నగదు రహిత లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్న ఈ రోజుల్లో క్రెడిట్ కార్డులు అవసరం ఉందనే చెప్పాలి. అయితే ఒక వ్యక్తికి ఎన్ని క్రెడిట్ కార్డులు కావాలి అన్నదే ప్రశ్న? ఒకటి కంటే ఎక్కువ ఉంటే వారి ఆదాయానికి మించి ఖర్చు చేయడానికి ఆస్కారం ఉంటుందని, దీంతో వారు రుణాలు ఎక్కువ కావడం వల్ల ఇబ్బందులు పడతారని కొంతమంది సలహాదారులు ఒక వ్యక్తికి ఒక క్రెడిట్ కార్డు సరిపోతుందని చెబుతారు. నిజానికి, మీరు మీ ఖర్చులను నియంత్రించుకోగల సామర్ధ్యం గల వారైతే ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను ఉండడం మంచిదే.
ఎక్కువ కాలం వడ్డీ లేని రుణాలు కోసం
క్రెడిట్ కార్డుతో చేసే కొనుగోళ్ళు బ్యాంకు వద్ద అప్పు తీసుకుని కోనుగోలు చేసినట్లే భావించాలి. కార్డు ద్వారా వినియోగించిన మొత్తాన్ని చెల్లించడానికి బ్యాంకులు కొంత సమయం ఇస్తాయి. ఆ సమయంలోపల చెల్లింపులు చేసేనట్లయితే ఎలాంటి వడ్డీ ఉండదు. రెండు క్రెడిట్ కార్డులు కలిగి ఉండడడం ద్వారా మీ వడ్డీ లేని చెల్లింపుల కాలవ్యవధిని పెంచుకోవచ్చు. ఉదాహరణకి మీ బిల్లింగ్ సైకిల్ (ఖర్చుచేసి, తిరిగి చెల్లించే కాల వ్యవధి) చివరి తేది 30, సెప్టెంబరు అనుకుంటే, మీ వడ్డీ లేని చెల్లింపులకు 21, అక్టోబరు వరకు గడువు ఉంటుంది. మీరు సెప్టెంబరు 1 వ తేదీన క్రెడిట్ కార్డు వినియోగించి వస్తువులను కొనుగోలు చేశారనుకుందాం. మీ వడ్డీ వడ్డీ లేని చెల్లింపుల గుడువు తేది అక్టోబరు 21వరకూ ఉంటుంది. అంటే మీ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించడానికి దాదాపు 50 రోజుల సమయం లభిస్తుంది. ఒక వేళ మీరు 30, సెప్టెంబరున కొనుగోళ్లు చేసినట్లయితే గుడువు తేది 21, అక్టోబర్ అయినందువల్ల మీకు 21 రోజుల సమయం మాత్రమే లభిస్తుంది. నెలలో ఒక్కోరోజు గడుస్తున్నప్పుడు మీ వడ్డీ లేని రుణ కాలవ్యవధి కూడా తగ్గిపోతుంది. ఒక వేళ బిల్లింగ్ సైకిల్ చివరి తేది 15 గా వున్న మరొక కార్డు మీ వద్ద ఉన్నట్లయితే అప్పడు సెప్టెంబరు 30 తేది కొనుగోళ్ళను ఆ కార్డ్ ఉపయోగించి చేస్తే మీ వడ్డీ లేని కాలవ్యవధిని పెంచుకోవచ్చు.
క్రెడిట్ కార్డు బిల్లును నీర్ణీత తేది లోపుల చెల్లించడం ద్వారా వారు విధించే అధిక వడ్డీ రేటు నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే కొన్నిసందర్భాల్లో వ్యక్తులు తమ మొత్తం బిల్లులో కనీసం 5 శాతం బిల్లును చెల్లిస్తారు. అలాంటి పరిస్థితులలో బ్యాంకు వారు 2 నుంచి 3 శాతం వడ్డీ విధిస్తారు. ఇది మీరు చెల్లించని బిల్లులకు మాత్రమే కాకుండా తరువాత చేయబోయే కొనుగోళ్ళకు కూడా వర్తిస్తుంది. మీరు మరొక క్రెడిట్ కార్డు కలిగివుంటే మీ పాత బిల్లును చెల్లించేంత వరకు, మీ వద్ద ఉన్న రెండవ కార్డుపై తరువాతి నెల కొనుగోళ్ళు చేయడం ద్వారా అధిక వడ్డీ రేట్ల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.
