ఆర్థిక ఇబ్బందులకు పరిష్కారం చూపించే విధంగా కేంద్ర బడ్జెట్ 2021-22 ఉంటుందని అన్ని వర్గాల ప్రజలు ఆశిస్తున్నారు. కోవిడ్ సంబంధిత ఆరోగ్య, ఆర్థిక సమస్యల కారణంగా 2021 సీనియర్ సిటిజన్లకు కష్టకాలం అనే చెప్పుకోవాలి. క్రమమైన ఆదాయం లేని సీనియర్ సిటిజన్లు ఖర్చుల కోసం వారు పొదుపు చేసుకున్న మొత్తాన్ని ఉపయోగించాల్సి వచ్చింది. ఆరోగ్య బీమా పథకం పరిధిలోకి రాని వారు కోవిడ్-19 చికిత్స కోసం అధిక ఆసుపత్రి బిల్లులను చెల్లించవలసి వచ్చింది దీంతో పదవీ విరమణ ప్రణాళికకు తీవ్ర స్థాయిలో ఎదురుదెబ్బ తగిలింది. అందువల్ల ఇతరుల కంటే సీనియర్ సిటిజన్లకు ఆర్థిక సహాయం అవసరమని నిపుణులు చెబుతున్నారు.
బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్ల కోసం ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి..
ప్రాథమిక మినహాయింపును రూ.5 లక్షలకు పెంచాలి..
సీనియర్ సిటిజన్లకు ప్రస్తుతం ఉన్న ప్రాథమిక మినహాయింపు పరిమితి రూ .3 లక్షలు. చివరిసారిగా 2014 లో ఈ పరిమితిని సవరించడం జరిగింది. గత ఆరు సంవత్సరాల్లో, ద్రవ్యోల్బణం ప్రభావంతో డబ్బు విలువను గణనీయంగా తగ్గింది. అందువల్ల, సీనియర్ సిటిజన్లు, తమ ఆర్థిక అవసరాల తీర్చుకునేందుకు ఇంతకు ముందు కంటే ఎక్కువ మొత్తం అవసరం. కాబట్టి సీనియర్ సిటిజిన్లకు పన్ను భారం తగ్గించేందుకు ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ .5 లక్షలకు పెంచడాన్ని ప్రభుత్వం పరిగణించవచ్చు.
వైద్య ఖర్చుల కోసం.. అధిక పన్ను మినహాయింపులు..
కోవిడ్ -19 కారణంగా, సీనియర్ సిటిజన్ల వైద్య బిల్లులు భారీగా పెరిగాయి. ఇతర అనారోగ్య సమస్యల కారణంగా మిగిలిన వయసుల వారితో పోలిస్తే, 60 ఏళ్లు, ఆపై వారికి ప్రమాదం ఎక్కువగానే ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 డి కింద, సీనియర్ సిటిజన్ల వైద్య ఖర్చులు లేదా ఆరోగ్య బీమా ప్రీమియంపై రూ .50 వేల వరకు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు.
సీనియర్ సిటిజన్లు తరుచుగా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుంది. ఇందుకోసం ప్రతీసారి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉండదు. అందువల్ల వైద్య ఖర్చులు, ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులు రెండింటిని సెక్షన్ 80డి కింద క్లెయిమ్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలి. ఈ తగ్గింపు పరిమితిని కూడా రూ .75 వేలకు పెంచాల్సిన అవసరం ఉంది.
సెక్షన్ 80సి పరిమితి పెంపు
ఆదాయపు పన్ను 1961 చట్టంలోని సెక్షన్ 80సీ కింద నిర్ధిష్ట పన్ను ఆదా పెట్టుబడులపై రూ. 1.5 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది. ఈ పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచాలి. అందరికీ కాకపోయినా, కనీసం సీనియర్ సిటిజన్లకు, వారి వడ్డీ / పెన్షన్ ఆదాయం నుంచి పన్ను భారాన్ని తగ్గించుకునేందకు ఇది ఎంతగానో సహాయపడుతుంది.
ఎస్‌సీఎస్ఎస్ పెట్టుబడులపై పూర్తి మినహాయింపు
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్(ఎస్‌సీఎస్ఎస్) పెట్టుబడులపై వచ్చిన వడ్డీ ఆదాయం, ప్రస్తుతం పన్ను పరిధిలోకి వస్తుంది. స్థిర ఆదాయాన్ని ఇచ్చే పథకాలపై వర్తించే వడ్డీ రేట్లు ఇప్పటికే చాలా తక్కువగా ఉన్నాయి, రాబడిపై పన్ను ఈ పథకాల ప్రయోజనాన్ని మరింత తగ్గిస్తుంది. 2021 బడ్జెట్‌లో ప్రభుత్వం ఎస్‌సీఎస్‌ఎస్ పెట్టుబడులపై వచ్చే వడ్డీ ఆదాయాన్ని పూర్తి పన్ను రహితంగా చేయాలి.
సీనియర్ సిటిజన్లు తమ పెట్టుబడుల కోసం తక్కువ రిస్క్ ఉన్న పథకాలను ఎంచుకోవడం అవసరం. అందువల్ల ఎస్‌సీఎస్ఎస్ పథకానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పథకానికి పన్ను మినహాయింపు ఇవ్వడం ద్వారా సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం చేకూరుతుంది.
