అంతంత మాత్రం టాక్‌తో నడుస్తున్న సినిమాకు.. బంద్ ఎదురైతే ఏమవుతుంది? చివరి బంతికి సిక్స్ కొట్టాల్సిన సమయంలో.. డకౌట్ అయితే ఏమవుతుంది? అప్పటికే ఉన్న డబ్బులన్నీ పోగా.. చివరి కోడి పందెంలోనూ ఓడిపోతే ఏమవుతుంది? పై విషయాలు జరిగితే ఏమవుతుందో మీకు చెప్పక్కర్లేదు కానీ.. అసలే వృద్ధి తక్కువగా.. పరిశ్రమ దిగాలుగా.. నిరుద్యోగం ఎక్కువగా ఉన్న భారత్‌కు ఇరాన్ రూపంలో మరో సమస్య ఎదురవుతోందా? సామాన్యులకూ ఇబ్బందేనా?
ఇరాన్ కీలక నేత ఖాసీం సులేమానీపై అమెరికా సైన్యం డ్రోన్‌దాడి చేసి హతమార్చింది... ఇది జరిగిన విషయం. ఇరాక్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులను చేసింది. అమెరికా దీనిపై ఆగ్రహంగా ఉంది. ఇది జరుగుతున్న విషయం.
అమెరికా-ఇరాన్‌ల మధ్య అనిశ్చితులు ఈ చర్యతో మరింత పెరగడం.. భారత్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.. ఇది జరగబోయే విషయం.
అవును మరి.. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్‌కు ఉన్నట్లుండి పశ్చిమాసియాలో సరఫరా తగ్గి.. చమురు ధరలు పెరిగితే.. సమస్యే కదా మరి. ఒపెక్‌లో సౌదీ అరేబియా తర్వాత అత్యంత పెద్ద సరఫరాదారు ఇరాక్. ఇపుడు అక్కడ ఏర్పడ్డ సంక్షోభం నేపథ్యంలో ఉత్పత్తి తగ్గే అవకాశం లేకపోలేదు. ఇప్పటిదాకా సరఫరా విషయంలో ఎటువంటి ప్రభావం కనిపించకపోయినా.. త్వరలోనే ఆ ప్రభావం పడవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అదే జరిగితే అంతర్జాతీయ చమురు ధరలు పెరగడం తథ్యం.
కథ.. ఇప్పటిది కాదు..
ఏడాది కాలంగా అమెరికా-ఇరాన్‌ల మధ్య అనిశ్చితి కొనసాగుతోనే ఉంది. భారత్‌లో పాటు ఎనిమిది దేశాలకు మినహాయింపులను పొడిగించినప్పటికీ.. ఇరాన్‌కు మాత్రం ఆ వెసలుబాటు ఇవ్వకపోవడం కారణంగా తొలిసారిగా అలజడి మొదలైంది. ఇరాన్ చమురు పరిశ్రమ, బ్యాంకులపై 2018లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి ఆంక్షలు విధించడం కూడా జరిగాయి. తాజాగా అగ్రనేతను హతమార్చడం.. అందుకు ప్రతిగా అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణుల దాడి చేయడం వల్ల.. ఆ ఉద్రిక్తతలు ఇప్పుడు పెరిగాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో భారత్‌కు వచ్చిన నష్టం ఏమిటి అన్న అనుమానం రావొచ్చు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు వినియోగదారు భారతే. 80% చమురు అవసరాలు; 40% సహజ వాయువు అవసరాలను దిగుమతుల ద్వారానే పొందుతున్నాం. 2018-19లో ఏకంగా 111.9 బిలియన్ డాలర్లను ఖర్చు చేశాం మనం. అంతక్రితం ఏడాది 87.8 బి. డాలర్లే వెచ్చించాం. ఇరాక్, సౌదీ అరేబియా తర్వాత ఎక్కువగా మనం దిగుమతి చేసుకునేది ఇరాన్ నుంచే. ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో మనం ఆ దేశం నుంచి దిగుమతి చేసుకోవట్లేదు. దీంతో అమెరికా, వెనెజువెలా వైపు చూడాల్సి పరిస్థితి నెలకొంది. కానీ పశ్చిమాసియా నుంచి అయితే చమురు తక్కువ ధరకు (బీమా, రవాణా ఛార్జీలపై మినహాయింపుల వల్ల) వస్తుందన్నది సత్యం. మొత్తం మీద మనం ఎక్కువ డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది. ఇక ఈ ఉద్రిక్తతల వల్ల సరఫరా తగ్గి చమురు ధరలు పెరిగితే.. అపుడు మరింత వ్యయం అవుతుంది.
ఆర్థిక వ్యవస్థపై..
పైన చెప్పుకున్నట్లు చమురుపై మనం పెట్టే వ్యయాలు పెరిగితే కనుక.. అది ఆర్థిక వ్యవస్థకు చేదు వార్తే. ఇప్పటికే ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి చేరిన జీడీపీ వృద్ధి రేటు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 11 ఏళ్ల కనిష్ఠ స్థాయికి చేరొచ్చని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ఈ సమయంలో ముడి చమురు ధరలు 10 డాలర్లు పెరిగినా.. భారత నెలవారీ దిగుమతి బిల్లు 0.4 శాతం మేర పెరుగుతుంది. అసలే వినియోగం, గిరాకీ తగ్గడం కారణంగా.. వ్యయాలు మరింత తగ్గితే.. అది కాస్తా మందగమనం మరికొంత కాలం కొనసాగేలా చేస్తుంది!!
సామాన్యులపైనా..
తాజా ఉద్రిక్తతల వల్ల వినియోగదార్లపైనా ప్రభావం పడేట్లు ఉంది. సాధారణంగా ముడి చమురు ధరలు పెరిగిన కొన్నాళ్ల తర్వాత ఇక్కడ రిటైల్ రేట్ల పెరుగుతాయి. ప్రభుత్వ రంగ రిటైలర్లు 15 రోజుల సగటు అంతర్జాతీయ రేట్లపై ఆధారపడి రోజువారీ ధరలను నిర్ణయిస్తుంటాయి. ఆ లెక్కన రాబోయే కొద్ది రోజుల పాటు పెట్రో ధరలు పెరిగే అవకాశం ఉంది.
స్టాక్ మార్కెట్, బంగారం, రూపాయిపైనా ప్రభావం పడుతోంది. సోమవారం ఒక రోజే మదుపర్ల సంపద రూ.3 లక్షల కోట్ల మేర తుడిచిపెట్టుకుపోయింది. బంగారం ధరలు జీవన కాల గరిష్ఠాలకు చేరాయి. రూపాయి మారక విలువ అమెరికా డాలరుతో పోలిస్తే 72 స్థాయికి చేరువైంది.