భారత్ సహా అంతర్జాతీయంగా కరోనా వ్యాప్తి పెరుగుతుండటం వల్ల మదుపరులు ఆందోళన చెందుతున్నారు. కరోనాకు తోడు మాంద్యం భయం వెంటాడటం వల్ల ఆరంభం నుంచే సూచీలు భారీ నష్టాల్లో సాగాయి. రిజర్వ్ బ్యాంక్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం వల్ల సూచీలు చివరి గంటల్లో మరింత దిగజారాయి.
నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 2,713 పాయింట్లు పతనమై 31,390 స్థిరపడింది. మునుపటి సెషన్ నాటి ముగింపుతో పోలిస్తే ఈ సూచీ 7.96 శాతం తగ్గింది. నిఫ్టీ కూడా 7.61 శాతం నష్టంతో 758 పాయింట్లు దిగజారి 9,197 వద్ద ముగిసింది.
అన్నీ నష్టాలే...
ఇండస్‌ఇండ్ బ్యాంక్ భారీ నష్టాలు మూటగట్టుకుంది. టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐటీసీ సహా దాదాపు అన్ని షేర్లు భారీగా నష్టపోయాయి.
ఇదే బాటలో...
స్టాక్ మార్కెట్లకు తోడు వివిధ దేశాల మార్కెట్లు నష్టాల బాటలోనే ముగిశాయి.
- షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ (3.4 శాతం)
- హాంకాంగ్ (4.3 శాతం)
- జపాన్‌కు చెందిన నిక్కీ (2 శాతం)
- తైవాన్‌కు చెందిన టీఎస్‌ఈసీ(4 శాతం)
- ఐరోపా మార్కెట్లు ఆరంభం ట్రేడింగ్‌లో 8 శాతానికి పైగా పతనమయ్యాయి
కారణాలివే...
- భవిష్యత్తులో ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం తీవ్రమైపోతుందనే సంకేతాలు మార్కెట్‌ను ఉక్కరిబిక్కిరి చేశాయి.
- అమెరికా కేంద్ర బ్యాంకు 'ఫెడరల్ రిజర్వ్' కీలక వడ్డీ రేట్లు తగ్గించడం మాంద్యంపై అనుమానాలను మరింత పెంచింది.
- మార్కెట్లు ముగిసిన తర్వాత ఆర్‌బీఐ అత్యవసర ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేసింది. ఏం కబురు వినాల్సి వస్తుందోననే ఒత్తిడితో మదుపరులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
- అమెరికా ఫెడ్ వడ్డీరేట్లను తగ్గించడం వల్ల భారత్ కూడా అదే బాట పట్టే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరిగింది.
- ప్రపంచ ప్రధాన మార్కెట్లు ఏవీ లాభాల్లో లేకపోవడం వల్ల దేశీయ సూచీలు భారీ నష్టాల నుంచి అతిభారీ నష్టాల్లోకి జారుకొన్నాయి.
- ప్రస్తుత భయాందోళనలకు చమురు యుద్ధం తోడైంది. దేశీయ చమురు రంగ దిగ్గజమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు దాదాపు 7 శాతానికి పైగా నష్టపోవడం సూచీలను కుంగదీసింది.
రూపాయి పతనం..
రూపాయి విలువ భారీగా పతనమైంది. ఇంట్రాడేలో డాలర్‌తో పోలిస్తే రూపాయి 55 పైసలు క్షీణించి రూ.74.31 వద్ద నిలిచింది.
ముడిచమురు ధర...
అంతర్జాతీయంగా ముడిచమురు ధర 7.53 శాతం తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 31.30 డాలర్లుగా ఉంది.
- ఇదీ చూడండి: ఎస్ బ్యాంకు ఖాతాదారుల డబ్బు భద్రం: ఆర్‌బీఐ