సులువుగా గృహ రుణ సౌకర్యం
చాలా మంది పదవీ విరమణ చేసినవారు, సీనియర్ సిటిజన్లు, గృహ రుణం తీసుకొని సొంత ఇల్లు కొనాలని కోరుకుంటారు. సాధారణంగా బ్యాంకులు 60 సంవత్సరాల వయసు వరకు గృహ రుణ దరఖాస్తుకు, తిరిగి చెల్లించేందుకు 70 సంవత్సరాల వయస్సు వరకు అనుమతిస్తాయి. అంటే 65 సంవత్సరాల వయసున్న వ్యక్తి గృహరుణం తీసుకుంటే తిరిగి చెల్లించేందుకు గరిష్టంగా 5 సంవత్సరాల సమయం మాత్రమే ఉంటుంది. గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకునే సీనియర్ సిటిజన్ల వయోపరిమితిని గరిష్టంగా70 సంవత్సరాలకు పెంచాలి, తిరిగి చెల్లించేందుకు 20 సంవత్సరాలు లేదా వ్యక్తికి 80 సంవత్సరాలు నిండేంత వరకు సమయం ఇవ్వాలి. ఇది చాలా మంది సీనియర్ సిటిజన్లకు వారి పదవీ విరమణ పొదుపులను ఉపయోగించి ఇంటిని సొంతం చేసుకునేందుకు సహాయపడుతుంది, అద్దె చెల్లించడానికి బదులుగా ఈఎమ్ఐ చెల్లించి వారి పదవీ విరమణ జీవితాన్ని సొంత ఇంటిలో సాఫీగా సాగించే అవకాశం ఉంటుంది.
సెక్షన్ 80 టీటీబీపై పన్ను ప్రయోజనం పెంచడం..
సీనియర్ సిటిజన్ డిపాజిటర్లకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 8 టీటీబీ కింద బ్యాంక్/ పోస్టాఫీసు డిపాజిట్లపై లభించే వడ్డీ ఆదాయంపై రూ.50వేల వరకు పన్నుమినహాయింపు లభిస్తుంది. సీనియర్ సిటజిన్లు, వారి పెట్టుబడులు కోసం బ్యాంకులు వంటి సురక్షిత మార్గాలనే ఎంచుకోవాలి. ప్రస్తుతం బ్యాంకులు తమ డిపాజిట్లపై తక్కువ వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్నాయి. దానికి పన్నులు కూడా తోడైతే రాబడి తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో వారికి లభించే వడ్డీలో ఎక్కువ మొత్తం పన్ను పరిధిలోకి రాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ మినహాయింపును కనీసం రూ.లక్ష వరకు పెంచాలి.
యాన్యుటీ ఆదాయంపై పన్ను మినహాయింపు ప్రయోజనం పెంచాలి..
సీనియర్ సిటిజన్లు పొందిన యాన్యుటీ ఆదాయానికి, వారికి వర్తించే స్లాబ్ రేటు ప్రకారం పన్ను విధిస్తారు. సీనియర్ సిటిజన్లు పన్ను తప్పించుకునేందుకు ఎక్కువ శాతం కమ్యూటెడ్ పెన్షన్‌ను తీసుకునేందుకు ఇష్టపడతారు. కానీ పదవీ విరమణ తరువాత యాన్యూటీ రూపంలో తీసుకునే అన్‌కమ్యూటెడ్ పెన్షను పన్ను రహితం చేస్తే, పదవీ విరమణ తరువాత రోజు వారి ఖర్చులను సులభంగా అధిగమించే విధంగా పెన్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి, సీనియర్ సిటిజన్స్ కోసం అన్‌కమ్యూటెడ్ పెన్షన్ ఆదాయాన్ని పన్ను రహితం చేయాలి.
ఈక్విటీ షేర్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల దీర్ఘకాల మూలధన లాభాలపై పన్ను తగ్గింపు
లిస్టెడ్ ఈక్విటీ షేర్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల అమ్మకం ద్వారా వచ్చిన దీర్ఘకాలిక మూలధన లాభాలపై ప్రస్తుతం రూ .1 లక్ష వరకు పన్ను మినహాయింపు ఉంది. రూ. లక్షకు పైబడిన లాభాలపై 10శాతం ( సర్‌చార్జ్, సెస్ అదనం) వరకు పన్ను వర్తిస్తుంది. వీటిపై వర్తించే పన్ను మినహాయింపు పరిమితిని ఇతర పెట్టుబడిదారులతో పాటు సీనియర్ సిటిజన్లకు రూ .1 లక్ష నుంచి రూ .2 లక్షలకు పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రత్యామ్నాయంగా, పన్ను రేటును 5శాతానికి తగ్గించడాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించవచ్చు. ఇది సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం చేకూర్చడం మాత్రమే కాకుండా క్యాపిటల్ మార్కెట్లకు కూడా ప్రోత్సాహాన్ని ఇస్తుంది.
ఇదీ చూడండి:పద్దు 2021: ఆశల పట్టాలపై భారతీయ రైలు