ఏ ఆరోగ్య బీమా తీసుకోవాలో తెలియటం లేదా? మార్కెట్లో వివిధ కంపెనీల పాలసీలను పోల్చలేకపోతున్నారా? వీటన్నింటినీ దూరం చేసేందుకు బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) చర్యలు చేపట్టింది.
ప్రామాణిక ఆరోగ్య బీమాపై మార్గదర్శకాల ముసాయిదాను ఐఆర్డీఏఐ విడుదల చేసింది. దీని ప్రకారం అన్ని కంపెనీలు కొన్ని సాధారణ సేవలతో కూడిన బీమాను అందించాల్సి ఉంటుంది. మార్చి 6 వరకు ఈ ముసాయిదాపై వాటాదారుల నుంచి అభిప్రాయాలను స్వీకరించనుంది ఐఆర్డీఏఐ.
వివిధ కంపెనీలు ఆరోగ్య బీమాలో భాగంగా కొన్ని ఇతర సదుపాయాలను అందిస్తున్నాయి. వీటిని అవసరం లేకపోయినప్పటికీ వినియోగదారులు తప్పకుండా తీసుకోవాల్సి వస్తోంది. దీన్ని నివారించేందుకే ఈ కొత్త మార్గదర్శకాలని ఐఆర్డీఏఐ తెలిపింది.
కొత్త విధానంలో ఇవి ఉపయోగాలు..
ఇంతకుముందు 24 గంటలు ఆస్పత్రిలో చేరిన వారికే బీమా వర్తించేది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఆస్పత్రిలో చేరే అవసరం లేని చికిత్సలకు కూడా బీమా వర్తించనుంది.
కొత్త విధానం ప్రకారం కనీస ప్రామాణిక ఆరోగ్య బీమా రూ.50,000. గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు తీసుకోవచ్చు. జీవితాంతం పునరుద్ధరించుకునే అవకాశం ఉన్న ఈ పాలసీలో చేరేందుకు కనీస అర్హత వయస్సు 18 ఏళ్లు. గరిష్ఠ అర్హత వయస్సు 65 ఏళ్లు.
పాలసీదారుపై ఆధారపడ్డ పిల్లలకు 25 ఏళ్ల వయస్సు వచ్చేంత వరకు ప్రయోజనాలు అందనున్నాయి. పాలసీదారుకు నష్టం జరిగినప్పుడు బీమా కంపెనీలు డబ్బును ఒకేసారి లేదా వాయిదా పద్ధతిలో చెల్లించవచ్చు.
వర్తించేవి...?
ఆయుర్వేదం, యునాని, సిద్దా, హోమియోపతి పద్ధతిలో వైద్యం చేయించుకునే వారికి బీమా వర్తించనుంది. ఆస్పత్రిలో చేరక ముందు అయిన ఖర్చులతో పాటు కొన్ని షరతులకు లోబడి ఆస్పత్రిలో చేరిన తర్వాత అయిన ఖర్చులు కూడా బీమా పరిధిలోకి రానున్నాయి.
ఆస్పత్రి గది, బోర్డింగ్, నర్సింగ్ ఛార్జీలతో పాటు సూపర్ స్పెషాలిటీ, సర్జన్ తదితర అన్ని రకాల డాక్టర్లకు చెల్లించే ఫీజులు ఈ బీమా పరిధిలోకి వస్తాయి.
మత్తు(అనెస్తీషియా), రక్తం, ఆపరేషన్ థియేటర్, సర్జికల్ పరికరాలు, మందులు, చికిత్స ఖర్చు లాంటి తదితర ఖర్చులకూ బీమా వర్తించనుంది.