ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు మ్యూచువల్ ఫండ్లు ఉత్తమ ఎంపిక. దీర్ఘకాలంలో ఇవి మంచి రాబడులను ఇస్తాయి. సంప్రదాయ పెట్టుబడులన్నింటి కంటే మంచి ఫలితాలను మ్యూచువల్ ఫండ్లు అందిస్తాయి. అందుకే వీటిలో చాలా మంది పెట్టుబడులు పెడుతుంటారు. అయితే.. పెట్టుబడి పెట్టడం వరకు మాత్రమే కాదు.. సరైన సమయంలో వాటిని ఉపసంహరించుకోవడం, వాటి ఫలితాలను ఆస్వాదించడం కూడా తెలిసి ఉండాలి. మరి మ్యూచువల్ ఫండ్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు సరైన సందర్భాలు ఏమిటి? అనే విషయంపై నిపుణుల సలహాలు, సూచనలు ఇలా ఉన్నాయి.
ఆశించిన ఫలితాలు ఇవ్వకపోతే..
మ్యూచువల్ ఫండ్ మంచి ప్రదర్శన కనబర్చకపోయినట్లయితే దానికి సంబంధించిన కారణాలను తెలుసుకోవాలి. అదే విభాగంలోని ఇతర ఫండ్ల ప్రదర్శనతో పోల్చి చూసుకోవాలి. వాటి సరాసరి ప్రదర్శన కంటే మీ ఫండ్ విలువ తక్కువ ఉన్నట్లయితే.. పెట్టుబడి ఉపసంహరించుకోవటం గురించి ఆలోచించాలని నిపుణులు చెబుతున్నారు.
కనీసం రెండు సంవత్సరాల పాటు పని తీరును గమనించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకోవాలన్నది నిపుణుల మాట. నష్టాలను ఎక్కువ రోజులు భరించే కంటే పెట్టుబడి ఉపసంహరించుకోవటమే మేలని సలహా ఇస్తున్నారు.
పెట్టుబడి వ్యూహాల్లో మార్పు
కొన్నిసార్లు ఒక ఫండ్ పథకంలో విలీనం అవుతుంది. లేదా ఫండ్ సంస్థలూ మరో సంస్థ చేతిలోకి వెళ్లిపోతుంటాయి. సెబీ నిబంధనల ప్రకారం ఒక ఫండ్ సంస్థ నుంచి ఒక విభాగంలో.. ఒకే ఫండ్ ఉండాలి. కాబట్టి, అవి ఆ పథకాల వ్యూహాన్ని మార్చే అవకాశం ఉంది. ఉదాహరణకు వాల్యూ ఓరియెంటెడ్ ఫండ్.. గ్రోత్ ఓరియంటెడ్‌గా మారొచ్చు. ఇలాంటప్పుడూ.. అప్పటికే ఉన్న పోర్ట్‌ఫోలియో ఆధారంగా ఆయా ఫండ్లలో కొనసాగే విషయాన్ని ఆలోచించుకోవాలి. మీరు అనుకుంటున్న లక్ష్యానికి ఆ ఫండ్ సరిపోదు అనుకున్నప్పుడు కూడా పెట్టుబడిని ఉపసంహరించుకోవచ్చు.
ఫండ్ మేనేజర్ మారినప్పుడు
ఫండ్‌ను ఎంచుకునే క్రమంలో ఫండ్ మేనేజర్‌పై నమ్మకం అనేది కీలకమైనది. ఫండ్ నిర్వహణలో వారిదే ముఖ్య పాత్ర. ఒకవేళ ఫండ్ మేనేజర్ మారినట్లయితే రాబడిపై ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. ఫండ్ మేనేజర్ మారి, రాబడి తగ్గినట్లయితే పెట్టుబడిని ఉపసంహరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
లక్ష్యానికి చేరుకున్నప్పుడు
అనుకున్న లక్ష్యం సాధించినప్పుడు పెట్టుబడిని ఉపసంహరించుకోవచ్చు. రిటైర్మెంట్ కోసం ఈక్విటీలో పెట్టుబడులు పెట్టినట్లయితే.. రిటైర్మెంట్ సమీపిస్తున్న క్రమంలో కొంత మొత్తాన్ని దశల వారీగా ఉపసంహరించుకోవచ్చు. వీటిని రిస్కు చాలా తక్కువగా ఉన్న ఫండ్లలోకి మరల్చాలి. దీనికోసం సిస్టమెటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్‌ను ఉపయోగించుకోవచ్చు.
అత్యవసర పరిస్థితి
ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఎప్పుడైనా రావొచ్చు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో కూడా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడిని ఉపసంహరించుకోవటాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మ్యూచువల్ ఫండ్లలో ద్రవ్య లభ్యత ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఉపయోగించి అత్యవసర పరిస్థితి దాటొచ్చు. స్వల్ప కాలంలో ఎక్కువ లాభాలు వచ్చినప్పుడు కూడా పెట్టుబడిని ఉపసంహరించుకుని... మరో ఫండ్‌లో పెట్టుబడి పెట్టొచ్చు.
ఖర్చుల నిష్పత్తి పెరిగితే
బెంచ్‌మార్క్ రాబడితో సమానంగా కొనసాగేందుకు ఫండ్ సంస్థలు కొన్నిసార్లు ఖర్చుల నిష్పత్తిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తాయి. ఇలా కాకుండా ఖర్చుల నిష్పత్తిని పెంచితే మాత్రం.. ఆ ఫండ్ గురించి సమయానుకూల నిర్ణయం తీసుకోవాలంటున్నారు నిపుణులు.
ఇదీ చదవండి:మరణించిన వ్యక్తి ఖాతా నుంచి నగదు క్లెయిమ్ ఎలా?