కరోనా మహమ్మారి వల్ల మందగమనం వైపు పయనిస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక సంక్షోభం నాటి పరిస్థితుల కంటే ఘోరమైన స్థితిని ఎదుర్కోనుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) హెచ్చరించింది. 2020 ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలంగా మారుతుందని తెలిపింది. తగిన చర్యల ద్వారా 2021 లోనే కోలుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ ఆర్థిక నష్టాన్ని పరిమితం చేసేందకు అన్ని దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తిని ఎంత వేగంగా అడ్డుకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంత బలంగా పుంజుకుంటుందని పేర్కొంది.
83 బిలియన్ డాలర్లు..
ప్రస్తుత పరిస్థితుల్లో ద్రవ్య విధానాన్ని సులభతరం చేస్తున్న వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల చర్యలను స్వాగతించింది ఐఎంఎఫ్. కేంద్ర బ్యాంకులు తీసుకుంటున్న సాహసోపేతమైన చర్యలు ఆ దేశ ప్రయోజనాలు మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తాయని వివరించింది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు, తక్కువ ఆదాయ దేశాలు గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయంది ఐఎంఎప్. మందగమనం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 83 బిలియన్ డాలర్లు మార్కెట్ల నుంచి తరలి వెళ్లినట్లు తెలిపింది. రుణ బాధలో ఉన్న తక్కువ-ఆదాయ దేశాల గురించి ఆందోళన చెందుతున్నామంది. ఈ సమస్యను ప్రపంచ దేశాలతో కలిసి పరిష్కరిస్తామని తెలిపింది.