విదేశీ పెట్టుబడుల ప్రవాహం, దిగ్గజ సంస్థల వాటాల కొనుగోళ్లతో స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్ దాదాపు 100 పాయింట్లు పెరిగి 38 వేల 710 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 20 పాయింట్లు వృద్ధి చెంది 11 వేల 610 వద్ద ట్రేడవుతోంది.
ఇదీ కారణం...
ఇరాన్ నుంచి భారత్ వంటి దేశాలు ముడి చమురు దిగుమతి చేసుకోవడంపై అమెరికా తిరిగి ఆంక్షలు విధిస్తుందన్న వార్తలు సోమవారం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ నష్టాలు నమోదు చేశాయి. అనుకున్నట్లే ఆంక్షలు తిరిగి విధించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
ఇరాన్ నుంచి దిగుమతి సాధ్యపడకపోయినా ముడి చమురు కొరత రాకుండా చూసేందుకు భారత్ ప్రత్యామ్నాయాలతో సిద్ధంగా ఉందన్న వార్తలు నేడు మదుపర్లలో ఉత్సాహం నింపాయి. ఫలితంగా మార్కెట్లు లాభాల బాట పట్టాయి.
లాభాల్లో..
ఓఎన్జీసీ, ఎస్ బ్యాంకు, హీరో మోటోకార్ప్, ఆర్ఐఎల్, సన్ ఫార్మా, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకు, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి.
నష్టాల్లో..
ఎల్ అండ్ టీ, టీసీఎస్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
బలపడిన రూపాయి...
మంగళవారం ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి విలువ 9 పైసలు పెరిగింది. డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి మారకం విలువ రూ.69.58 గా ఉంది.
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 0.36 శాతం పెరిగాయి. ప్రస్తుతం బారెల్ ముడిచమురు ధర 74.31 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: 'తీవ్రవాదులకు ఐఈడీ- మనకు ఓటర్ ఐడీ'