Stock Market closing: అమెరికాలో ఆకాశాన్నంటిన ద్రవ్యోల్బణం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు భయాలతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. శుక్రవారం సెషన్లో సెన్సెక్స్ భారీగా నష్టపోయింది. ఓ దశలో వెయ్యి పాయింట్లకు పైగా పతనమైంది. చివరకు 773 పాయింట్లు కోల్పోయి.. 58,152 వద్ద స్థిరపడింది.
Sensex nifty closing
సెన్సెక్స్ 30 షేర్లలో చాలా వరకు నష్టాల్లోనే ముగిశాయి. లోహ మినహా అన్ని రంగాల షేర్లు నేలచూపులు చూశాయి. ఐటీ షేర్లు దారుణంగా పడిపోయాయి. టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్ 2 శాతం వరకు నష్టపోగా.. విప్రో, కోటక్ బ్యాంక్, టైటాన్ షేర్లు డీలా పడ్డాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, ఎన్టీపీసీ షేర్లు రాణించాయి.
అటు, నిఫ్టీ సైతం భారీగా పతనమైంది. 231 పాయింట్లు నష్టపోయింది. చివరకు 17,374 వద్ద ముగిసింది.
రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం
అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణం 7.5 శాతానికి చేరినట్లు తాజా గణాంకాల్లో వెల్లడైంది. ఇది 40 ఏళ్ల గరిష్ఠం. ఈ ఫలితంగా అమెరికా మార్కెట్లు గురువారం భారీ నష్టాలు నమోదు చేశాయి.
ద్రవ్యోల్బణం భారీగా పెరిగిన నేపథ్యంలో ఫెడ్ వడ్డీరేట్ల పెంపు మరింత వేగంగా ఉండే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడ్డాయి. దీంతో విదేశీ సంస్థాగత మదుపరుల సెంటిమెంటు దెబ్బతింది. ఈ పరిణామాలతో దేశీయంగా ఎఫ్‌ఐఐల అమ్మకాలు.. సూచీలపై పెను ప్రభావం చూపాయి.
ఇదీ చదవండి: టాటా సన్స్ పగ్గాలు మరోసారి ఆయనకే