తక్కువ వడ్డీతో నగదు బదిలీ
మీరు ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డలను కలిగి వున్నట్లయితే చెల్లించని క్రెడిట్ కార్డు బిల్లులపై అధిక వడ్డీ రేట్లను తగ్గించుకోవచ్చు. చాలా సంస్థలు వారి వ్యాపారాన్ని పెంచుకోవడానికి గాను మీరు చెల్లించని మొత్తన్ని వారి కార్డులకు బదిలీ చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు మొదటి రెండు నెలలకు ఎటువంటి చార్జీలు విధించకుండా ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. తరువాత కూడా నెలకు 1.5 నుంచి 2 శాతం వడ్డీ మాత్రమే చెల్లించే వీలువుంది. ఇది మొదటి కార్డుపై 2 నుంచి 3 శాతంగా వుంటుంది. చెల్లించని మొత్తాలను ఒక కార్డు నుంచి మరొక కార్డుకు బదలీ చేయడం అనేది ఒక అలవాటుగా మార్చుకోవద్దు, ప్రతి సారి ఇలా చేయడం వలన మీరు రుణ ఉచ్చులో పడే అవకాశం ఉంది.
ఇచ్చట అన్ని క్రెడిట్ కార్డులు
క్రెడిట్ కార్డు సంస్థలు, కొన్ని బ్రాండెడ్ కంపెనీలు, సర్వీస్ ప్రొవైడర్స్‌తో అనుసంధానం కలిగి ఉండడం వల్ల పరిమిత కాలానికి ఎక్కువ లాభదాయకంగా వుంటాయి. అన్ని కార్డులు ఒకేలా ఉండవు. కొన్ని కిరాణా దుకాణాలలో కొనుగోళ్ళకు, మరికొన్ని ఆన్‌లైన్‌లో షాపింగ్‌కు లాభదాయకంగా వుండచ్చు. కొన్ని కార్డులను ఉపయోగించి పెట్రోలు కొనుగోలు చేసినప్పుడు, యుటిలిటీ బిల్లుల చెల్లింపు కోసం రివార్డు పాయింట్లను ఇస్తుంటాయి. మేక్ మై ట్రీప్ డాట్ కామ్‌లో హోటల్స్ బుకింగ్ చేసుకోవడంలో ఐసీఐసీఐ బ్యాంక్, సిటీ బ్యాంకులు చాలా లాభదాయకమైన డీల్స్ అందిస్తున్నాయి. ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను ఉపయోగించడం ద్వారా ఇలాంటి డీల్స్ వల్ల ప్రయోజనం పొందవచ్చు. మీ ఖర్చు చేసే విధాలను అనుసరించి మీ క్రెడిట్ కార్డులను ఎంచుకొని అధిక ప్రయోజనాలను పొందండి.
ప్రత్యమ్నాయ చెల్లింపులు
టెక్నాలజీ ఉపయోగించి డిజిటల్ లావాదేవీలు చెల్లించడం సులభం కానీ ఒక్కోసారి ఊహించని సాంకేతిక కారణాల వలన ఒక క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరగకపోవచ్చు. కార్డు సర్వీస్ లోపం వల్ల కాని, పీఓఎస్ మీషన్ కార్డపై ఉన్న చిప్ రీడ్‌కాకపోవడం వల్ల కాని ఇలాంటి ఇబ్బంది రావచ్చు. అలాంటి పరిస్థితులలో రెండో కార్డును ఉపయోగించవచ్చు.
స్కోరును పెంచుకోవడం
క్రెడిట్ స్కోరును లెక్కేసే అల్గారిథమ్ లు ఏ పద్ధతిలో వ్యక్తుల స్కోరును గణిస్తాయనేది తెలియదు కానీ క్రెడిట్ యుటిలైజేషన్( రుణ వినియోగం) స్కోరు పై ప్రభావం చూపుతుంది. క్రెడిట్ యుటిలైజేషన్ అంటే వినియోగించిన మొత్తం\మొత్తం అందుబాటులో ఉన్న మొత్తం ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు లిమిట్ రూ.1 లక్ష ఉందనుకుందాం. మీరు వినియోగించింది మాత్రం రూ.30 వేలు అప్పుడు క్రెడిట్ యుటిలైజేషన్ 0.3. దీంతో పాటు రూ.50 వేలు కలిగిన మరో క్రెడిట్ కార్డు ఉందనుకుందాం.అప్పుడు మీ క్రెడిట్ యుటిలైజేన్ 0.2 అవుతుంది.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న విధంగా 2-3 క్రెడిట్ కార్డులు ఉండటం తప్పనిసరి కాదు. సరైన నిర్వహణ ఉంటే ప్రయోజనాలు ఉన్నాయనే చెబుతున్నాం. ఉంటే ఉపయోగం.. లేకపోయినా పోయేదేం లేదని గమనించగలరు.
ఇదీ చదవండి:కార్డు లేకుండా క్యాష్ విత్‌డ్రా ఎలా?