‘అరెరె... ఫొటో తీసేటప్పుడు కాస్త కన్నార్పకుండా ఉంటే బావుండేది! పెదాల్ని మరీ బిగదీసినట్టున్నాను... ముఖం మరీ సీరియస్‌గా కనిపిస్తోంది’ - ఎంత చక్కటి ఫొటోజెనిక్ ఫేస్ ఉన్నవాళ్లైనా సరే జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఇలా బాధపడకుండా ఉండరు. డిజిటల్ కెమెరాలు వచ్చాక ఈ బాధ కాస్త తప్పింది. ఫొటో దిగాక ముఖంలో ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే ఇంకోసారి ప్రయత్నించొచ్చు. అయినా సరే... పెళ్ళిళ్లూ, వేడుకల వేళ గ్రూప్ ఫొటో దిగేటప్పుడు ఈ సమస్య ఉంటూనే ఉంది. సెల్ఫీతో కొంతవరకు ఈ సమస్య తగ్గినా... వాటిని మొబైల్‌తోనే తీస్తాం కాబట్టి ఫొటో నాణ్యతకి గ్యారంటీ ఉండదు. పైగా మంది పెరిగేకొద్దీ ముఖాలన్నీ గోరంతలుగా కనిపిస్తుంటాయి! ఇలాంటి సమస్యకి పరిష్కారం చూపుతోంది ‘మ్యాజిక్ మిర్రర్ ఫొటో బూత్’. ఇదో పెద్ద నిలువుటద్దంలా ఉంటుంది. దాని ఎదుట నిల్చుంటే మనం అందులో కనిపిస్తాం. మనం చేయాల్సిందల్లా... ఫొటోలో ఎలా కనిపించాలనుకుంటామో అలా పోజిచ్చి నిల్చోవడమే! అలా నిల్చున్న మిమ్మల్ని ఆ అద్దం ‘క్లిక్’మనిపిస్తుంది. ఆ తర్వాతి నిమిషానికే మీ చేతిలోకి ఫొటో వస్తుంది. అదే ఈ మ్యాజిక్ మిర్రర్ ఫొటో బూత్ ప్రత్యేకత. ఒక్కసారే పదిహేనుమంది నిల్చుని ‘గ్రూప్‌ఫీ’ తీసుకున్నా...ఇందులో చాలా స్పష్టంగా వస్తుంది.
ఏముంటుంది ఇందులో..
పైకి చూడటానికి అద్దంలా ఉన్నా... ఇదో పెద్ద సైజు మొబైల్ ఫోను తెరలాంటిదే. ఇందులోనూ టచ్ స్క్రీన్ ఉంటుంది. ఆ టచ్ స్క్రీన్‌లో స్టార్ట్ బటన్ నొక్కి, మీరు పోజిచ్చి నిల్చోవడానికి ఎన్ని సెకన్లు కావాలో ఆ మేరకు కౌంట్‌డౌన్‌ని ఎంపిక చేసుకుని... కాస్త దూరంగా వెళ్లి చూస్తూ నిల్చుంటే చాలు... అది క్లిక్‌మనిపిస్తుంది. మనుషులు ఎక్కువైతే ఆ మేరకు కెమెరాని టచ్ స్క్రీన్‌లోనే సరిచేసుకోవచ్చు. అంతేకాదు... ఫొటో దిగాక అందులో మీ ఇష్టప్రకారం ఎమోజీలూ, ఇతరత్రా డ్రాయింగ్‌లూ, నచ్చిన ఫ్రేములనీ అలంకరించుకోవచ్చు. ఈ ఫొటోలని అప్పటికప్పుడు మీరు మీ ఇన్‌స్టా, ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో పంచుకోవచ్చు. అంతా మొబైల్‌లాగే పని చేస్తున్నా... ఫొటోలకి సంబంధించినంత వరకూ ఇందులో వాడే సాఫ్ట్‌వేర్‌లూ, కెమెరాలూ, ఐవీ టచ్ స్క్రీన్‌లన్నీ చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటాయి. అందుకే వీటి ధర అరవై వేల నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకూ ఉంటుంది.
అందుకే అద్దెకిస్తున్నారు..
ఈ మ్యాజిక్ మిర్రర్ ఫొటో బూత్ ధర ఎక్కువ కాబట్టి... మన నగరాల్లో వీటిని అద్దెకిచ్చే ట్రెండ్ మొదలైంది. హైదరాబాద్‌కి చెందిన సెల్ఫీబాక్స్ అనే స్టార్టప్ గత ఏడాది దీన్ని తొలిసారి తెలుగు రాష్ట్రాలకి పరిచయం చేసింది. ఆ తర్వాత ఏడెనిమిది సంస్థలు ఇందుకోసమే ఏర్పడ్డాయి. మొదట్లో సంపన్నుల పెళ్ళిళ్లూ, కార్పొరేట్ సమావేశాలూ, బ్రాండ్ పరిచయాలూ, వీఐపీల ఇంటి వేడుకల్లో ఈ మిర్రర్ ఫొటో బూత్‌లతో స్టాళ్లు ఏర్పాటు చేస్తుండేవారు. క్రమంగా కొందరు మధ్యతరగతివాళ్లూ వీటిని అద్దెకు తెచ్చు కోవడం ప్రారంభించారు. కొన్ని సంస్థలు ఫొటో తీసుకునేటప్పుడు సరదాకి వేసుకునే మాస్క్‌లూ, పెట్టుడు మీసాల్లాంటి ప్రాప్స్‌ని కూడా సరఫరా చేస్తూ వాటికి అదనంగా డబ్బు తీసుకుంటున్నాయి. సాధారణంగా ప్రతి ఈవెంట్‌కీ రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకూ వసూలు చేస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌లో మాత్రమే కాకుండా కరీంనగర్, గుంటూరు, విజయవాడ, విశాఖలోనూ ఈ ఫొటోబూత్‌లు అద్దెకు దొరుకుతున్నాయి.