభుత్వాలు ప్రయాణ ఆంక్షలు, లాక్‌డౌన్‌లు విధిస్తుండటం వల్ల ఆర్థిక రికవరీకి ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశం ఉందన్న విశ్లేషణలు మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బకొట్టాయి.
- విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగాయి.
- మార్కెట్లకు ఊతం ఇచ్చే అంశం ఒక్కటి కూడా లేకపోవడం నష్టాలకు మరో కారణంగా చెప్పవచ్చు.
- స్టాక్ మార్కెట్లో ఉండే బడా కంపెనీలు కూడా నష్టాల్లో ట్రేడవడం మదుపరులను ఆందోళనకు గురిచేసింది.
- బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా రంగ షేర్లు అధికంగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు నష్టాలను చవి చూశాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 57,781 పాయింట్ల అత్యధిక స్థాయి, 56,687 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 17,216 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 16,891 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
ముప్పై షేర్ల ఇండెక్స్‌లోని షేర్లన్నీ నష్టాల్లో ముగిశాయి.