రిజర్వు బ్యాంకు కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడం, వృద్ధి రేటు అంచనాలను తగ్గించడం మదుపర్లను నిరాశపర్చగా.... స్టాక్మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-సెన్సెక్స్ 71 పాయింట్లు కోల్పోయి 40,780 వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో 12,018 వద్ద ముగిసింది.
ఇంట్రాడే సాగిందిలా...
వరుసగా 6వ ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గిస్తుందని బ్యాంకర్లు, ఆర్థికవేత్తలు అంచనా వేశారు. ఇదే ఆశతో ఉదయం మదుపర్లు కొనుగోళ్లు జరపగా... సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 41 వేల 2 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది.
అయితే... ద్రవ్యోల్బణం లక్ష్యాల్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి వడ్డీరేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది ఆర్బీఐ. ఈ ప్రకటన మదుపర్లను నిరాశకు గురిచేయగా... మార్కెట్లు ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఓ దశలో సెన్సెక్స్ 40 వేల 720 పాయింట్ల కనిష్ఠస్థాయికి పతనమైంది. చివరకు 40 వేల 780 వద్ద స్థిరపడింది.
లాభనష్టాల్లోనివి..
టీసీఎస్, ఐటీసీ, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర లాభాల్లో ముగిశాయి.
భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, హీరోమోటోకార్ఫ్, టాటా మోటర్స్ నష్టాలను మూటగట్టుకున్నాయి.
రూపాయి...
అంతర్జాతీయ మార్కెట్లో.. రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే 7 పైసలు బలపడి రూ.71.38కి చేరింది.
ఇదీ చూడండి: బంగారం జోరుకు బ్రేకులు.. నేటి ధరలు ఇవే...