గత శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ దేశీయ మార్కెట్లను తీవ్రంగా నిరాశపర్చింది. బడ్జెట్‌లో ఆశించిన ప్రతిపాదనలేవీ లేకపోవడం వల్ల మదుపర్లు అసంతృప్తికి గురయ్యారు. ఫలితంగా సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. అయితే మార్కెట్ల పతనానికి కారణమేంటీ? అని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను అడిగితే ఆమె చెప్పిన సమాధానం విని అవాక్కయ్యారంతా..! వారాంతం వల్లే సూచీలు నష్టపోయాయని నిర్మలమ్మ చెప్పడం గమనార్హం.
ఫిక్కీ ఆధ్వర్యంలో సోమవారం దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమానికి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా "బడ్జెట్ రోజున సెన్సెక్స్ ఎందుకు సంతోషంగా లేదు?" అని ఓ వ్యక్తి కేంద్రమంత్రిని అడిగారు. ఇందుకు ఆమె స్పందిస్తూ.. "కానీ ఈ రోజు (సోమవారం) మార్కెట్లు సంతోషంగానే ఉన్నాయి కదా.. శనివారం మదుపర్లు వీకెండ్ మూడ్‌లో ఉన్నారు. ఈ రోజు సోమవారం. నిజమైన పని మూడ్‌లోకి వచ్చేశారు. అందుకే ఈ రోజు మార్కెట్లు లాభాల్లోకి వచ్చాయి కదా. ఎక్కువ లాభాలు కాకపోవచ్చు. కొంతమేరైతే సంతోషంగానే ఉన్నాయి కదా" అని సమాధానమిచ్చారు.
బడ్జెట్ రోజున మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనైన విషయం తెలిసిందే. గత శనివారం ఒక్క రోజే సెన్సెక్స్ ఏకంగా 988 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ కూడా 300 పాయింట్లు పతనమైంది. అయితే ఈ భారీ నష్టాల నుంచి మార్కెట్లు సోమవారం కాస్త కోలుకున్నాయి. నిన్నటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 137 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 46 పాయింట్లు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలతో మంగళవారం కూడా సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.